బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా..! సీఎం సీరియస్ వార్నింగ్
బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందజేశారు.. ఇక, ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కూటమిని గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు.. ఇక, అనంతపురం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉంది అని గుర్తుచేసుకున్నారు.. పక్క రాష్ట్రాల్లో పెన్షన్‌లు చాలా తక్కువుగా ఇస్తున్నారు.. మన పక్క గ్రామం కర్ణాటకలో వుంది అక్కడ కేవలం 1200 రూపాయిలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని వెల్లడించారు.. ఇక, గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎన్ని పాపాలు చేయాలో అన్ని చేశారు.. ఎక్కడికక్కడ అప్పులు చేశారని మండిపడ్డారు.. చివరకు తహసీల్దార్ కార్యాలయలు తాకట్టు పెట్టే పరిస్థితికి గత ప్రభుత్వం తయారయ్యిందని ఫైర్ అయ్యారు.. ఒకప్పుడు నాసిరకం మద్యం దొరికేది.. ఇప్పుడు ఇక్కడే మంచి మద్యం దొరుకుతుందన్నారు.. అయితే, బెల్ట్ షాపులు పెడుతున్నారని ప్రచారంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బెల్ట్ షాపులు పెడితే… బెల్ట్ తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మద్యం దుకాణాల విషయలో నాయకులు, దందాలు చేసే వారు దూరితే వారిని వదలను అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం భయటపడింది. ఈ సారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు ఉన్న వాహనాన్ని నిలపడం విమర్శలకు దారితీసింది. అలిపిరి టోల్‌గేట్, జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు దాటుకోని వాహనం అర్చక నిలయం వద్దకు చేరుకోవడం.. ఆ వాహనాన్ని అక్కడే పార్క్ చేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు. అయినా, విజిలెన్స్ అధికారులు మాత్రం వాహనాన్ని గుర్తించకపోవడం.. వాహనంపై స్టికర్‌ని తొలగించే ప్రయత్నం చెయ్యకపోవడంతో విజిలెన్స్ అధికారుల డొల్లతనాన్ని భయటపెట్టింది.. కాగా, గతంలోనూ ఇలాంటి వైఫల్యాలు వెలుగు చూడడం.. విజిలెన్స్ వ్యవహారంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, టీటీడీ కఠినంగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది.
దేశంలోనే అత్యధిక పింఛన్లు ఏపీలోనే.. ప్రభుత్వంపై నింధలు సరికాదు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచింది.. అంతేకాదు.. ప్రతీ నెల ఫస్ట్ రాకముందే.. ఈ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.. సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికి వెళ్లే పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. అఇయతే, దేశంలోనే అత్యధిక పింఛన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఇస్తున్నాం.. అనవసరంగా ప్రభుత్వంపై నింధలు వేయడం కరెక్ట్ కాదని హితవు చెప్పారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు.. గత ప్రభుత్వంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగాలకు కూడా వెళ్లలేకపోతున్నారన్న ఆయన.. జగన్ ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, వైఎస్ జగన్ నష్టపరిచిన వ్యవస్థల్ని చక్కదిద్దుతున్నాం. జగన్ కి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి.. ఈసారి ఒక్క సీటు కూడా రాదు అంటూ జోస్యం చెప్పారు.. గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ ఒప్పందాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అంతేకాదు.. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే, ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ అన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని చెప్పారన్నారు. మనం ఉద్యమ రూపకల్పన చేయాల్సి ఉందని బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు… గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లను ప్రాసెస్ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చాను అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రేపు బీజేపీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ఈ డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ జరగనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సభకు బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా లేక జేపీనడ్డా హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షంచే ప్రయత్నం చేస్తున్నాయి. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో డబ్బులు కూడగట్టుకున్న మధ్యతరగతి వ్యక్తి.. ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి. దాదాపు 3000 కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల నుంచి వసూలు చేశాయి. లేని స్థలాలను ఉన్నట్టుగా చూపి రియల్ సంస్థలు డబ్బులు వసూలు చేశాయి. ప్రాజెక్టు మీద డబ్బులు ఇస్తామంటూ బై బ్యాక్ పాలసీ పేరుతో మోసాలు జరిగాయి. పలు ప్రాంతాలలో విలువైన ల్యాండ్ చూపెట్టి రియల్ కంపెనీలు మోసాలు చేస్తున్నాయి. తక్కువ ధరకే విల్లాలు, ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్స్ అంటూ ప్రచార ఆర్భాటాలను చూసి వినియోగదారులు పడిపోతున్నారు. సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఫ్రీ లాంచ్, బై బ్యాక్ మోసాలు జరిగినట్లు లెక్కలు చూపుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల అనుమానాలపై కాంగ్రెస్‌కి ఈసీ ఆహ్వానం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అనుమానాలను, ఆందోళనల్ని పరిష్కరించడానికి ఎన్నికల సంఘం డిసెంబర్ 3న ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. ఓటర్ ఓటింగ్ డేటాకు సంబంధించిన సమస్యపై స్పందించిన ఈసీ, ఇందులో ఎలాంటి వ్యత్యాసం లేదని, పోలింగ్ స్టేషన్ల వారీగా అభ్యర్థలందరికీ డేటా అందుబాటులో ఉందని చెప్పింది.సాయంత్రం 5 గంటల పోలింగ్ డేటా, ఫైనల్ ఓటింగ్ డేటా మధ్య గ్యాప్ అనేది ప్రిసీడింగ్ అధికారులు ఇతర విధుల నిర్వర్తించడంలో నిమగ్నమై ఉండటం వల్ల జరిగిందని చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సుమారు రాత్రి 11.45 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ నోట్ విడుదల చేసింది, ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సమయాన్ని అనుసరించినట్లు ఈసీ తెలిపింది.
“3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్”.. ఈ మెసేజ్ నిజమేనా ?
సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్‌లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్‌ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్‌తో పాటు లింక్ కూడా షేర్ చేశారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్‌ను పొందవచ్చు అని తెలిపారు. నవంబర్ 27, 2024న ఫేస్‌బుక్ (Facebook) వినియోగదారు రుషికేష్ కాలే ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. క్యాప్షన్‌లో “ప్రధాన మంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతదేశంలోని వినియోగదారులందరూ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పొందడం ప్రారంభించారు. నేను కూడా 84 రోజుల ఉచిత రీఛార్జ్ ను పొందాను. మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ పొందవచ్చు. ఈ పథకం 30 డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఉంటుంది.” అని పేర్కొన్నాడు.
కియా “సిరోస్” వచ్చేస్తోంది.. సెల్టోస్, సోనెట్ తర్వాత మూడో ఎస్‌యూవీ..
భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా కియా ఇండియా తన మూడో ఎస్‌యూవీని భారత్‌లోకి తీసుకువస్తోంది. డిసెంబర్ 19నత కియా ‘‘సిరోస్’’ ఆవిష్కరించబోతోతంది. కియా సెల్టోస్, కియా సోనెట్ తర్వాత ఇది కియా మూడో ఎస్‌యూవీ కార్. భారతదేశంలో కియా సిరోస్ లాంచ్ 2025 ప్రారంభంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. సైరోస్ కియా ఎలక్ట్రిక్ కార్ ఈవీ9, కార్నివాల్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు తెలుస్తోంది. ఇది యూనిక్ ప్రొగ్రెసివ్ ఎస్‌యూవీ డిజైన్ కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, L-షేప్ LED టెయిల్‌లైట్‌లు, బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయాన్ని పరిశీలిస్తే పరోరమిక్, సన్‌రూఫ్, రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. వెంటిలేడెట్ సీట్లు, అడాస్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఏంటీ బ్రో.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్..!
ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే.. అతి పిన్న వయస్సులో వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ యువ బ్యాటర్‌లో టాలెంట్‌ను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ (RR) తాజాగా జరిగిన వేలంలో కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్న వైభవ్.. మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 281 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తరుఫున ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్‌కు దిగారు. ఆయుష్ మ్హత్రే నాలుగో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలో.. ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరడంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్ స్కోరు 14 ఓవర్లలో 3 వికెట్లకు 53 పరుగులు చేసింది.
టాలీవుడ్ సినిమాల దెబ్బకు సైడయిన ‘ఛావా’
పుష్ప2తో పుష్ప రాజ్ ప్రమోషన్లలో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్.. హైటెన్షన్ క్రియేట్ చేసేసింది పుష్ప 2. మొదటి నుండి సౌత్, నార్త్ బెల్ట్‌లో భీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మేనియా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి.. అదే రోజున రిలీజ్ చేద్దామనుకున్న బాలీవుడ్ మూవీ ఛావాకు ఫీవరొచ్చింది. మీరు తగ్గకపోతే మేము తగ్గిపోతాం అంటూ వెనక్కు వెళ్లిపోయింది. జనవరి 10న రిలీజ్ చేద్దాం అనుకుంటే అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో గ్లోబల్ స్టార్‌తో మనకెందుకులే అని అక్కడ నుండి కూడా తప్పుకుంది. కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ , వీఎఫ్ ఎక్స్ ఆలస్యం సైతం ఛావాను ముందుకు నెట్టడం లేదు. దీంతో మరో డేట్ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్లీ సినిమాకు యాప్ట్ డేట్‌ను లాక్ చేసుకుంది. క్రిస్మస్, జనవరి నుండి వాయిదా వేసుకుని ఫిబ్రవరి 14న వచ్చేందుకు రెడీ అవుతుంది. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఐదు రోజుల ముందు మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ స్టోరీ ఆధారంగా ఛావా తెరకెక్కుతోంది. ఆడియన్స్ నుండి అటెన్షన్, సినిమాపై ఇంప్రెషన్ కలిగేందుకు ఇదే టైం సరైందని ఫిక్స్ అయ్యారు మేకర్స్. విక్కీ కౌశల్ చత్రపతి శంభాజీ క్యారెక్టర్ చేస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాల దెబ్బకు ఇన్ని సార్లు వెనక్కు తగ్గిన ఛావాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ అండ్ వాచ్.
మాకు కొత్త సినిమాలు ఫ్రీగా వేయండి!
తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు కొత్తగా ఒక మినీ థియేటర్ కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫిలిం ఛాంబర్ కి ఒక విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తమ కోసం కొత్త సినిమాలను ఫ్రీగా ఆ మినీ థియేటర్లో వేయాలని కోరారు. సాధారణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కలిసి సంబరాలు చేసుకుంటూ, పలు కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం తాజాగా 48 సీట్ల కెపాసిటీ గల ఒక మినీ థియేటర్ నిర్మించుకుంది. ఈ నేపథ్యంలో తమ కోసం వారాంతాల్లో కొత్త సినిమాలను ఫ్రీగా ప్రదర్శించాల్సిందిగా ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చింది. ఈ విజ్ఞప్తికి ఫిలిం ఛాంబర్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి చూస్తే బ్యూరోక్రాట్లకు బ్యూరోక్రాట్ల కుటుంబ సభ్యులకు ఫ్రీగా ఫిలిం ఛాంబర్ కొత్త సినిమాలను ప్రదర్శింప చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది.
ఓటీటీలోనూ దూసుకుపోతున్న లక్కీ భాస్కర్..
ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాల్లో రూ.100కోట్లు కొల్లగొట్టిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయి అంతటా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి నాలుగు వారాల్లో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా రూ.వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి దుల్కర్ సల్కాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. అదే రోజు మరో రెండు సినిమాలు వచ్చి, పాజిటివ్ టాక్ దక్కించుకున్నా లక్కీ భాస్కర్ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. థియేటర్లో విడుదల అయిన సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ సైతం లక్కీ భాస్కర్ సినిమాకు విశేష స్పందన దక్కింది. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో ఇండియా వ్యాప్తంగా నెం.1 స్థానంలో లక్కీ భాస్కర్ ట్రెండ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలో జాతీయ స్థాయిలో నెం.1గా ట్రెండ్ కావడం చాలా అరుదు అది లక్కీ భాస్కర్ కు దక్కింది.