లోకేష్‌పై మంత్రి రోజా ఫైర్.. వైసీపీ నేతలను ఎందుకు చీపుర్లతో కొట్టాలి..?
వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా? డ్వాక్రా రుణాలపై టీడీపీ వైఫల్యాలను బయటపెట్టినందుకా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. డ్వాక్రా రుణాల రూ.24,000 కోట్ల (సూత్రం + వడ్డీ) మాఫీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్‌ఱెడ్డి ప్రభుత్వం అని మీరు తెలుసుకోవాలని లోకేష్‌కు చూపించారు రోజా.. అసలు ఇప్పుడు చెప్పండి ప్రజా తిరుగుబాటు జరగాల్సింది టీడీపీపైనా, వైసీపీపైనా ? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా..
షర్మిల నీకు జరిగిన అన్యాయాన్ని ఏపీలో ప్రచారం చేసుకో
వైఎస్సార్‌టీసీ అధినేత్రి వైయస్ షర్మిలపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడంలో షర్మిల, విజయమ్మ పాత్ర కీలకమన్నారు. అయితే.. షర్మిల నీకు జరిగిన అన్యాయాన్ని ఏపీలో ప్రచారం చేసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ ఆమె శక్తిని సమయాన్ని, వనరులను వృధా చేసుకుంటుందని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగునా తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్ట్స్ లను పట్టుకొని స్పీకర్ ముందు నిలబడ్డాడని, సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి, తిరిగి తెలంగాణలోనే రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఉండడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని కడియం శ్రీహరి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లిన తర్వాత వైఎస్ షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు, విజయమ్మకు అన్యాయం చేసి వీరిని రాజకీయంగా పక్కకు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని, నీకు ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్ళు అంటూ షర్మిలపై మండిపడ్డారు కడియం శ్రీహరి.
భక్తులకు శుభవార్త.. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవక్షేత్రాలకు వెళ్లి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది టీఎస్‌ఆర్టీసీ. అయితే.. మహా శివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు రంగారెడ్డి రీజియన్ నుండి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 16 నుండి 19 వరకు నడపబడతాయి. టీఎస్‌ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ మరియు ఇతర ప్రాంతాల నుండి నగరం నుండి ప్రారంభమవుతాయి. MGBS నుండి శ్రీశైలం వరకు సూపర్ లగ్జరీకి రూ.600, డీలక్స్‌కు రూ.540, ఎక్స్‌ప్రెస్‌కి రూ.460గా నిర్ణయించారు టీఎస్‌ఆర్టీసీ అధికారులు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు సూపర్ లగ్జరీకి రూ.650, డీలక్స్‌కు రూ.580, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.500గా నిర్ణయించారు.
సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు.. తేల్చేసిన నిర్మలాసీతారామన్
సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాల వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్.. సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని క్లారిటీ ఇచ్చారు.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో వివరించిన ఆమె.. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు. అదే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలని వెల్లడించారు. మరోవైపు.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాలపై ఎదురైన మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్ 4 శాతంకు మాత్రమే పరిమితమైందన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు రాజ్యసభలో ప్రకటించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
2 కోట్ల మందిపై భూకంప ప్రభావం.. ఇప్పటివరకు 5 వేల మంది మృతి
టర్కీ, సిరియా దేశాల్లో వచ్చిన భూకంపం ఆ దేశాలను మరుభూమిగా మార్చాయి. ఎక్కడ చూసిన ప్రజల ఏడుపులు, కూలిన కట్టడాలే దర్శనం ఇస్తున్నాయి. సోమవారం వచ్చిన వరస భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీ, సిరియాలను అతలాకుతలం చేశాయి. ఇప్పటికే భూకంపం వల్ల మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 5102 మంది మరణించారు, ఒక్క టర్కీలోనే 6000 భవనాలు కూలిపోయాయి. శిథిలాలు వెలికితీసే కొద్ది మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి 8 రెట్లు మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఈ భూకంపం వల్ల ఇరు దేశాల్లో 2.30 కోట్ల మంది ప్రజలు ప్రభావితం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గత 12 ఏళ్లుగా సుదీర్ఘమైన సంక్షోభంలో ఉన్న సిరియాకు అత్యధికంగా మానవతా సాయం కావాలని వెల్లడించింది. 1.4 మిలియన్ పిల్లలతో పాటు 23 మిలియన్ల మంది ప్రజలపై భూకంప ప్రభావం ఉంటుందని వెల్లడించింది. దక్షిణ టర్కీలో వేలాది మంది మరణించారని తెలిపింది. మంగళవారం రోజు కూడా టర్కీలో 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. రెండు రోజుల వ్యవధిలో 100కు పైగా ప్రకంపనలు వచ్చాయి.
ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..సూర్యకుమార్‌కు లైన్ క్లియర్!
బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్వదేశంలో ఓటమంటూ ఎరుగని టీమిండియా ఈసారి కూడా ఆ రికార్డు కొనసాగించాలని చూస్తోంది. మరోవైప్ ఆసీస్ మాత్రం ఎలాగైనా ఈ సిరీస్ ఎగరేసుకుపోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసమే సొంతంగా స్నిన్ పిచ్‌లు తయారు చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇండియాపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్ కంటే ఎక్కువన్న ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మాటల్ని బట్టే ఈ సిరీస్ గెలుపు వారికి ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. దీంతో ఇండియా కూడా సకల అస్త్రాలు సిద్ధం చేస్తోంది. హెడ్ కోచ్ ద్రవిడ్ సారథ్యంలో ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది. ఈ క్రమంలోనే.. స్పిన్నర్లనే కాదు ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడాలని బ్యాటర్లకు చెబుతున్నాడట. గత ఆసీస్ పర్యటనలో రిషభ్ పంత్ దూకుడు మంత్రంతోనే సక్సెస్ అయ్యాడని, జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడని భారత బ్యాటర్లకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్స్‌లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల చేత ద్రవిడ్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేయించాడని సమాచారం. స్పిన్నర్లతో పాటు పేస్ బౌలింగ్‌లోనూ ఎదురు దాడికి దిగాలని, ఆచితూచి ఆడితే జట్టుకు నష్టం కలుగుతోందని ద్రవిడ్ ఆటగాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.
సి.ఎస్.ఐ. సనాతన్’ డేట్ లాక్ చేశాడు!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఇందులో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ విడుదల తేదీని మంగళవారం చిత్ర దర్శక నిర్మాతలు లాక్ చేశారు. మార్చి 10వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ విడుదలై… మూవీ మీద ఆసక్తిని కలిగించాయి. ఓ యువ పారిశ్రామిక వేత్త హత్య జరిగిన తర్వాత ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ చెబుతారు. వారిలో హంతకుడిని సనాతన్ ఎలా కనిపెట్టాడనే దాన్ని దర్శకుడు శివ శంకర్ దేవ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారని నిర్మాత అజయ్ శ్రీనివాస్ తెలిపారు. అలీ రెజా, నందినీరాయ్, తాకర్ పొన్నప్ప, మధుసూదన్, వాసంతి, ఖయ్యూమ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అనీశ్ సోలోమాన్ సంగీతాన్ని అందించారు.
మంచి కోసం సినిమాలు తీసే గొప్పవాళ్ళు లేరిక్కడ.. అంతా వ్యాపారమే
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసుకు ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేస్తాడు. ముఖ్యంగా తన చిరంజీవి ని కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వాళ్లు ఎంతటి వాళ్లైనా అసలు వదిలిపెట్టడు. జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న నాగబాబు పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇక ట్విట్టర్ లో అయితే నాగబాబు చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఈ మధ్య సినిమాలను చూసి ప్రజలు చెడిపోతున్నారు అని కొందరు అన్న మాటలపై నాగబాబు స్పందించాడు. ” సినిమాల్లో చూపించే వైలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిల్మ్ మేకర్ గా ఒకటి నిజం,సినిమాలు ఎంటర్ టైన్మెంట్ కోసమే, జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తీసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇది కేవలం వ్యాపారం. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్.సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ వుంది. కుహనా మేధావులు ఏడవకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వైలెన్స్ ఉంది అంటే.. దాన్ని సెన్సార్ చూసాకనే బయటకి వచ్చింది. అది కూడా తెలియదా..? ఏవి కట్ చేయాలో.. వారికి తెలుసు.. ఇక ఏడవకండి అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. మరి ఇందుకు సమాధానం ఎవరి నుంచో వస్తుందో చూడాలి.