జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదనీ, అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు.
నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా తన ఖాతాలోకే..
కేసీఆర్ నన్ను ఎంచుకొని నియోజకవర్గాన్ని నా ద్వారా అభివృద్ధి చేపిస్తుండు అని అన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ప్రజల బలం ఉందని, సమ్మక్క జాతరలోని ఏ హుండీలలో డబ్బులు వేసిన సమ్మక్కకి చెందుతాయని, నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా తన ఖాతా లోకి వస్తాయన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అయితే.. ఇదిలా ఉంటే.. గతకొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య కోల్డ్ వార్ సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. వీరిద్దరి మధ్య వార్ కన్ఫర్మే అన్నట్లుగా రాజయ్య, శ్రీహరిలు పరోక్షంగా విమర్శలు సంధించుకుంటున్నారు. నిన్నటికి నిన్న కడియం శ్రీహరి ఓ కార్యక్రమానికి హాజరై.. ‘ఆ నాడు ఎన్టీఆర్, ఈనాడు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాని ఎక్కడ కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి ప్రారంభమైంది.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఈ పరిస్థితులకు నిరసనగా ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా చేస్తే.. సీనియర్లు సమావేశం కావడం.. పీసీసీ కమిటీలపై బహిరంగంగానే మాట్లాడుతుండడం.. గందరగోళానికి దారితీసింది.. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమయ్యారు.. ఆ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదరం రాజనరసింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక, రేవంత్‌పై ఆదినుంచి అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీఎల్పీ నేత భట్టికి పోటీ చేసి.. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. నేను రెడీ అని చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అంతా ఏకమై.. సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు.. అసలైన కాంగ్రెస్ మాదే అంటున్నారు.. దీంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఖుష్బూ సుందర్ ఇంట విషాదం
సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట విషాదం నెలకొంది. ఆమె అన్నయ్య ఇవాళ మృతి చెందారు. ఈ విషాదకర వార్తను ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఖుష్బూ 1970లో సెప్టెంబర్ 29న ముంబైలోని అంధేరిలో జన్మించారు. అసలు పేరు నఖత్ ఖాన్.. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, అలీ. అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే రెండు రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉన్న.. ఇవాళ విషమించడంతో చనిపోయారు. తన అన్న మృతిని జీర్ణించుకోలేని ఖుష్బూ.. ట్విట్టర్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.
చైనాకు స్ట్రాంగ్ కౌంటర్..
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు స్ట్రాంగ్ రిప్లై పంపాడు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద చైనా, ఇండియా బలగాల మధ్య ఘర్షణ గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారతదేశం సూపర్ పవర్ గా ఎదగాలనుకుంటుంది కేవలం ప్రపంచ క్షేమం కోసమే అని.. ఇతరుల భూభాగాలను ఆక్రమించుకునేందుకు కాదని డ్రాగన్ కంట్రీ చైనాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ(FICCI) 95వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం సూపర్ పవర్ అయ్యేందుకు అవసరం అయిన 5 అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారని ఆయన అన్నారు. తాము ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు శక్తివంతమైన దేశంగా మారాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. గాల్వాన్ కానీ తవాంగ్ కానీ సందర్భం ఏదైనా భారత రక్షణ బలగాలు అద్భుతమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారి ధైర్యసాహసాలను ఎంత పొగిడినా తక్కువే అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ హాయాంతో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం మరింతగా పెరిగిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
విజయం దిశగా టీమిండియా
ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 272 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. రేపు చివరి రోజు బంగ్లాదేశ్ విజయానికి 241 పరుగులు అవసరం కాగా.. భారత్ 4 వికెట్లు తీస్తే గెలుపు ఖాయమవుతుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40*), మెహిదీ హసన్ మిరాజ్(9*) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు నజ్ముల్ హొస్సేన్ శాంటో, యాసిర్ అలీ, లిట్టన్ దాస్, జకీర్ హసన్, ముష్ఫికర్ రహీమ్, నూరుల్ హసన్‌ల వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. 513 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు అద్భుతంగా ఆరంభించినా భారత బౌలర్లు పుంజుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా తడబాటుకు గురైంది. శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ 404 పరుగులు చేసింది. తర్వాత బంగ్లాదేశ్‌ను 150 పరుగులకు ఆలౌట్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించారు. కుల్దీప్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించాడు.
కారు కొంటే ఇప్పుడే కొనేయండి..
సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను పెరుగుతాయని.. మోడల్‌ను బట్టి ధర రూ.30,000 వరకు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.. జనవరి 2023 నుంచి తమ వాహనాల ధరలను పెంచాలని హోండా యోచిస్తోంది.. టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా మరియు ఎమ్‌జీ మోటార్ కూడా వచ్చే ఏడాది నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటనలు చేసిన విషం విదితమే.. ఇక, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్, ఇతర కార్ల శ్రేణి ధరలను పెంచిన తర్వాత హోండా కూడా ఈ నిర్ణయానికి వచ్చింది.. హీరో మోటోకార్ప్ డిసెంబర్ 1 నుండి ధరలను పెంచగా, మారుతీ సుజుకీ మరియు హ్యుందాయ్ జనవరి నుండి ధరలను పెంచాలని యోచిస్తున్నాయి.. టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా మరియు ఎమ్‌జీ మోటార్ కూడా వచ్చే ఏడాది నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటనలు చేశాయి.