వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం కర్నూలు జిల్లా వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్యను డిస్మిస్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ శంకరయ్య ప్రవర్తన, నిబంధనల ఉల్లంఘన, శాఖ క్రమశిక్షణకు భంగం కలిగించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సీఐ శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపిస్తూ, రూ. 1.45 కోట్ల పరువు నష్టం పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఆ అవకాశాన్ని నిరాకరించడం అన్యాయమని పేర్కొంటూ, హైకోర్టులో కూడా ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తూ తొలి విచారణ చేపట్టిన అధికారి శంకరయ్య. అప్పటినుంచి ఆయన పాత్ర, కేసు నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. ఈ నేపథ్యంలో శంకరయ్యను డిస్మిస్ చేయడం ఆసక్తికరంగా మారింది..
సీఎస్ సర్వీసు పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వీస్ పొడిగింపుతో విజయానంద్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఇక, మూడు నెలల తర్వాత ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్‌కు సీఎస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీ కాలం 2026 మే వరకు ఉండడంతో, ఆ తర్వాత కూడా సీఎస్‌గా కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులకు ప్రభుత్వ స్థాయిలో సమాచారం వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగుతోంది.. ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా కసరత్తు సాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలకు పలు కీలక సూచనలతో లేఖలు పంపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలని రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం అవసరమైన పెద్ద మొత్తంలో బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుండి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అదనంగా పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల విధులకు అందించాలని కూడా SEC భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం కాలంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అయితే, గ్రామ పంచాయతీల పదవీ గడువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2తో ముగుస్తుంది.. మున్సిపల్ సంస్థల గడువు మార్చి 17తో ముగుస్తుంది. MPTC, ZPTC ఎన్నికల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీలతో ముగియనుంది.. మొత్తం 127 మున్సిపాలిటీలలో, 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, 23 చోట్ల ఎన్నికలు జరగలేదు. 17 చోట్ల దశల వారీగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
షాకింగ్.. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు
ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల.. హిందీ మహావిద్యాలయ అటానమస్ రిజిస్ట్రార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్‌ల నిమిత్తం అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ కోర్టుకు హాజరై వివరాణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న హిందీ మహా విద్యాలయానికి ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది షాక్ ఇచ్చింది. హిందీ మహావిద్యాలయం అనుమతులు రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఓయూ విచారణ కమిటీ దర్యాప్తు చేసింది. ఇందులో అక్రమాలు నిజమేనని, అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు విచారణ కమిటీ నిర్థారించింది. దీంతో హిందీ మహావిద్యాలయం స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు చేసింది. అయితే.. ఆ ఏడాది చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా వారి కోర్సు పూర్తి చేసేందుకు ఓయూ ఛాన్స్ కల్పించింది.
ద్విచక్ర వాహనాలపై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
బైక్ ప్రయాణించే వారికి హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే వాహనదారులకు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఇటీవల, కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలకు పిల్లల సైజు హెల్మెట్‌లు, సేఫ్టీ హార్నెస్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజన పిటిషన్‌పై ఈ ఉత్తర్వు వెలువరించింది. చట్టం ప్రకారం రైడర్లు, పిలియన్లు హెల్మెట్‌లు ధరించాలని కోరుతున్నప్పటికీ, పిల్లలకు సరైన సైజు హెల్మెట్‌లు మార్కెట్లో దొరకడం లేదు. దీని కారణంగా, పిల్లలు తరచుగా హెల్మెట్‌లు లేకుండా ప్రయాణిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు తన తీర్పును ప్రకటిస్తూ, చట్టం ఇప్పటికే హెల్మెట్‌లను తప్పనిసరి చేసిందని పేర్కొంది. హెల్మెట్ కంపెనీలు సాధారణంగా పెద్దల కోసం మాత్రమే హెల్మెట్స్ ను ఉత్పత్తి చేస్తాయి. తత్ఫలితంగా, తల్లిదండ్రులు కోరుకున్నప్పటికీ, వారి చిన్న పిల్లలకు సరిగ్గా సరిపోయే హెల్మెట్‌లను కొనుగోలు చేయలేకపోతున్నారు. కోర్టుకు సమర్పించిన ప్రమాదాల డేటా ప్రకారం, దాదాపు 15 శాతం మంది పిల్లలు ద్విచక్ర వాహన ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు. చాలా సందర్భాలలో, పిల్లలు తలకు తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నారు, వాటిలో మెదడు గాయాలు, పుర్రె పగుళ్లు, అంతర్గత రక్తస్రావం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పిల్లలకు సరైన హెల్మెట్ పరిమాణం లేకపోవడం.
ఐటీ దిగ్గజాలతో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌తో సంబంధాలు పెంచుకోవాలని పిలుపు
దక్షిణాఫ్రికాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం మోడీ జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లారు. మూడు రోజులు పాటు జరిగే జీ20 సమ్మిట్‌లో భారత్ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే ఆయా దేశాధినేతలను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇటీవల జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన సనే తకైచితో సహా పలువురు నాయకులను కలవనున్నారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులతో సమావేశం అయ్యారు. ఫిన్‌టెక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు, మరిన్ని రంగాల్లో పని చేస్తున్న లీడర్స్‌తో సంభాషించారు. భారతదేశంతో సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని.. మన ప్రజలతో దగ్గరగా పనిచేయాలని టెక్ దిగ్గజాలకు మోడీ పిలుపునిచ్చారు.
వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమైన మమ్దానీ.. ట్రంప్‌తో చర్చలు
నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్‌హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పరిస్థితులు ఎప్పుడూ.. ఒకేలా ఉండవని చెప్పడానికి ఈ వీడియోనే చక్కటి ఉదాహరణ. జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అంతే ట్రంప్ నోటికి పని చెప్పారు. సైద్ధాంతికంగానే కాకుండా.. మతద్వేషంతో, జాతి వివక్షతో అత్యంత పరుషమైన భాషలో మమ్దానీపై విమర్శల దాడికి దిగారు. మమ్దానీని వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించారు. మమ్దానీ మతవిశ్వాసాన్ని ఎత్తిచూపుతూ ఉగ్రవాద సానుభూతిపరుడు.. హమాస్ ఉగ్రవాది అంటూ మాట్లాడారు. ప్రత్యర్థులు ఎన్ని తిట్టినా మమ్దానీ చిరునవ్వుతోనే ప్రచారంలో దూసుకుపోయారు. తీరా న్యూయార్క్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జోహ్రాన్ మమ్దానీ గెలిచారు.
టాస్ గెలిచిన సఫారీలు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ టెస్ట్‌లో గెలవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి 25 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్ లో టెస్ట్ సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. రెండో టెస్ట్ కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కగిసో రబాడా గాయంతో దూరమయ్యాడని ధృవీకరించగా, సైమన్ హార్మర్ భుజం గాయం కారణంగా జట్టులోకి రావడం సందేహాస్పదంగా మారింది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేయగా, దక్షిణాఫ్రికా జట్టు ఒక మార్పు చేసింది. శుభ్‌మాన్ గిల్ స్థానంలో నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తొలగించి సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు కూడా ఒక మార్పు చేసింది. కార్బిన్ బాష్ స్థానంలో స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామి జట్టులోకి వచ్చారు. దీనితో ఆఫ్రికన్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు, ఇప్పటికే కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ ఉన్నారు.
కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..
యాక్టింగ్ చేస్తూనే డైరెక్షన్‌ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. అజయ్ దేవగన్, కంగనా లాంటి కొద్దిమంది మాత్రమే ఈ బ్యాలెన్స్‌ను ప్రూవ్ చేశారు. ఇప్పుడు కీర్తి కూడా ఆ లిస్టులో చేరేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తుంది. ‘మహానటి’ లో సావిత్రి గారి వంటి గొప్ప నటిగా మెప్పించిన కీర్తి, నిజ జీవితంలో కూడా ఆమెలాగే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ చాలా ఆసక్తికరం. ఇక వ్యక్తిగత విషయాల్లో కూడా కీర్తి తన భర్త గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త సినిమాల జోలికి రారు నాతో నటించే ఛాన్స్ లేదు’’ అని నవ్వుతూ చెప్పింది. అంటే ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను ఆమె ఎంత ప్రాక్టికల్‌గా బ్యాలెన్స్ చేస్తోందో అర్థమవుతోంది. దీంతో భర్త సపోర్ట్ ఉన్నా, తన కెరీర్‌ను తనే నిర్మించుకోవాలనే ఆత్మవిశ్వాసం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, మహిళల భద్రతపై కీర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచింపజేస్తున్నాయి. తనకూ, సమంతకూ సంబంధించిన ఒక డీప్‌ఫేక్ వీడియో చూసి ఎంత భయపడిపోయానో చెప్పిన ఆమె, ‘‘ఇలాంటి సైబర్ ముప్పుల నుంచి మహిళలను రక్షించేందుకు విదేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు మన దేశంలో కూడా రావాలి’’ అని డిమాండ్ చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకాతో ర్యాపో గట్టెక్కుతాడా..?
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అండ్ రెడ్ చిత్రాలతో ఊర మాస్ అవతార్‌లోకి ఛేంజైన రామ్‌ని సక్సెస్ ట్రాక్ నుండి ఫ్లాఫుల్లోకి నెట్టేశాయి, ద వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు. కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి, బోయపాటి, పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్స్‌తో కొలాబరేటైన హిట్ 4 ఏళ్లుగా రామ్‌తో దోబూచులాడుతోంది. అందుకే నెక్ట్స్ స్టార్ డైరెక్టర్స్ ని , సీనియర్ దర్శకుల్ని పక్కన పెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఫ్రూవ్ చేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో సినిమాను సెట్ చేశాడు రామ్. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడని భాగ్యశ్రీ బోర్సే జోడీ కట్టింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రీసెంట్ గా బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో టేస్ట్ చేశాడు రామ్. ఈ ఈవెంట్ తర్వాత కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు శాండిల్ వుడ్ ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత రామ్‌పై పడింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ర్యాపోను ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారో నవంబర్ 27న తేలిపోనుంది.
రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట. దీంతో పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. కానీ మెగాభిమానులు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షాట్‌తో పాటు చికిరి సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘చికిరి’ సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్స్టాంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చికిరి వైబే కనిపిస్తోంది. మరోవైపు ‘పెద్ది’ నిర్మాతలు ఇప్పటికే నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేశారు. అలాగే.. థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయినా కూడా పెద్ది వాయిదా తప్పదనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అయితే, మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో పెద్ది రూపొందుతోంది.