రామ్‌గోపాల్ వర్మకు బెయిల్ వస్తుందా..? నేడు మూడు పిటిషన్లపై విచారణ
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన విషయం విదితమే..
దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం.. 17 రోజుల పాటు సాగిన మహా క్రతువు..
ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 17రోజులపాటు జరిగిన మహాసంబరం ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. నభూతో నా భవిష్యత్ అనే తీరులో సాగిన కార్యక్రమానికి భారత దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము.. పలు రాష్ట్రాల గవర్నర్‌లు.. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి, తుమ్మల సహా.. హైకోర్టులో న్యాయమూర్తులు.. ఇతర ప్రముఖులు హాజరై ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు.. దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని ప్రశంసలు కురిపించారు..
నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ..
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ రోజు ( మంగళవారం ) రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు హస్తినలోనే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన సెక్రటరీలు జూమ్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఈ రోజు ( మంగళవారం ) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీలైతే ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డవుతున్నాయి. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తి డిస్ట్రిక్ లో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడూ రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
నేడే భారత రాజ్యాంగ దినోత్సవం.. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన వేడుకలు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్ ( https: //constitution75.com)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ చెప్పుకొచ్చింది. నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా ఈ వేడకలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, ఈరోజు (మంగళవారం) పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. నేటి (మంగళవారం) నుంచి ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం లాంటి కార్యక్రమాలను నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో నిర్వహించబోతున్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖ తెలిపింది. నవంబర్ 26న జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో మాత్రమే జరుపుకునే సెలబ్రేషన్స్ కాదు.. దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోతున్నామన్నారు. నేడు రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు.
గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దీంతో సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఇది అత్యవసర చికిత్స కాదని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
మరోసారి అనుభవానికే పెద్దపీట.. ధోనీ సెలెక్షన్ సూపర్! సీఎస్‌కే ఫుల్ టీమ్ ఇదే
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. ‘డాడీస్ ఆర్మీ’ అనే పేరుకు తగ్గట్టే.. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా.. మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సీఎస్‌కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సీఎస్‌కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు రుతురాజ్ గైక్వాడ్, మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. వేలంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు మళ్లీ జట్టులోకి తీసుకుంది. కివీస్ హిట్టర్స్ డేవాన్ కాన్వే (రూ.6.25 కోట్లు), రరచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)లను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. అలానే సామ్ కరన్ రూ.2.40 కోట్లకు దక్కాడు. అయితే అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం రూ.10 కోట్లు వెచ్చించడం విశేషం. భారత ప్లేయర్స్ ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీ, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠిలను కైవసం చేసుకుంది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి.. 25 మందితో జట్టును సిద్ధం చేసింది.
ఇషాన్, షమీ, సచిన్.. ఈసారి పక్కా కప్! సన్‌రైజర్స్ ఫుల్ టీమ్ ఇదే
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు చేసింది. దాంతో మొత్తంగా 20 మంది ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇందులో విదేశీ ప్లేయర్స్ ఏడుగురు ఉన్నారు. వేలం అనంతరం సన్‌రైజర్స్ వద్ద రూ.20 లక్షలు మిగిలాయి. ‘ ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేశారు. కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన కావ్య.. పటిష్ట జట్టును తయారు చేసుకున్నారు. తొలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య పాప.. టాప్ ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. ఇక రెండో రోజు చిన్న ఆటగాళ్లపై దృష్టి పెట్టారు. ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహమ్మద్ షమీ (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (రూ.కోటి), వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), జిషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), సచిన్ బేబి (రూ.30లక్షలు), అంకిత్ వర్మ (రూ.30 లక్షలు), అథర్వ తైడే (రూ.30 లక్షలు) లాంటి అనామక ఆటగాళ్లతో జట్టును పటిష్టం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇప్పుడు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, ఆడమ్ జంపాలు జత కలిశారు. దాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. ఈసారి పక్కా కప్ సన్‌రైజర్స్ అంటున్నారు. 2024లో కావ్య మేడమ్ టీమ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.