శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా..!
శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించునుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్‌లైన్ విధానంలో జారీ చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్లు ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్ విధానంలో జారీ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్ల జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 6 మంది భక్తులు మృతి చెందడం.. 50 మందికి పైగా భక్తులు గాయపడటంతో టీటీడీ ఈ విధానానికి స్వస్తి పలికింది. పది రోజులకు సంబంధించి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది టీటీడీ. మొదటి మూడు రోజులపాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని.. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం భక్తులతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ విధానంలో కాకుండా ఆన్‌లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం భక్తులకు రేపటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్‌లైన విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంది. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాఫ్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. డిసెంబర్ రెండవ తేదీన ఈ డిఫ్ విధానంలో వారికి దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆన్‌లైన్ విధానంలో జారీ చేయనున్నారు. రోజుకి 15 వేలు చొప్పున ఏడు రోజులకు సంబంధించి లక్షా 5 వేల టికెట్లను జారీ చేయనున్నారు.. దీనితో ఆన్‌లైన్ ద్వారా గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే పొందే భక్తులకు.. ఈసారి సర్వదర్శనం టోకెన్లు కూడా పొందే సౌలభ్యం లభించునుంది. దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేకపోవడం టోకెన్ కలిగిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభించునున్న నేపథ్యంలో ఆన్‌లైన్ భక్తులకు ఇది డబుల్ బొనాంజాగా మారింది..
అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి.. ఎల్లుండి ఆర్బీఐ సహా 25 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వివిధ సంస్థల ఆఫీసులు కూడా రెడీ అవుతున్నాయి.. ఇక, ఆర్బీఐ సహా పలు జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అమరావతిలో రానున్న రోజుల్లో తమ కార్యకలాపాల నిర్వహణ కోసం సిద్ధం అవుతున్నాయి.. వాటికి అనుగుణంగా ఇప్పుడు కొత్త భవనాలను నిర్మించనున్నారు.. ఎల్లుండి రాజధాని అమరావతిలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాజధాని అమరావతిలో RBI సహా 25 జాతీయ, ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు సంబంధించిన నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇక, నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో.. CRDA ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదిక ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేష్ హాజరుకానున్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు భూ కేటాయింపులు చేసింది CRDA.. బ్యాంకులతో పాటు.. అధికారుల నివాస భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.. ఇప్పటి వరకు కేవలం ఏపీ ప్రభుత్వం భవనాలు మాత్రమే నిర్మాణం జరుగుతుండగా.. ఇప్పుడు అన్ని ప్రధాన బ్యాంక్ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాబోతుంది.. ఈ నేపథ్యంలో అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ముందుకు సాగుతోంది..
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ బిజీబిజీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు జగన్.. అనంతరం అరటి రైతుల వద్దకు వెళ్లిన జగన్ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. రెండవ రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను ఆయన కలిశారు.. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి యోగక్షేమాలు తెలుసుకుని భరోసా కల్పించారు… బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించిన అనంతరం అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.. 18 నెలల చంద్రబాబు హయాంలో 16 సార్లు రకరకాల విపత్తులు సంభవించాయన్నారు.. చంద్రబాబు హయాంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది సున్నా.. ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.. ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్తు సంభవించినా ఇన్సూరెన్స్ లేదు అని మండిపడ్డారు జగన్..
ఐ బొమ్మ రవిపై మరో కేసు.. 14 రోజుల రిమాండ్..
గత కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిని ఐబొమ్మ రవి వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐ బొమ్మ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిపై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవిని మరో కేసుతో సంబంధించి పీటీ వారెంట్ పై అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కొత్త కేసు విచారణలో భాగంగా పోలీసులు రవిని పీటీ వారెంట్ ద్వారా కస్టడీకి తీసుకొని మొదట 9వ మెజిస్ట్రేట్ ముందు, అనంతరం 8వ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రవికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రవిని మళ్లీ చంచల్ గూ జైలుకు తరలించారు. ఐ బొమ్మ రవిపై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటి దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండవసారి 7 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..
ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మార్మోగింది. అరెస్టయిన డాక్టర్లకు కూడా ఈ వర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీలు, విచారణ అధికారుల కన్ను ఈ యూనివర్సిటీపై పడింది. దీని కార్యకలాపాలు, నిధుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అల్ ఫలాహ్ యూనివర్సిటీకి కేవలం 900 మీటర్ల దూరంలో ఒక అండర్ గ్రౌండ్ మదర్సా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ మదర్సా ఫరీదాబాద్‌లోని ధౌజ్‌లోని ఒక గ్రామానికి సమీపంలో పూర్తిగా ఒంటరి ప్రాంతంలో ఉంది. 4000-5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన ఈ మదర్సా ఉంది. ఇప్పుడు ఈ అసాధారణ నిర్మాణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మదర్సాకు సంబంధించిన 3 అడుగుల నిర్మాణం మాత్రమే పైన కనిపిస్తోందని, మిగతా భాగం భూగర్బంలో విస్తరించి ఉన్నట్లు తేలింది. సాధారణ మదర్సాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా.? పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసినందుకు తమను పోలీసులు క్రూరంగా అణిచివేసినట్లు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ – నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల, ఆయన పార్టీ మద్దతుదారులతో కలిసి, ముగ్గురూ ఈ వారం నిరసన తెలిపారు. ఈ సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉన్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడనప్పటికీ పోలీసులు తమను క్రూరంగా అణిచివేశారని ముగ్గురు కూడా పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు లేఖ రాశారు. తమను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని 71 ఏల్ల నోరీన్ నియాజీ ఆరోపించారు.
నవంబర్ 30 లోపు ఈ ఆర్థిక పరమైన పనులను పూర్తి చేయండి.. లేకుంటే నష్టమే!
మరో 4 రోజుల్లో ఈ ఏడాది నవంబర్ నెల ముగియబోతోంది. అయితే ప్రతి నెలలో కూడా ఆర్థిక పరమైన రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్నింటికి గడువు తేదీలు ముగుస్తుంటాయి. నవంబర్ 30వ తేదీ సమీపిస్తోంది. సకాలంలో పూర్తి చేయాల్సిన అనేక ఆర్థిక, డాక్యుమెంటేషన్ పనులకు గడువులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువులోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా, భారీ జరిమానాలు, పనికి అంతరాయాలు కూడా సంభవించవచ్చు. మరి ఈ నెల చివరి వరకు చేయాల్సిన ఆ పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ నెలకు సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్ (TDS) వసూలు చేయబడిన పన్ను (TCS) కోసం చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌లను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. ఇది ప్రత్యేకంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 194-IA, 194-IB, 194M, 194S కిందకు వచ్చే పన్ను మినహాయింపుదారులకు వర్తిస్తుంది. వీటిలో ఆస్తి అమ్మకంపై తగ్గించబడిన TDS, అద్దెపై TDS, కాంట్రాక్టర్లు, నిపుణులు, ఫ్రీలాన్సర్లకు చేసిన చెల్లింపులపై TDS ఉన్నాయి. గడువును దాటితే పన్ను శాఖ వడ్డీ, జరిమానాలు రెండింటినీ విధించవచ్చు.
మరోసారి సత్తా చాటిన బడ్జెట్ బైక్.. అమ్మకాల్లో టాప్ 10 బైకులు ఏవంటే..?
అక్టోబర్ 2025 నెలలో ద్విచక్ర వాహనాల మార్కెట్ పండుగ సీజన్ ఉత్సాహం, కొత్త GST నియమాల ప్రభావంతో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే మొత్తం అమ్మకాల పరంగా చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈసారి టాప్ 10 మోటార్‌సైకిళ్లు కలిపి 10,60,399 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024 అక్టోబర్‌లో నమోదైన 10,81,437 యూనిట్లతో పోలిస్తే దాదాపు 2% తగ్గుదల. మరి ఏ బైకులు అత్యధికంగా అమ్ముడయయ్యో చూసేద్దామా.. దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా హీరో స్ప్లెండర్ (Hero Splendor) మళ్లీ మొదటి స్థానాన్ని సాధించింది. అక్టోబర్ 2025లో ఈ బైక్ 3,40,131 యూనిట్లు విక్రయించబడగా.. ఇది గతేడాది అక్టోబర్‌లో విక్రయించిన 3,91,612 యూనిట్లతో పోలిస్తే 51,481 యూనిట్ల తగ్గుదల (-13.15%) నమోదయ్యింది. ఇక రెండో స్థానంలో హోండా కంపెనీకి చెందిన హోండా షైన్ (Honda Shine) నిలిచింది. ఈ బైక్ అక్టోబర్ 2025లో 1,74,615 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇవి 2024లో నమోదైన 1,96,288 యూనిట్లతో పోలిస్తే 21,673 యూనిట్ల తగ్గుదల (-11.04%) కనిపించింది. మూడో స్థానాన్ని ఈసారి భారీ వృద్ధితో బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) లైనప్ దక్కించుకుంది. పల్సర్ అక్టోబర్ 2025లో 1,52,996 యూనిట్లు విక్రయించగా, ఇవి 2024 అక్టోబర్‌లోని 1,11,834 యూనిట్లతో పోలిస్తే 41,162 యూనిట్ల పెరుగుదల (+36.81%) నమోదు చేశాయి. ఇక నాలుగో స్థానం హీరో HF డీలక్స్ (Hero HF Deluxe) దక్కించుకుంది. ఈ మోడల్ అక్టోబర్ 2025లో 1,13,998 యూనిట్లు అమ్ముడవగా, ఇవి 2024లో నమోదైన 1,24,343 యూనిట్లతో పోలిస్తే 10,345 యూనిట్లు (-8.32%) తగ్గాయి. ఇక ఐదో స్థానంలో టీవీఎస్ అపాచీ (TVS Apache) ఉంది. అపాచీ అక్టోబర్ 2025లో 61,619 యూనిట్లు నమోదు చేయగా.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 11,522 యూనిట్లు పెరగడం (+23%) గమనార్హం.
థియేటర్స్‌లోకి ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా..
ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ నుంచి వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో అనేకం ఈ హీరో ఖాతాలోనే ఉన్నాయి. అలా తన స్టార్టీంగ్ కెరీర్‌లోనే లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలలో ఒకటైన “మనసంతా నువ్వే” సినిమాకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఆడియెన్స్ మదిలో మెదులుతూనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాన్ని దర్శకుడు వి ఎన్ ఆదిత్య 2001లో తెరకెక్కించాడు. తాజాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి వెండి తెరపై ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతుంది. దర్శకుడు వి ఎన్ ఆదిత్య తెరకెక్కించగా ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సందర్భంగా మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా వెండి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీమాస్టర్ చేసి 4కె, ఇంకా డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌లలోకి మార్చి వచ్చే ఏడాది లవర్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్‌కు జోడిగా రీమా సేన్ నటించింది. ఆర్పీ పట్నాయక్ ఆల్బమ్ ఈ చిత్రానికి అదనపు బలం అందించింది. మరోసారి ఈ సినిమా థియేటర్స్‌ను షేక్ చేస్తుందా అనేది చూడాలి మరి.
ఆ విషయంలో దీపికతో ఢీ అంటే ఢీ అంటున్న రష్మిక?
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేనే అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు దీపిక పారితోషికంతో పోటీ పడేందుకు సౌత్ నుంచి వెళ్లిన ఓ హీరోయిన్ సిద్ధమవుతోంది. ఆమే… రష్మిక మందన్న! .సౌత్ సినిమాలతో పాటు హిందీలోనూ క్రేజ్ పెంచుకుంటున్న రష్మిక మందన్న రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్‌ను దాటేసింది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో రష్మిక నటించిన ఇటీవలి చిత్రం ‘థామా’ కోసం ఆమె భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. థామా’ చిత్రంలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానాతో జత కట్టారు. ఈ సినిమాలో రష్మిక కేవలం నటనకే కాకుండా, తన గ్లామర్ రోల్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని, ఔట్ అండ్ ఔట్ స్కిన్ షోకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ 12 కోట్లుగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక, బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ, అగ్ర కథానాయిక దీపికా పదుకొణేకు గట్టి పోటీ ఇస్తున్నట్లే భావించవచ్చు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన హీరోయిన్ ఇంత భారీ పారితోషికం తీసుకోవడం నిజంగా విశేషం.
యంగ్ హీరోలు హిట్ కొట్టాలంటే బడ్జెట్ పెంచాల్సిందేనా..?
తెలుగు సినిమా బడ్జెట్‌లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు. రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు సైతం ఆడియన్స్‌ను కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు. నాని 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘దసరా’ సినిమాకు 60 కోట్లు ఖర్చుపెట్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ హిట్‌తో వీరి తదుపరి చిత్రం ‘ప్యారడైజ్’ బడ్జెట్ డబుల్ అయినట్టు తెలుస్తోంది. దసరా తర్వాత ఈ కాంబో రిపీట్ కానుంది.