ఏపీలో జోరుగా లిక్కర్ సేల్స్
2022 ఏడాదికి బైబై చెప్పి.. 2023 ఏడాదికి స్వాగతం పలుకుతోంది ప్రపంచం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. న్యూఇయర్ జోష్‌తో భారీగా పెరిగాలయి లిక్కర్ సేల్స్.. గత మూడు రోజుల నుంచి భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈ నెల 29వ తేదీన సుమారు రూ. 73 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగగా.. ఈ నెల 30వ తేదీన ఏకంగా రూ. 108 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగాయి.. ఇవాళ సాయంత్రానికే రూ. 71 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగాయి.. మామూలు రోజుల్లో ఏపీలో సరాసరి రోజుకు రూ. 64 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి.. కానీ, న్యూఇయర్ జోష్‌లో సేల్స్ పెరిగాయి. ఇక, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రెండింతల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇవాళ ఒక్క రోజే సుమారు రూ. 130 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.. డిసెంబర్-31న మద్యం అందుబాటులో ఉంటుందో లేదోనని మందుబాబులు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు చేస్తున్నారు.. అత్యధికంగా ఇవాళ విశాఖలో రూ. 9 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగగా.. అత్యల్పంగా అనంతపురంలో రూ. 3 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.. అయితే గతేడాది కంటే ఈసారి మద్యం అమ్మకాలు తక్కువేనంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులు.
వీఆర్‌వోలను తొలగిస్తే గ్రామలకు పట్టిన పీడ పోతుంది..
మరోసారి హాట్ కామెంట్లు చేశారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి.. గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన ఆయన.. ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఉన్న వీఆర్వో, వీఏవోలను తొలగిస్తే గ్రామలకు పట్టిన పీడ పోతోందంటూ సంచలన కామెంట్లు చేశారు.. గ్రామ, వార్డు సచివాలయలలో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన.. రెవెన్యూలో ఉన్న వీఆర్వో, వీఏవోలను అటెండర్లుగా పంపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ప్రకటించారు చెన్నకేశవరెడ్డి..
అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు.. న్యూ ఇయర్ ఫ్లెక్సీ వార్..
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయగిరి, దుత్తలూరు, నందవరం.. తదితర ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫొటోను కూడా పొందుపర్చి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫ్లె్క్సీలను ఏర్పాటు చేశారు.. అయితే, ఈరోజు వాటిని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు చించి వేశారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు.. తాము కూడా వైసీపీకి చెందిన వారమేనని.. ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం భావ్యం కాదని మండిపడుతున్నారు.. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే.. తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుబ్బారెడ్డి. మొత్తంగా.. 2022 ఏడాదికి గుడ్‌బై చెబుతూ.. 2023 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాయి.
సీఎంతో కొత్త డీజీపీ భేటీ
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేశారు. తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ లాఠీని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డితో పాటుగా పలువురు పోలీసుల ఉన్నతాధికారులు నూతన పోలీసు బాస్ అంజనీకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహేందర్ రెడ్డికి సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. అయితే.. లకడీకాపూల్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ నూతన డీజీపీగా శనివారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు అంజనీ కుమార్ ఛార్జ్ తీసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభద్రతకు తెలంగాణ పెద్ద పీట వేస్తుందని.. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజన్ లాంటిదని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శమని, ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలన్నారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది
అయ్యప్ప స్వామిని ఉద్దేశించి బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సమాజంలోని ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టదని, అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ అయ్యాడు. నేడు వరంగల్‌లో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు.. కొత్త ఏడాదికి న్యూజిలాండ్ స్వాగతం
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2022కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2023కి స్వాగతం పలికారు. వీరితోపాటు పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకల సందడికి శ్రీకారం చుట్టారు. న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. మరోవైపు.. భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు. జపాన్ సైతం మనకంటే మూడు గంటలు ముందే 2023లోకి అడుగుపెట్టనుంది. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఛాధమ్ దీవులు, రాజధాని ఆక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కాల్చి సందడి చేశారు. పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ అక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇలా వరుసగా ప్రపంచంలోనే తొలుత ఆక్లాండ్‌లో కొత్త ఏడాది 2023 వచ్చింది.
రిషబ్ పంత్ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. ముఖం మీద అయిన గాయాలకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు పేర్కొన్నారు. తొలుత ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. మ్యాక్స్‌లోనే శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు శ్యామ్ శర్మ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారత వికెట్ కీపర్-బ్యాటర్ శుక్రవారం ఉదయం తన మెర్సిడెస్ బెంజ్‌లో ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతో అతని కారు మంటల్లో చిక్కుకుంది. పంత్ తన కుడి మోకాలిలో లిగమెంట్ స్థానభ్రంశం కాగా.. అతని నుదిటిపై గాయాలైనప్పటికీ అదృష్టవశాత్తు కారు నుంచి బయట పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
భారత్‌లోకి ఎంట్రీ
ప్రమాదకరమైన కోవిడ్ XBB.1.5 వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన మొదటి కేసు గుజరాత్‌లో నమోదైంది. మునుపటి వేరియంట్ BQ.1 కంటే ఇది 120 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌ను నిపుణులు ఇటీవల అమెరికాలో కనుగొన్నారు. దీనిని సూపర్ వేరియంట్ గా పిలుస్తున్నారు. దీంతో దవాఖానాల్లోకి వచ్చే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చైనీస్ మూలాలు కలిగిన అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్డింగ్, ఇతర అన్ని రకాల కంటే వేగంగా మన రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్‌ని గుర్తించిన 17 రోజుల్లోనే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దీని R విలువ BQ.1 యొక్క R విలువ కంటే ఎక్కువగా ఉంది. BQ.1 కంటే 108 శాతం వేగంగా విస్తరిస్తోంది. దీని విస్తరణ క్రిస్మస్ ముందు ప్రారంభమైంది. ఇప్పుడు విస్తరణ రేటు 120 శాతంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గత రెండు వారాల్లో ఈ కొత్త వేరియంట్‌కు గురైన వ్యక్తుల సంఖ్యను యూఎస్ సీడీసీ వెల్లడించలేదని ఎరిక్ చెప్పారు. చైనా మాదిరిగానే అమెరికా కూడా ఈ కొత్త వేరియంట్ డేటాను దాచిపెట్టిందని ఆరోపించారు. అతను కేవలం 40 శాతం విస్తరణ రేటు వాదనలను అబద్ధాలని కొట్టిపారేశాడు. XBB.1.5 వేరియంట్ అమెరికన్ నగరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఎన్‌ఐఏ రికార్డు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్‌ఐఏ) 2022లో 73 కేసులను నమోదు చేసింది. ఇది 2021లో 61 కేసులు నమోదు కాగా.. 2022లో 19.67 శాతం పెరిగి 73 కేసులు నమోదయ్యాయి. ఇది ఎన్‌ఐఏకు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ కేసుల్లో జమ్మూకశ్మీర్, అస్సాం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 జిహాదీ టెర్రర్ కేసులు ఉన్నాయి. అందులో జమ్మూకశ్మీర్‌లో 11 కేసులు, 10 వామపక్ష తీవ్రవాద కేసులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఐదు కేసులు, ఏడు పీఎఫ్ఐ సంబంధిత కేసులు, పంజాబ్ ఐదు కేసులు, గ్యాంగ్‌స్టర్- టెర్రరిజం మూడు కేసులు, తీవ్రవాద నిధుల కేసు, రెండు నకిలీ భారతీయ కరెన్సీ నోటు సంబంధిత కేసులు ఉన్నాయి. దర్యాప్తు సంస్థ 2022లో 368 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేసింది. 19 మంది పరారీలో ఉండగా.. 456 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బహిష్కరణపై ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 2022లో 38 ఎన్‌ఐఏ కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి, అవన్నీ నేరారోపణతో ముగిశాయి. 109 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించగా.. కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. 2022లో ఆరు జీవిత ఖైదులు కూడా విధించబడ్డాయి. మొత్తం నేరారోపణ రేటు 94.39 శాతం. ఇది కాకుండా, 2022లో ఉపా చట్టం కింద ఎనిమిది మంది వ్యక్తులను వ్యక్తిగత ఉగ్రవాదులుగా గుర్తించారు. వారిపై అవసరమైన చర్యలు ఎన్‌ఐఏ తీసుకుంటోంది.
బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ని గుర్తు చేస్తున్నాడే..
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చెయ్యగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేశారు. మరో 10 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్, ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. దాదపు 1:45 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ మేకింగ్ వీడియో పవర్ ఫుల్ గా ఉంది. బాలయ్య, మోక్షజ్ఞ, శృతి హాసన్, నారా బ్రహ్మిణి, నందమూరి తేజస్విని ఉన్న ఈ వీడియోలో బాలయ్య మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ఉన్నాడు. గోపీచంద్ మలినేని, బాలయ్యని వింటేజ్ బాలకృష్ణని గుర్తు చేసేలా డీల్ చేసినట్లు ఉన్నాడు. ఓల్డ్ లుక్ లో బాలయ్య స్టైల్ అండ్ స్వాగ్ సూపర్బ్ గా ఉన్నాయి, ముఖ్యంగా ఒక చోట బాలయ్య పంచకట్టిన స్టైల్ థియేటర్స్ విజిల్స్ తో మోతమొగిపోయేలా చేసే రేంజులో ఉంది. వీర సింహా రెడ్డి మేకింగ్ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది, బాలయ్య స్మోకింగ్ స్టైల్ కూడా. ఒక ఫ్రేమ్ లో బాలయ్య స్మోకింగ్ స్టైల్ ని గోపీచంద్ మలినేని చూపించాడు. ఆ ఫ్రేమ్ లో బాలయ్య గంభీరంగా ఉన్నాడు. ఓవరాల్ గా ఈ మేకింగ్ వీడియో అండ్ ఇటివలే రిలీజ్ చేసిన పోస్టర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే… ఈ సినిమా బాలయ్య సూపర్ హిట్ మూవీ అయిన ‘సమర సింహా రెడ్డి’ని గుర్తు చేస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోలో మెయిన్ గా బాలయ్య వైట్ అండ్ వైట్ లుక్, ఆయన హెయిర్ స్టైల్ చూస్తుంటే ‘సమరసింహా రెడ్డి’ సినిమాలోని బాలక్రిష గుర్తొస్తున్నాడు. అందులో గొడ్డలి పట్టుకున్నాడు, ఈ కొత్త మూవీలో కత్తులు, సుత్తి… ఇలా చాలానే పట్టుకున్నాడు బాలయ్య. మరి ఆ ఐకానిక్ సినిమా హిట్ అయినట్లే వీర సింహా రెడ్డి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.