ఆన్‌లైన్‌లో పెసర పప్పు ధరపై ఫిర్యాదు.. రూ.5 లక్షలు మాయం..
కాకినాడలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పెసర పప్పు ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయాలు మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హనుమంతరావు ఆన్‌లైన్ యాప్‌లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలో ధర రూ.53గా చూపించగా, డెలివరీ సమయంలో బిల్లులో మాత్రం రూ.111 వసూలు చేసినట్లు తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయాలని భావించిన ఆయన, డెలివరీ బాయ్ వద్ద నుంచి మేనేజర్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో కాల్ కట్ చేశారు. ఆ తర్వాత అదే నెంబర్ నుంచి ఆరు సార్లు కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయలేదని చెప్పారు. కానీ, కొద్ది సేపటికి తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయని బాధితుడు వెల్లడించారు. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారణ చేయగా, ఇది సైబర్ మోసం అని నిర్ధారణ అయింది.
బడ్జెట్ అంకెల గారడీ.. అంతా మోడీ, చంద్రబాబు, పవన్, లోకేష్ డబ్బా..!
2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా వేశారు. అయితే, వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చలేదని ఆరోపించారు. బడ్జెట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, కానీ 1 నుంచి 8 పేజీల వరకూ ప్రభుత్వం తమను తాము పొగడుకోవడానికే, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఉపయోగించిందని అన్నారు బొత్స… ప్రజలు అభివృద్ధి కోసం అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం అభివృద్ధి కంటే పేర్ల ప్రస్తావనలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పేర్లే పదేపదే ప్రస్తావించారని.. వాళ్ల డబ్బా కొట్టుకున్నారని బొత్స ఆరోపించారు. రైతులకు మద్దతు ధరపై ఎక్కడా స్పష్టత లేదని, సున్నా వడ్డీ రుణాలపై కేటాయింపులు కనిపించడం లేదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు సమయానికి అందించామని, ఇప్పుడు వాటి ఊసే లేదని అన్నారు. పనికి ఆహార పథకానికి తగిన కేటాయింపులు లేవని కూడా విమర్శించారు.
ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్..
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బడ్జెట్-2026-67ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌పై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ట్రాక్ ఎక్కుతోందని అన్నారు. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిస్థితులను మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం ఉందని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు… మన రాష్ట్రంలో ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు ప్రత్యేక డిమాండ్ ఉందని, వాటి రుచి మరెక్కడా దొరకదని చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, అప్పుడు రాష్ట్రం పూర్తిగా గాడిలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్ తిరోగమనం దిశలో ఉంది.. రెండేళ్లలో క్రమంగా ఆదాయం పడిపోయింది..
2026-27 రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి తోడ్పడేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిన “వికసిత ఆంధ్రప్రదేశ్” నినాదం మాటల్లో గొప్పగా ఉన్నప్పటికీ, అమలులో శూన్యంగా ఉందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆదాయం క్రమంగా పడిపోతుందని, అభివృద్ధి జరిగితే ఆదాయం పెరగాలని అన్నారు. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం తగ్గడం ప్రజల ఆదాయాలు పడిపోతున్న సంకేతమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, జీఎస్టీ పన్నుల వాటా తగ్గిందని తెలిపారు. బడ్జెట్‌లో 98 వేల కోట్లు పెట్టుబడి వ్యయం చూపించగా, అందులో 76 వేల కోట్లు మార్కెట్ అప్పులేనని విమర్శించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36% అప్పులేనని, బడ్జెట్‌లో 18% వడ్డీలకే వెళ్తోందని అన్నారు. ఈ భారం మొత్తం ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వి. శ్రీనివాసరావు.. ఇక, వ్యవసాయ రంగానికి కేవలం 4% మాత్రమే కేటాయించడం రైతులకు అన్యాయం అని అన్నారు. ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లు అవసరం కాగా, కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. పంటల బీమాను రైతులకు ఉపయోగకరంగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. వెలిగొండ, హంద్రీనీవా, వంశధార వంటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించలేదని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి శాతంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముగియడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరకు తమ అభ్యర్థులను కాపాడుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నం వంటి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. మరోవైపు, కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు వారిని రాత్రికి రాత్రే హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికల సమయానికి వీరిని నేరుగా కల్లూరుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సత్తుపల్లి , కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఇప్పటికే పార్టీల లోపల తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు కౌన్సిలర్లందరినీ ఐకమత్యంగా ఉంచడం కోసం ఈ క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
30 మున్సిపాలిటీలకుపైగా గెలుచుకుంటామని అనుకున్నాం కానీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు, హంగ్ మున్సిపాలిటీల్లో వ్యూహాలు, ప్రతిపక్షాల పనితీరుపై ఆయన తన విశ్లేషణను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని భావించినప్పటికీ, తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన అంగీకరించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని (హంగ్) మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల నమోదు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అధికారులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తమ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధుల మద్దతుతో హంగ్ ఏర్పడిన చోట్ల కూడా పట్టు సాధిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని కేటీఆర్ విమర్శించారు. “కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలు ఇవ్వలేదు” అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. కరీంనగర్, నిజామాబాద్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం శూన్యమని కొట్టిపారేశారు.
ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?
రెండేళ్ల అనిశ్చితి తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. దివంగత మా ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు బంగ్లాను పాలించిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారానికి తెరపడనుంది. ఇదిలా ఉంటే, యూనస్ సమయంలో భారత బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూనస్ పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వారిలో సంబంధాలను పెంచుకున్నాడు. భారత వ్యతిరేకత, హిందువులపై వ్యతిరేకతను నూరిపోయడంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, వీటన్నింటిని పక్కన పెట్టి, ప్రధాని నరేంద్రమోడీని ఢాకాకు ఆహ్వానించాలని బీఎన్పీ అనుకుంటోంది. తారిక్ రెహ్మాన్ ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్రమోడీని ఆహ్వానించాలని యోచిస్తోంది. ప్రాంతీయ దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రధాని మోడీ కీలక ఆహ్వానితుల్లో ఉంటరని భావిస్తున్నారు. ప్రధాని మోడీ, బంగ్లాకు కాబోతున్న ప్రధాని తారిఖ్ రెహ్మాన్‌తో మాట్లాడిన తర్వాత, ఈ పరిణామం చోటుచేసుకుంది. తారిక్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక వేళ ఆహ్వానం అంది, ప్రధాని మోడీ ఢాకా వెళ్తే, భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార తేదీని ఇంకా ధ్రువీకరించడకపోవడంతో, విదేశీ నాయకుల హాజరును నిర్ధారించలేదు.
భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాకు ప్రధాని కాబోతున్నారు. మొత్తం 300 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉన్న జమాతే ఇస్లామీ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అనుకున్నప్పటికీ, బీఎన్‌పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో జమాత్ గెలిచిన స్థానాలు భారత్‌కు ప్రమాదంగా మారాయి. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్ జిల్లాల్లో జమాత్ ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, చికెన్స్ నెక్ కారిడార్‌ను ఆనుకుని ఉన్న బంగ్లా నియోజకవర్గాల్లో ఈ పార్టీ విజయం సాధించడం మనకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జమాతే ఇస్లామీ మొత్తం 68 సీట్లు గెలిస్తే ఇందులో 51 భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలు భారత సరిహద్దుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్‌ను పెంచుతాయి. జమాత్ ఈ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా రహస్యంగా పనిచేస్తోంది. ఉగ్రవాదులు, మతోన్మాదులకు జమాత్ ఆశ్రయం ఇస్తోంది. ఇదే కాకుండా దీనికి మనదేశంలో పనిచేస్తున్న కొన్ని ఇస్లామిస్టు గ్రూపులతో కూడా సంబంధాలు ఉన్నాయి. జమాత్ భారత్‌లోకి బంగ్లా చొరబాట్లను కూడా ప్రేరేపిస్తోంది. ఇప్పటికే చికెన్స్ నెక్(సిలిగురి కారిడార్) ప్రాంతంలో జనాభా స్వరూపం మారిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోకి బంగ్లా చొరబాట్లు పెరిగాయి.
ఆధార్ ఉందా.. చిటికెలో రూ.2,000 మీ ఖాతాలోకి! ఎలాగో తెలుసా?
ఆధునిక సాంకేతిక యుగంలో అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎవరినో అడగాల్సిన పని లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్‌తో డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసా.. మీ చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు, చిటికెలో రుణం పొందే అవకాశం ఉంది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగిందో, ఆ పేరుతో జరిగే మోసాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. అందుకే సురక్షితంగా రూ.2,000 వరకు లోన్ ఎలా పొందాలి? దీనికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి మార్కెట్లో వందలాది “ఇన్‌స్టంట్ లోన్” యాప్‌లు ఉన్నాయి. కానీ, ప్రతిదీ సురక్షితం కాదనే విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలి. మీరు ఎంచుకున్న యాప్ లేదా బ్యాంక్ కచ్చితంగా RBI (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ద్వారా నియంత్రించబడే NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) అయి ఉండాలి. వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా సోషల్ మీడియాలో వచ్చే గుర్తుతెలియని లోన్ లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.
టీమిండియా ఓటమికి ‘‘ప్లాన్’’ చేసిన షాహిద్ అఫ్రిది..
T20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా క్రికెట్ సమరం జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రెండు టీములు కూడా గెలుపు స్ట్రాటజీలు రచిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు పాక్ టీంకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ చేతిలో వరస ఓటములు రికార్డ్ పాక్ పేరిట ఉంది. ఈ సారి ఆ రికార్డును చెరిపేయాలని పాక్ భావిస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్ట్రాటజిస్ట్ అవతారమెత్తాడు. భారత్‌ను ఎలా ఎదుర్కోవానే అంశాలను వివరించాడు. పాకిస్తాన్ తెలివిగా, కుదురుగా ఉండే ఆటతీరును ప్రదర్శించాలని సలహా ఇచ్చాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో ప్రతిభ కన్నా తరుచుగా ప్రాథమిక విషయాలే ఫలితాలను నిర్ణయిస్తాయని అఫ్రిది చెప్పారు. ‘‘తప్పులు అందరి వద్ద ఉంటాయి. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఈ మూడు విభాగాల్లో తక్కువ తప్పులు చేసిన వారే గెలుస్తారు’’ అని అన్నారు. గతంలో పోలిస్తే పాక్ జట్టు మరింత డెప్త్‌గా ఉంది. 8వ నెంబర్ వరకు పాక్‌లో హిట్టర్లు ఉన్నారు. టాప్-6 బ్యాటర్లు 15-16 ఓవర్లు ఆడితే, చివరి ఓవర్లలో పవర్ హిట్లర్లు స్వేచ్ఛగా ఆడి స్కోర్ పెంచొచ్చని చెప్పారు. స్కోర్ బోర్డు ముందు కదలాలి, అయితే అవసరం లేని రిస్క్ తీసుకని వికెట్లు ఇవ్వకూడదని చె ప్పారు. రన్‌రేట్, రిస్క్ మేనేజ్మెంట్ రెంటింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలని అన్నారు.
శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన రెండు వేర్వేరు చిత్రాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే థియేటర్‌లోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ రిలీజ్ కానుండగా, ఆ తర్వాతి రోజే ఫిబ్రవరి 28న ఆయన హీరోగా తెరకెక్కిన ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఏ హీరో అయినా తన చిత్రాల రిలీజ్‌లకు కొంత గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ హీరో శ్రీవిష్ణు దానికి భిన్నంగా ఒక్క రోజు వ్యవధిలో తన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కారణం ఓటీటీ ఒప్పందాలే అని సమాచారం అంటున్నారు. ‘మృత్యుంజయ’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ‘విష్ణు విన్యాసం’ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆయా ప్లాట్‌ఫారమ్‌లు సూచించిన తేదీలకే సినిమాలను రిలీజ్ చేయాల్సి రావడంతో శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు వార్‌ను ప్రేక్షకులు వెండి తెరపై చూడబోతున్నారు. తనదైన శైలి వినోదంతో ఒక సినిమా ద్వారా వస్తూ, మరొక వైపు సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏదీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందో వేచి చూడాలి.
‘రామాయణం’ తో హాలీవుడ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తా – నిర్మాత నమిత్ మల్హోత్రా
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ (రూ. 4000 కోట్లు) తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. ఈ సినిమా వెనుక ఉన్న బలమైన ఉద్దేశాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టారు. హాలీవుడ్‌లో మన భారతీయ సంస్కృతికి ఎప్పుడూ సరైన గుర్తింపు దక్కలేదని, మనల్ని ఎప్పుడూ బాధితులుగానే చూపిస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన చరిత్ర ఎంత గొప్పదో, మన సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పడానికే ఈ డ్రీమ్ ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. DNEG అధినేతగా ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన అనుభవంతో, నమిత్ ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే, ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై భారతీయుల ఆత్మగౌరవమని ఆయన పేర్కొన్నారు.