ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి-శబరి నదులు
అల్లూరి జిల్లా చింతూరు కి శబరి నదికి వరద తాకిడి పెరిగింది ప్రమాదకరస్థాయిలో 45 అడుగుల వద్దకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా సీలేరు, డొంకరాయి జలాశయాల్లో వరద నీరు చేరడంతో అధికారుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనితో ఒక్కసారి చింతూరుకు వరద నీరు చేరింది. ఈ వరద ప్రవాహానికి రాత్రికి రాత్రే వేగంగా పెరిగి ఇళ్ల వద్దకు నీరు చేరింది.. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో చింతూరుకు వరద ముప్పు తప్పేలా లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చింతూరు మండల ప్రజలు.. మరోవైపు కూనవరం శబరి – గోదావరి సంగమం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. ఇటు శబరి, అటు గోదావరి నదుల్లో వరద వేగంగా పెరుగుతుండటంతో కూనవరం, వీఆర్ పురం మండలాల ప్రజలు కూడా ఇళ్లు ఖాళీ చేసి పనిలో పడ్డారు.. వీఆర్ పురం మండలంలోని పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు.. భేటీకి ముందే చర్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్‌ను విధుల నుంచి తప్పించింది.. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది.. కాగా.. ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.. ప్లాంట్ లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన పరిణామాలు కనిపించాయి.. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలో ఆరోపిస్తున్నాయి.. 19 వేల పైచిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు.. ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.. అయితే, ఇప్ఉడు సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది వేచిచూడాల్సిన అంశంగా ఉంది.. ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
నేడు సీఎం రేవంత్ రెడ్డితో 16వ ఆర్థిక సంఘం భేటీ..
తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం రెండు రోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. నేడు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో భేటి కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని కోరనుంది.
నేడు ప్రజావాణి రద్దు.. రేపటికి వాయిదా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య తెలిపారు. నేడు ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున ఇవాళ నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు ఆమె తెలిపారు. ఈ మార్పును అనుసరించి అర్జీదారులు బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిని మంగళవారానికి బదులు బుధవారానికి మార్చినట్లు, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించగలరని అన్నారు. అంతేకాకుండా.. హైదారబాద్, రాష్ట్రంలోని జిల్లాలోని అర్జీదారులు ప్రజావాణి మార్పును గమనించాలని కోరారు. అర్జీదారులు ప్రజాభవన్ వద్దకు ఇవాళ రావద్దని కోరారు. వచ్చి మళ్లీ ఇబ్బందులకు గురి కావద్దని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు రేపు (బుధవారం) ప్రజాభవన్ కు అర్జీలతో రావాలని కోరారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పలు శాఖలపై దాడులు కూడా జరిగాయి. అయితే.. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిణిగా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ..
హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దీనికి బాధ్యత వహించాలని పిటిషనర్ హైడ్రా కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పలు రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసిన వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల సాగర్ కలుషితం అవుతుందని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతాయా లేదా అనే దానిపై ఇవాళ కోర్టులో తేలిపోనుంది. కాగా మరోవైపు వినాయక చవితి నుంచి మూడు రోజులుగా పూజలు చేసిన భక్తులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. ముమ్మరంగా సహాయక చర్యలు..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడే సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్‌కు కూడా భారీగా అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా, సోన్‌ప్రయాగ్ – గౌరీకుండ్ మధ్య కొండపై నుండి శిధిలాలు పడటంతో ఒకరు మరణించారు. అలాగే ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 7:20 గంటలకు సోన్‌ప్రయాగ్, ముంకతీయ మధ్య రహదారిపై పర్వతం నుండి శిధిలాల కారణంగా కొంతమంది ప్రయాణికులు సమాధి అయ్యారని సోన్ ప్రయాగ్ పోలీస్ స్టేషన్ నుండి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, సెక్టార్ మెజిస్ట్రేట్ లను సంఘటనా స్థలానికి పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల పడి ఒకరు మృతి చెందగా, గాయపడిన ఇద్దరు వ్యక్తులను బయటకు తీశారు. వారిని అంబులెన్స్‌లో సోన్ ప్రయాగ్ ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చీకటి, వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లోనూ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఘటనా స్థలంలో కృత్రిమ లైటింగ్ ఏర్పాటు చేశారు.
‘యాపిల్’ నుంచి వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. సిరీస్ 9తో పోలిస్తే.. సిరీస్ 10 డిస్‌ప్లే పెద్దగా ఉండడంతో పాటు సన్నగా ఉంటుంది. సిరీస్ 10 వాచ్‌లు అల్యూమినియమ్, పాలిష్‌డ్ టైటానియమ్ పినిష్‌తో వచ్చాయి. దీంతో ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఎస్ 10 చిప్‌తో పనిచేసే ఈ సిరీస్‌లో ‘స్లీప్ ఆప్నియా’ ఫీచర్ ఉంది. ఇది నిద్రలో శ్వాస సంబంధించిత ఆటంకాలను గుర్తిస్తుంది. సిరీస్ 9తో పోలిస్తే వేగంగా ఛార్జింగ్ అవుతుంది. 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. జీపీఎస్ ధర 399 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. జీపీఎస్ ప్లస్ సెల్యూలార్ ధర 499 డాలర్లు కాగా.. అల్ట్రా 2 ధర 799 డాలర్లుగా ఉంది. యాపిల్ ఎయిర్‌ప్యాడ్ 4లో సిరి ఫీచర్‌ను ఇచ్చారు. టైప్ సీ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. యాపిల్ వాచ్ ఛార్జర్‌లతో పాటు ఇతర వైర్‌లెస్ ఛార్జర్లను సైతం వాడుకోవచ్చు. ఈ ఎయిర్‌ప్యాడ్ 30 గంటల బ్యాటరీని ఇస్తాయని కంపెనీ తెలిపింది. ఎయిర్‌పాడ్స్ 4 ధర 129 డాలర్లుగా ఉంది. యాక్టివ్ నాయిస్ క్యానిసిలేషన్ మోడల్ ధర 179 డాలర్లుగా కంపెనీ పేర్కొంది.
సర్ఫరాజ్ ఖాన్‌కు.. స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్?
సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యారు. దాంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడడం ఖాయం. దాంతో ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. రాహుల్‌పైనే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఉంది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడడం కూడా రాహుల్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ (డిఫెన్స్ లేదా హిట్టింగ్) కూడా చేయగలడు.
విజయ్ GOAT 4 డేస్ కలెక్షన్స్.. అక్కడ నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 3 గంటలకు పైగా నిడివి, అక్కడక్కడా లాగ్, రొటీన్ కథ కావడంతో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది గోట్. విజయ్ యంగ్ గెటప్ లుక్ పట్ల ఫ్యాన్స్ కూడా నిరుత్సహానికి గురయ్యారు. ఎన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన గోట్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 కోట్లతో అదిరిపోయే స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి వీకెండ్ ముగిసేనాటికి 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు కేరళలో ఈ చిత్రం భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. మొదట రోజు రూ. 5. 80 కోట్లు మాత్రమే రాబట్టింది. 4 రోజులకు గాను రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గోకులం మూవీస్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రూ.22 కోట్లకు goat థియేట్రికల్ రైట్స్ ను కొంగలు చేయగా మొదటి 4రోజులకు గాను 10.10 కోట్లు రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే బిగ్ జంప్ రావాలి. అది సాధ్యం అయ్యే పనే కాదు. కన్నడలో మాత్రం రూ.21.10 కోట్లు రాబట్టి స్టడీగా సాగుతుంది. అటు ఓవర్సీస్ లో మాత్రం దుమ్ముదులుపుతుంది ఇప్పటివరకు $14.26M ( 120కోట్లు) కొల్లగొట్టింది.
తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చూడాలంటే షరతులు వర్తిస్తాయ్..
తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా వచ్చిన చిత్రం తంగలాన్. అక్కడి బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే తెరపై కళ్ళకి కట్టినట్టు తెరకెక్కించాడు దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం థియేటర్లలోరన్ అవుతున్న ఈ సినిమా 25 రోజుల పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. విడుదల అయి నాలుగు వారలు కావొస్తున్నా నేపథ్యంలో తంగలాన్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సెప్టెంబరు 27న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ లేటెస్ట్ హిట్ సినిమా. అప్పట్లో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి చాలా ఆస్కారం ఉందని, రెండో పార్ట్ అయితే కచ్చితంగా ఉంటుందని. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు భాగాలుగా కూడా తీసుకువస్తామని అన్నారు హీరో విక్రమ్. మరి తంగలాన్ 2 ఉంటుందో లేదో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.