నకిలీ మద్యం కేసు బిగ్ ట్విస్ట్.. బయటపడుతున్న జనార్ధన్ లింక్‌లు.. !
నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ఫోన్ విషయంలో వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది.. ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చే మార్గంలో ముంబైలో తన ఫోన్ పోయిందని ఎక్సైజ్ అధికారులకు చెప్పారు జనార్ధన్.. దీంతో, అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో జనార్ధన్ ఫోటోను జియో సిబ్బందితో తీయించిన ఎక్సైజ్ సిబ్బంది.. అయితే, తన పేరుతో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని జనార్ధన్ ఆరోపిస్తున్నారు.. అరెస్ట్ చేసిన వ్యక్తి పేరుతో కోర్టు అనుమతి లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లో కొత్త సిమ్ గురించి ప్రస్తావించ కుండా చేయటంపై కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు జనార్ధన్.. అయితే, కొత్త సిమ్ తీసుకున్నారా? లేదా పాత సిమ్ తో వేరే వారికి ఫోన్స్ చేయనున్నారా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జనార్ధన్ పిటిషన్ వేయనున్నారట.. మరోవైపు, కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ మద్యం సిండికేట్ లింకులు బయటపడుతున్నాయి.. జనార్ధన్ తో పాటు లిక్కర్ వ్యాపారం కలిసి చేస్తున్న బొర్రా కిరణ్ కు సంబంధించిన బార్ కూడా ఇబ్రహీంపట్నం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు.. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఈ సెవెన్ బార్‌లో భాగస్వామ్యలుగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. జనార్ధన్‌కు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ లో కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు.. సమీపంలోనే ఉన్న బొర్రా కిరణ్ బార్ లో కూడా ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.. బొర్రా కిరణ్ ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యానికి సంబంధించి కాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డి బంధువులు పాతూరు రోడ్ లో ఒక బార్ ను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బార్ లో కూడా జనార్ధన్‌కు వాటాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.. ఆ బార్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.. దీంతోపాటు జనార్ధన్‌కు వాటాలు కలిగిన అతను సిండికేట్‌లో అన్ని బార్లను అధికారులు కల్తీ మద్యం అమ్మకాలపై విచారణ చేయటానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జనార్ధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్.. వారికి పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.. పది మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జీవోఎం కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.. ఇక, జీవోఎం కమిటీలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్ధతులపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని పేర్కొంది సర్కార్.. ఇంటర్మీడియరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని జీవోఎంను ఆదేశించింది ప్రభుత్వం.. ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కల్గిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని తెలిపింది.. పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని పేర్కొంది.. పదోన్నతుల తర్వాత హేతుబద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై చర్చించాలని ఆదేశించింది.. వీలైనంత త్వరగా అధ్యయనంపూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..
క్యాన్సర్ నుంచి కాపాడుకుందామనుకుంటే.. రోడ్డుప్రమాదం మింగేసింది..
క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన పాలది శ్రీహరి కొడుకు హర్షకు 9 ఏళ్లు. రెండేళ్ల నుంచి హర్ష మెటాస్టాటిక్ న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొడుకు వైద్యానికి ఇప్పటికే కోటిన్నరకుపైగా ఖర్చు చేశారు హర్ష తండ్రి. అయినా, లాభంలేకుండాపోయింది. అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లోని మనోనాధామ్‌లో బావిలో నీళ్లు తాగితే క్యాన్సర్ పోతుందని యూట్యూబ్ రీల్స్ లో చూశారు. కొడుకును రక్షించుకోవాలన్న తపనతో గత శనివారం తిరుపతి నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనోనాధామ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్తే మూడు కిలో మీటర్ల క్యూ ఉంది. అది చూసిన ఆ బాలుడు వెనక్కి వెళ్లిపోదాం డాడీ.. ఇక్కడ వద్దు అనడంతో సోమవారం తెల్లవారుజామున క్యాబ్ లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరారు.. మార్గం మధ్యలో తెల్లవారు జామున 3 గంటలలకు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్ష అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో హర్ష తండ్రి తలకు బలమైన గాయంకాగా… ఆయన తమ్ముడు, తమ్ముడు కూతురికి, క్యాబ్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి.
పేరుకే విద్య.. లోపతంతా వైవిద్యమే.. మీరు చూస్తే షాక్ కావాల్సిందే..!
సంగారెడ్డి జిల్లా మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్న విద్య అనే మహిళపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం ఎస్పీ కార్యాలయం ఎదుటకు చేరడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. విద్య తన పరిచయాలను వాడుకుని పలు వ్యాపారులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించింది. బంగారం తక్కువ ధరకే అందిస్తానని చెప్పి 18 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. బాధితులు డబ్బులు అడగగానే ఈ నెల 9న ఇంటికి పిలిచి అనుచరులతో దాడి చేయించినట్టు ఆరోపిస్తున్నారు. “పటాన్ చెరు పోలీసులు పట్టించుకోవడం లేదు.. నిందితులను పట్టుకుని వదిలేశారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటంపై ప్రశ్నలు లేవుతున్నాయి. ఇది ఒక్క కేసు మాత్రమే కాదు. చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పద్ధతిలో 10 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు బయటపడింది.
మొదటి రోజు ముగిసిన నామినేషన్లు.. ఎన్ని వచ్చాయంటే..?
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో రెండు రిజిస్టర్‌డ్ రాజకీయ పార్టీలు తరఫున ఇద్దరు అభ్యర్థులు, మిగిలిన ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ తరపున అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక నామినేషన్ల స్వీకరణకు గడువు సమీపిస్తున్న కొద్దీ, మరికొంత మంది అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం.
జన్ సురాజ్ 65 మంది అభ్యర్థులతో రెండవ జాబితా విడుదల.. లిస్ట్ లో లేని ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే, రాఘోపూర్ స్థానం నుంచి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఎన్నికల్లో పోటీ చేయనున్న కిషోర్ పేరు జాబితాలో లేదు. మూడు దశాబ్దాలుగా నితీష్ కుమార్ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, చాలా కాలంగా ఆయనకు బలమైన కోటగా భావిస్తున్న హర్నాట్ స్థానం నుంచి కమలేష్ పాశ్వాన్‌ను పార్టీ నిలబెట్టింది. కొత్త జాబితాలో 20 రిజర్వ్డ్ నియోజకవర్గాలకు (షెడ్యూల్డ్ కులాలకు 19, షెడ్యూల్డ్ తెగలకు 1), 46 అన్ రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులు ఉన్నారు. ఈ జాబితాలో అత్యంత వెనుకబడిన తరగతి (10 మంది హిందూ, 4 ముస్లిం) నుంచి 14 మంది అభ్యర్థులు, ఇతర వెనుకబడిన తరగతుల నుండి 10 మంది, రిజర్వ్డ్ వర్గాల నుండి 11 మంది, మైనారిటీ వర్గాల నుండి 14 మంది అభ్యర్థులు ఉన్నారని పార్టీ ప్రకటించింది. విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, హర్నాట్ వర్ధమాన్ అసెంబ్లీ స్థానం నుండి ఒక SC/ST అభ్యర్థిని కూడా పోటీలో నిలిపారు – ఇది జనరల్ కేటగిరీ నియోజకవర్గం.
మడగాస్కర్‌లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది?
యువత తలుచుకుంటే దేశంలో అధికారులు చేతులు మారుతాయని నేపాల్ వంటి దేశంలో జరిగిన నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి. నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు పెల్లుబిక్కాయి. తాజాగా మడగాస్కర్‌లో జనరల్ జెడ్ ఉద్యమం వేరే రూపాన్ని సంతరించుకుంది. జనరల్ జెడ్ ఉద్యమం దెబ్బకు మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశంలో చెలరేగుతున్న అశాంతిని అంతం చేయడానికి తన ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన వ్యూహం అక్కడ పని చేయలేదు. ఇప్పుడు దేశంలో యువత తిరుగుబాటులోకి సైన్యం కూడా ప్రవేశించింది. సెప్టెంబర్ 25న మడగాస్కర్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. రెండు వారాలకుపైగా జరుగుతున్న ఈ నిరసనలో అనేక మంది ప్రజలు మరణించారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల పక్షాన నిలిచిన మడగాస్కర్ సైన్యంలోని ఒక విభాగం మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఆదివారం అది కొత్త సైనిక అధిపతిని కూడా నియమించింది. అయితే ఈ నియామకాన్ని అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా అధికారాన్ని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా ఖండించారు.
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు. తాజాగా అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని నోబెల్ ప్రకటించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లకు ప్రదానం చేశారు. ఇది నోబెల్ సీజన్‌లో చివరి బహుమతి. నోబెల్ కమిటీ ప్రకటన ప్రకారం, “ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు వారిని నోబెల్ ప్రైజ్ వరించింది. సగం మోకిర్‌కు “సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు”, మిగిలిన సగం అగియోన్, హోవిట్‌లకు సంయుక్తంగా “సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం” కృషి చేసినందుకు అందించారు. మోకిర్ పై నోబెల్ కమిటీ ప్రకటన ప్రకారం.. స్థిరమైన వృద్ధి కొత్త సాధారణ స్థితికి రావడానికి గల కారణాలను వెలికితీసేందుకు మోకిర్ చారిత్రక వనరులను ఒక మార్గంగా ఉపయోగించాడు. స్వీయ-ఉత్పత్తి ప్రక్రియలో ఆవిష్కరణలు ఒకదానికొకటి విజయవంతం కావాలంటే, ఏదో ఒకటి పనిచేస్తుందని మనం తెలుసుకోవడమే కాకుండా, ఎందుకు పనిచేస్తుందో శాస్త్రీయ వివరణలు కూడా మనకు అవసరమని ఆయన ప్రదర్శించారు. పారిశ్రామిక విప్లవానికి ముందు రెండోది తరచుగా లోపించింది. ఇది కొత్త ఆవిష్కరణలు, ఆవిష్కరణలపై నిర్మించడం కష్టతరం చేసింది. సమాజం కొత్త ఆలోచనలకు బాటలు వేయడం మార్పును అనుమతించడం గురించి ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
అన్ స్టాపబుల్ కాంతార..11 రోజులు 655 కోట్లు!
కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి 11 రోజులు పూర్తయింది. అందులో పది రోజులకు గాను ఈ సినిమా ఏకంగా 655 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టే సినిమాల్లో టాప్ లిస్టులో చేరింది. ఇక, ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1000 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దించబడిన ఈ సినిమా ఇప్పటికే 65% వరకు టార్గెట్ పూర్తి చేసుకుందని చెప్పొచ్చు. ఇక, ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నడ హొంబాలే ఫిలింస్ సంస్థ నిర్మించింది.
శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా అదే.. మాధురి కామెంట్స్
బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం బాగానే నడుస్తోంది. నిన్న ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక విషయాలను పంచుకుంది. హౌస్ లోకి వెళ్లిన శ్రష్టి వర్మ మొదటి వారానికే బయటకు వచ్చింది కదా.. ఆమెకు ఓ కొరయోగ్రాఫర్ విషయంలో జరిగిన గొడవల వల్ల ఓటింగ్ సరిగ్గా రాలేదు. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయితే ఎలా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. శ్రష్టి వర్మ పరిస్థితులు వేరు.. మా పరిస్థితులు వేరు. ఆమెను క్రిటిసైస్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మమ్మల్ని క్రిటిసైస్ చేయడానికి ఎలాంటి కారణాలు పెద్దగా లేవు. శ్రీనివాస్ లైఫ్ లో ఇబ్బందులు పడి బయటకు వచ్చారు. నేను కూడా నా భర్తతో ఇబ్బందులు పడి ఇష్టంలేక బయటకు వచ్చాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇందులో తప్పేముంది. చాలా మంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవట్లేదా.. వాళ్లు సినిమాలు చేయట్లేదా, రాజకీయాల్లో ఉండట్లేదా. మమ్మల్ని మాత్రమే ఎందుకు ఇలా అంటున్నారు. మేం ఎవరికీ అన్యాయం చేయట్లేదు. చాలా మందికి పని కల్పిస్తున్నాం. ఎంతో మందికి సాయం చేస్తున్నాం. కాబట్టి నాకు శ్రష్టి వర్మ లాంటి పరిస్థితి రాదు అంటూ తెలిపింది మాధురి.