నాది, పవన్ కల్యాణ్‌ది అదే ఆకాంక్ష.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే 15 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి… నాది, పవన్ కల్యాణ్ ది అదే ఆకాంక్ష.. అభివృద్ధి జరగాలి అంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక ప్రొగ్రామ్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు.. ఒక మార్పు రావాలన్నారు సీఎం చంద్రబాబు.. సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్ చేసిన ఘనతగా NDA ప్రభుత్వానిది.. పెన్షన్ల కోసం మన రాష్ట్రం ఖర్చు చేసినంత దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయడం లేదు.. ఏడాదికి 33 వేల కోట్లు పెన్షన్ రూపంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.. పెన్షన్లలో 59శాతం మహిళలకే అందుతుందన్నారు సీఎం చంద్రబాబు.. రైతు నష్టపోకుండా ఉండేందుకు నీరు, కరెంట్, ఎరువులు సంవృద్ధిగా ఉండేలా చూస్తున్నాం.. పోలవరం నుంచి వచ్చే నీటిని సమృద్ధిగా ఉపయోగించే ఏర్పాటు చేస్తాం.. తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం అన్నారు.. ఇటీవల డయాబెటిస్ తో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాటులలో మార్పులు వస్తున్నాయి.. రైస్ తినడం తగ్గిస్తున్నారు.. డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తాం అన్నారు.. మత వివక్షలు తగ్గాయని, ప్రజల భద్రతను మరియు అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు.. కోకాపేటలో అప్పుడు రూ.10 వేలు.. ఇప్పుడు రూ.170 కోట్లు..
అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్‌లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి జరిగితే భూముల ధరలకు రెక్కలు వస్తాయి.. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అన్నారు.. పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం.. అమరావతి, విశాఖ, తిరుపతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనలో మాట్లాడుతూ రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో NDA ప్రభుత్వం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. “నాది, పవన్ కళ్యాణ్ ది అదే ఆకాంక్ష. అభివృద్ధి జరగాలంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి,” అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతామని వెల్లడించారు. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామసభలు కేవలం రూపకల్పనలుగా కాకుండా నిజమైన మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్‌గా అమలు చేసిన ఘనత NDA ప్రభుత్వానికి చెందినదని అన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్రం ఖర్చు చేసే మొత్తం ఏ దేశంలో మరే రాష్ట్రం చేయడం లేదని తెలిపారు. ఏపీ రాష్ట్రం ప్రతి ఏడాది 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందిస్తోంది. వీటిలో 59% లాభాలు మహిళలకు లభిస్తున్నాయి. రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు, నీరు, విద్యుత్, ఎరువులు సమృద్ధిగా అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని సమృద్ధిగా ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
వైసీపీలో నాకు అన్యాయం జరిగింది.. అందుకే రాజీనామా చేశా..
వైసీపీలో తనకు అన్యాయం జరిగింది అంటున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజ్ శేఖర్.. మండలి చైర్మన్ తన రాజీనామా ఆమోదించే అవకాశం ఉందని తెలిపారు.. ఇక, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని మండలి చైర్మన్ కు చెప్పా అన్నారు.. 2025 మార్చి 19న నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేశాన.. నా రాజీనామా మండలి చైర్మన్ కు ఇచ్చాను .. స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చాను అని స్పష్టం చ శారు.. ఇవాళ నన్ను హాజరు కావాలని మండలి చైర్మన్ కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది… మీరు ఇష్ట పూర్వకంగా రాజీనామ చేసారా? అని అడిగారని తెలిపారు.. స్వచ్ఛంద రాజీనామా నా హక్కు.. కారణాలు అవసరం లేదు.. నా నిర్ణయం అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజ్‌శేఖర్.. అనారోగ్యమా.. బలవంతమా.. అనేవి ఉండవు.. రాజీనామా ఎలా చేయాలి.. అనే రూల్స్ ఉంటాయి.. రూల్ బుక్ ప్రకారం రాజీనామా చేశానని స్పష్టం చేశారు.. మరోవైపు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ అన్నారు.. నేను.. కమ్మ అని టీడీపీ తీసుకోలేదు.. నాకు గౌరవం ఇచ్చిన పార్టీ.. టీడీపీ అని పేర్కొన్నారు.. అసలు నన్ను వైసీపీ పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది..? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ మర్రి రాజ్‌శేఖర్..
మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి చైర్మన్‌కు ఎమ్మెల్సీల విజ్ఞప్తి..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవికి రాజీనామా చేసారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని.. మండలి చైర్మన్ ను కోరారు.. మండలి కార్యాలయం పిలుపు మేరకు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ , మర్రి రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకీయా ఖానుమ్, పోతుల సునీత.. ఈ రోజు మండలి చైర్మన్ ను కలిసారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జయమంగళ రాజీనామా పై నాలుగు వారాల్లో గా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో మండలి చైర్మన్ ను జయమంగళ కలిసారు. తన రాజీనామకు ఆమోదం తెలపాలని కోరారు. ఎవరైనా ప్రలోభ పెడితే రాజీనామా చేసారా. జనసేన లో చేరితే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారా అని మండలి చైర్మన్ జయమంగళను ప్రశ్నించారు.. వైసీపీకి తను రాజీనామా చేసి… జనసేనలో చేరా అని వైసీపీలో ఉంటే తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు జయమంగళ… తన వ్యాపారాలు.. రాజకీయ అవసరాల కోసం జనసేన లోకి వెళ్ళా అన్నారు. మర్రి రాజశేఖర్ కూడా వైసీపీపై ఘాటుగా స్పందించారు. తనకు వైసీపీలో విలువ, గౌరవం లేక రాజీనామా చేసాం అన్నారు. వైసీపీ కన్నా టీడీపీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. తాను కమ్మ సామాజిక వర్గం అని టీడీపీ చేరుతున్నా అనడం సరికాదన్నారు. తన రాజీనామా ను మండలి చైర్మన్ ఆమోదిస్తారు అనే నమ్మకం ఉందన్నారు.. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ మోషేన్ రాజు పిలిచి మాట్లాడారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజ్‌కు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.. వైసీపీలో ఉండలేక రాజీనామా చేశామని చాలాసార్లు చెప్పామన్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు. ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను ప్రశ్నించారు మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు… స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామన్నారు ఎమ్మెల్సీలు.
వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కులశ్రేష్ఠ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం హడ్కో ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూర్, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై ముఖ్యమంత్రి… హడ్కో ఛైర్మన్‌ల మధ్య చర్చ సాగింది. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్ రీకన్‌స్ట్రక్చన్) అంశాన్ని సీఎం హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది..
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. రూ. 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి, రూ. 15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆత్మకూరు నుంచి హెలికాప్టర్‌లో మక్తల్ చేరిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందని, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు సీఎం రేవంత్. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదని, సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకులు తాపత్రయపడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఒవైసీకి షాక్
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన విధంగా అటువంటి ఉపశమనం పొందడానికి సరైన వేదిక వక్ఫ్ ట్రిబ్యునల్ అని న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB), AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా అనేక మంది పిటిషనర్లు ఆరు నెలల గడువును పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షలాది వక్ఫ్ ఆస్తుల డేటాను ఇంత తక్కువ సమయంలో అప్‌లోడ్ చేయడం అసాధ్యమని వారు వాదనలు వినిపించారు. అయితే, కోర్టు నిర్ద్వంద్వంగా అన్ని పిటిషన్లను తిరస్కరించింది.
కర్ణాటకలో ‘బ్రేక్‌ఫాస్ట్’ రాజకీయాలు.. రేపు డీకే ఇంటికి సిద్ధరామయ్య
కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల వేడుక జరుపుకుంది. అప్పటినుంచే పవర్ షేరింగ్ పంచాయితీ మొదలైంది. మిగతా రెండున్నరేళ్లు డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు హస్తినలో హైకమాండ్ దగ్గర డిమాండ్ చేసింది. దీంతో కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పవర్ షేరింగ్ రగడ నడుస్తోంది. ఈ క్రమంలోనే గత శనివారం డీకే.శివకుమార్‌ను సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అంతా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తాజాగా డీకే.శివకుమర్ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం డీకే ఇంటికి అల్పాహారం కోసం సిద్ధరామయ్య వెళ్లనున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లతో ఈ వ్యవహారం సాగిపోతుందా? లేదంటే ఇంకేమైనా జరగబోతుందా? అనేది భవిష్యతే చెప్పాలి. డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని.. 2028 మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్ రావాలంటే డీకే.శివకుమార్‌ను సీఎంను చేస్తేనే సాధ్యమవుతుందని ఆయన వర్గీయులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఈ పంచాయితీకి కాంగ్రెస్ ఫుల్‌స్టాప్ పెడుతుందా? లేదంటే సాగదీస్తుందో వేచి చూడాలి.
డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి విలువ..
రెండవ త్రైమాసికంలో అద్భుతమైన GDP వృద్ధి రేటు ఉన్నప్పటికీ డిసెంబర్ 1న (సోమవారం) US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.76కి పడిపోయింది. ఇది రూపాయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయి. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో రూపాయి మొదట్లో 89.45 వద్ద ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత పడిపోయి 89.76కి చేరింది. ఇది రెండు వారాల క్రితం నమోదైన దాని మునుపటి రికార్డు కనిష్ట స్థాయి 89.49 కంటే పడిపోయింది. భారతీయ రూపాయి విలువ వరుసగా నాలుగో సెషన్‌లో కూడా క్షీణించి, అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ గణనీయమైన క్షీణతకు డాలర్‌కు బలమైన మార్కెట్ డిమాండ్, పరిమిత సరఫరా కారణమయ్యాయి. నిరంతర బలహీనతకు ప్రధానంగా పెరుగుతున్న వాణిజ్య లోటు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం, కేంద్ర బ్యాంకు నుంచి పరిమిత జోక్యం కారణమని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒత్తిడిలో ఉంటుంది. ఎందుకంటే యుఎస్ డాలర్‌కు డిమాండ్, సరఫరా మధ్య అంతర్లీన అసమతుల్యత కొనసాగే అవకాశం ఉంది. సమీప కాలంలో, స్పాట్ USDINR 89.95 వద్ద నిరోధాన్ని, 89.30 వద్ద మద్దతును కలిగి ఉంటుంది అని HDFC సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ప్రతి 6 గంటలకోసారి..
ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. తాజాగా వాట్సాప్ సేవలకు సంబంధించిన కొన్ని రూల్స్ మారాయి. సైబర్ మోసాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పుడు, మీ ఫోన్ నుంచి యాక్టివ్ సిమ్ కార్డ్‌ను తీసివేసిన తర్వాత అన్ని మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమాలను అమలు చేసింది. వాట్సాప్ ఇకపై సిమ్ లేకుండా పనిచేయదు. భారతదేశంలో, వాట్సాప్, టెలిగ్రామ్ ఇతర యాప్‌లు మెసేజింగ్ మాధ్యమంగా మారాయి. కానీ పెరుగుతున్న సైబర్ మోసం, ఆన్‌లైన్ నేరాల కేసులను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన నియమాలను పూర్తిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నిబంధనల ప్రకారం, ఇప్పుడు ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ ఉంటే తప్ప ఏ మెసేజింగ్ యాప్ పనిచేయదు. అంటే, యూజర్ సిమ్ తీసేస్తే, యాప్ వెంటనే పనిచేయడం ఆగిపోతుంది.
స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మృణాల్
టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్ జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ ఎవరు, ఈ రూమర్స్‌పై మృణాల్ ఏ విధంగా స్పందించారు అనేది చూద్దాం. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన రూమర్స్‌పై తాజాగా ఈ స్టార్ హీరోయిన్ స్పందించారు. ‘ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఫ్రీ పీఆర్ స్టంట్స్ ఇవి’ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టారు మృణాల్. గతంలో ఆమె తమిళ హీరో ధనుష్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమె ధనుష్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించి వాటికి చెక్ పెట్టారు. తనకు ధనుష్ మంచి స్నేహితుడంటూ అప్పుడే మృణాల్ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్ రావడంతో ఆమె పై విధంగా స్పందించి, ఆ వార్తలకు కూడా చెక్ పెట్టారు.
టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..
టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో ధర్మ మహేష్‌కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి తనను టార్గెట్ చేస్తుందని చెప్పారు. బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని గౌతమి బెదిరిస్తుందని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాగే తన తల్లి, కూతురుపై కూడా గౌతమి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని శేఖర్ బాషా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గౌతమిపై BNS 351(3) 352 , 67 IT Act కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. శేఖర్ బాషా విషయానికి వస్తే ఆయన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచారు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు కూడా పెట్టింది. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా ఆయనపై మరో కేసు కూడా నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో ఆయనపై ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు చేసింది.