వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది.. ముఖ్యంగా ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తోంది చలి.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చలి అలుముకుంది.. ఈ సీజన్‌లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగుల, మినుములూరు ప్రాంతాల్లో 5 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ అంతటా సింగల్ డిజిట్ టెంపరేచర్లు కొనసాగుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు అధికంగా ఉండటంతో తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 10 గంటలు వరకూ సూర్యుడు ముఖం చూపించకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ చలి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింటర్ టూరిజం పెరిగిపోయింది.. వంజంగి మెఘాలకొండ పై సూర్యోదయం అందాలను దర్శించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.. ప్రతీ ఏడాది వింటర్‌లో ఏజెన్సీ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివచ్చే విషయం విదితమే.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది..
భక్తులకు షాక్.. అన్నవరం దేవస్థానంలో వసతి గదుల అద్దె భారీగా పెంపు..
సత్య దేవుని భక్తులకు షాక్ ఇచ్చారు అధికారులు.. వసతి గదుల అద్దె భారీగా పెంచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. ఈ కొత్త అద్దెలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి. కొత్త అద్దెల వివరాల్లోకి వెళ్తే.. హరిహర సదన్‌లో ఇప్పటికి వరకు అద్దె రోజుకు (24 గంటలకు) రూ.950గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని రూ.1,500కి పెంచారు.. సత్రం గది రోజుకు రూ.600గా ఉంటే… ఆ మొత్తాన్ని రూ.800కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రకాశ్ సదన్‌లో ఇప్పటి వరకు రోజుకు రూ.999గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ.1,260 వసూలు చేయనున్నారు.. న్యూ CCC/ఓల్డ్ CCC లో రూ.500 ఇప్పుడు వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.700కు చెల్లించాల్సి ఉంటుంది.. సౌకర్యాల మెరుగుదల కోసం ధరల పెంపు అంటున్నారు అధికారులు..
అటవీశాఖలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అటవీ శాఖ ఉద్యోగాల పేరుతో భారీ మోసం బయటపడింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మించి, ఇద్దరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేయాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పాడ కొత్తపల్లి నివాసి నవంత్, ఆలమూరు చెందిన రాజ్‌కుమార్.. ఇద్దరూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వేళ, ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి సూచనతో జల్లూరు రాజ్‌కుమార్, యర్రంశెట్టి ప్రసాద్‌లను పరిచయం చేసుకున్నారు. ఇద్దరూ “అటవీ శాఖలో పోస్టులు ఇప్పిస్తాం.. ఒక్కరికి 10 లక్షల రూపాయాలు ఖర్చు అవుతుందని పురమాయించారు.. డబ్బులు తీసుకునేందుకు రాజమండ్రి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా పిలిపించిన రాజ్‌కుమార్, నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వడంతో నిరుద్యోగులకు అనుమానం వచ్చి రేంజ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఒత్తిడితో రాజ్‌కుమార్ మరో వ్యక్తి ప్రసాద్‌ను కూడా అక్కడికే రప్పించగా, ఇద్దరిపై పోలీసుల ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో FIR నంబర్ 282/2025గా కేసు నమోదు చేసి సీఐ మురళీకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో.. కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తుల కష్టాలు..
కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా కళ్యాణం టికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాజన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పూర్తిగా అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. గతంలో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కనుగుణంగా 150 నుండి 200 నిత్య కళ్యాణం అర్జితసేవ టికెట్ల జారి చేసేవారు. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా ప్రస్తుతం పార్వతీపురం నిత్యాన్నదాన సత్రంపై స్వామివారి నిత్య కళ్యాణం కొనసాగిస్తున్నారు. స్థలం తక్కువగా ఉండడంతో ఇక్కడ 80 టికెట్ల వరకే కుదింపు విధించారు. వివాహాది శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరగడంతో రాజన్న నిత్య కల్యాణ అర్జిత సేవకు రద్దీ పెరిగింది. రద్దీ కనుగుణంగా ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజన్న భక్తులు. నేటి ఉదయమే కళ్యాణం టికెట్ల కోసం కౌంటర్ వద్ద పడి కాపులు కాసిన భక్తులకు టికెట్లు అందకపోవడంతో అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
అయ్యో దేవుడా.. కడుపులో ఉన్న కవలలు మృతి.. చికిత్స పొందుతూ తల్లి మృతి.. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త..
ఆ దంపతులు పెళ్లై ఏడేళ్లైన పిల్లలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి ఆడిన వింతనాటకంలో కడుపులోని పిల్లలతో సహా భార్యాభర్తలు కూడా మృతిచెందారు. ఈ విషాద ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందారని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఐన్స్‌ప్సెక్టర్ బాల్‌రాజ్ వివరించారు… కర్ణాటక బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్ లోని సామ ఎన్‌క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే ప్రవీణ్ భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్ లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!
వామ్మో.. ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దేశ వ్యాప్తంగా కారు బ్లాస్ట్‌లకు డాక్టర్ల బృందం ప్రణాళికలు రచించినట్లుగా అనుకున్నారు. కానీ తాజాగా జమ్మూ కాశ్మీర్ నివాసి జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను అరెస్టు చేశాక.. అంతకు మంచిన కుట్ర జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది. అక్టోబర్ 7, 2023.. ఈ తేదీ గుర్తుందా? మరిచిపోయే డేట్ కాదు. ఇజ్రాయెల్ చరిత్రలో చీకటి రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సేమ్… ఇదే తరహాలో ఉగ్ర డాక్టర్ల బృందం కూడా భారత్‌పై విరుచుకుపడాలని కుట్ర పన్నినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ మేరకు డానిష్ అరెస్ట్ తర్వాత ఈ కొత్త కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.
ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ.. వైట్‌హౌస్ ప్రవేశం దొరికేనా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య నిన్నామొన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ముందు ఓ రేంజ్‌లో ట్రంప్ విరుచుకుపడ్డారు. మమ్దానీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతే రీవర్స్‌లో మమ్దానీ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిణామాలు మారినట్లుగా తెలుస్తోంది. తాజాగా మమ్దానీ.. ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు. మమ్దానీ అపాయింట్‌మెంట్ కోరారని.. వైట్‌హౌస్‌లో సమావేశానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘‘న్యూయార్క్ మేయర్ మాతో కలవాలనుకుంటున్నారు. మేము ఏదైనా చేస్తాము.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. మొత్తానికి నెలల తరబడి వైరం తర్వాత ట్రంప్-మమ్దానీ మధ్య స్వరంగా మారినట్లుగా కనిపిస్తోంది.
షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఐక్యరాజ్యసమితి..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నిరసనలపై జరిగిన హింసాత్మక అణచివేత, సంబంధిత మానవ హక్కుల ఉల్లంఘనలపై తాజా తీర్పుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (OHCHR) మరోసారి షేక్ హసీనా మరణశిక్షను తీవ్రంగా ఖండించింది. కానీ బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది.
240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 200MP కెమెరాతో Oppo Reno 15 సిరీస్ లాంచ్..!
Oppo Reno 15 సిరీస్ చైనాలో తాజాగా విడుదలైంది. నవంబర్ 2025లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో (Oppo) ఈ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో Reno 15 Pro, Reno 15 అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటికి MediaTek Dimensity చిప్‌సెట్‌తో పాటు, గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లతో విడుదలయ్యాయి. రెండు ఫోన్లలోనూ స్క్వేర్ మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో కలిసి అందించబడింది. వివిధ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు నవంబర్ 21 నుంచి చైనాలో అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఇక వీటి ధరల విషయానికి వస్తే, Reno 15 Pro సిరీస్‌లో 12GB + 256GB మోడల్ ధర CNY 3,699 (రూ.46,000)గా నిర్ణయించబడగా, 12GB + 512GB వేరియంట్ CNY 3,999 (రూ.50,000)కి లభిస్తుంది. 16GB + 512GB మోడల్ CNY 4,299 (రూ.54,000) కాగా, టాప్-ఎండ్ 16GB + 1TB వేరియంట్ CNY 4,799 (రూ.60,000)గా ఉంది. ఇక Reno 15 మోడల్ 12GB + 256GB వేరియంట్ CNY 2,999 (రూ.37,000) నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్లు CNY 3,299 నుండి CNY 3,599 (రూ.41,000–రూ.45,000) మధ్య లభిస్తాయి. టాప్ మోడల్ 16GB + 1TB ధర CNY 3,999 (రూ.50,000)గా ఉంది. Reno 15 Pro స్టార్ లైట్ బౌ, హనీ గోల్డ్, కానేలే బ్రౌన్ కలర్లలో, Reno 15 మాత్రం అరోరా బ్లూ, కానేలే బ్రౌన్, స్టార్ లైట్ బౌ, సాంగ్ యుకీ ఎడిషన్ రంగులలో లభిస్తుంది.
‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. అయితే ఓ చిన్న సాంకేతిక లోపం కారణంగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోవడంతో రాజమౌళి కాస్త అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ ‘ నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడూతూ టెన్షన్ పడకు అంత హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఆగినప్పుడు ఇలానే నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమా హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇలా ఎందుకు అయిందని కోపం వచ్చింది’ అని అన్నారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హనుమంతుడిపై ఎస్ఎస్ రాజమౌళి పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు. రాజమౌళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు.
ఓటీటీలో అదరగొడుతున్న డ్యూడ్..
గత వారం బోలెడన్నీ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కె ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన డ్యూడ్ అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజై రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అనుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన డ్యూడ్ ఓటీటీలోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన డ్యూడ్ మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ వారం టాప్ లో ట్రేడింగ్ అవుతుంది. ప్రదీప్, మమిత బైజు మధ్య ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ మెప్పించాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్ ఆడియెన్స్ తో పాటు ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది డ్యూడ్. ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ని విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతుండడంతో త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించాడు సాయి అభ్యంకర్. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మరికొన్నీ సినిమాలు ఓటీటీలో ప్లాప్ అయ్యాయి.