మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగింది
మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలోని న్యూరో విభాగంలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగంతలు పెంచామనిచ పీజీ సీట్లు డబుల్ చేసామన్నారు. నెలకు మూడు నాలుగు ఎయిర్ అంబులెన్స్ ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. అత్యధిక ట్రాన్స్ ప్లాంట్ జరిగేది హైదరాబాద్ లోనే అన్నారు. అరోగ్య శ్రీ కింద అత్యధికంగా 10 లక్షల వరకు ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద 1000 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. అనవసర పరీక్షలు చేయొద్దు, అనవసర మందులు వద్దు ప్రజలపై భారం మోపొద్దని, ప్రజలపై భారం మోపొద్దు.. అనవసర పరీక్షలు, అనవసర మందులు వద్దని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఆగిరిపల్లిలో చెత్తలో పేలుడు.. ఒకరి మృతి
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. చెత్తలో పేలుడుతో సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నూజివీడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందగా శాంతల మణికి స్వల్ప గాయాలు అయ్యాయి. చెత్త దగ్గర భయంకర శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాగా పేరుకుపోయిన చెత్తను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. చెత్తకు నిప్పంటించగా కెమికల్ తో కూడిన వ్యర్థపదార్థాలు ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బండి సంజయ్ కి పైలట్ రోహిత్ రెడ్డి సవాల్
ఇవాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ పాత బస్తి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయని అంటున్న బండి సంజయ్ కు సవాల్ విసిరారు. టార్గెట్ లో భాగంగానే నాకు ఈడి నోటీసులు ఇచ్చారని అన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు నాకు ఈడి నోటీసులు వచ్చాయని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ వెయ్యి పడగల పాము అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక డ్రగ్ కేసులో నాకు సంబంధం ఉందని బండి సంజయ్ అంటున్నారని మండిడ్డారు. అయ్యప్ప మాలలో ఉన్నానని.. ఒక హిందువుగా నేను సవాల్ విసురుతున్నా అన్నారు. బండి సంజయ్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని, నా పై చేసిన ఆరోపణలను భాగ్య లక్ష్మి అమ్మవారి ముందు బండి సంజయ్ రుజువు చెయ్యాలని అన్నారు. హిందూ వాదిగా చెబుతున్న కర్ణాటక పోలీసుల నుంచి నాకు ఎటువంటి నోటీసులు రాలేదని తెలిపారు. భాగ్య లక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. రేపు ఇదే టైం కు నేను భాగ్య లక్షి అమ్మవారి వద్దకు వస్తా… బండి సంజయ్ కూడా రుజువులతో రావాలి సవాల్ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో వచ్చి నాపై చేసిన ఆరోపణలు రుజువులు చూపాలని పేర్కొన్నారు. లేకుంటే బండి సంజయ్ అమ్మవారి ముందు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
దేహదారుఢ్య పరీక్షలు.. అస్వస్థతకు గురైన అభ్యర్థికి చికిత్స
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ నియామకాలకు ప్రక్రియ ప్రారంభించింది. లిఖిత పూర్వక పరీక్షలు పూర్తయ్యాయి. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరుగుపందెం, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు బయో మెట్రిక్ ద్వారా హాజరును తీసుకోనున్నారు. అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగార్థులకు గురువారం నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ఇవి ప్రారంభం అవుతున్నాయి. అభ్యర్థుల్ని గంట ముందుగానే అనుమతిస్తున్నారు. అభ్యర్థులు ఎవరి మాయలోనూ పడొద్దని, డబ్బులిస్తే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా ప్రలోభ పెడితే తమకు కంప్లైంట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. పోలీస్ నియామకల్లో భాగంగా వరంగల్ కాకతీయ యూనివర్శిటీ మైదానంలో నిర్వహిస్తున్న దేహ దారిద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అస్వస్థత గురయ్యాడో అభ్యర్థి. అతడిని వెంటనే MGMకు తరలించిన పోలీస్ అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఆ అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు అవసరమయిన వైద్య చికిత్స అందిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఒక అభ్యర్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే ఎంజీఎంకి చేరుకున్నారు. అనారోగ్యం పాలైన అభ్యర్థికి అందిస్తున్న చికిత్సను పరిశీలించడంతోపాటు అభ్యర్థి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ సెక్రటరీ నిర్వాకం…బతికుండగానే డెత్ సర్టిఫికెట్
సాధారణంగా ఎవరైనా మరణిస్తే 21 రోజుల లోపు వారి మరణానికి సంబంధించిన వివరాలతో గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీల్లో మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తాం. కానీ బతికుండగానే ఎవరైనా డెత్ సర్టిఫికెట్ ఇస్తారా? కానీ ఆ ఊళ్ళో మాత్రం బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. బ్రతికి ఉండగానే మరణ ధృవీకరణం నమోదు చేసిన పంచాయితీ సెక్రటరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల నుండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వృద్దుడు.. అసలెందుకిలా జరుగుతుందో అని పరిశీలించాడు. కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన వృద్దుడి దిమ్మతిరిగే సమాధానం వచ్చింది. బ్రతికున్న వ్యక్తికి మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి అతని పెన్షన్ ఆగిపోవడానికి కారణం అయిన సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గ్రామ ఎంపీటీసీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లో నేడు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ను మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలకుర్తి సునీత కలుసుకుని వినతిపత్రం అందజేశారు. తమ గ్రామానికి చెందిన నక్క పెద్ద సుందరం అనే వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పెద్ద సుందరం చనిపోయినట్లు రికార్డులలో నమోదు చేయించాడన్నారు.
ఆర్బీఐ ఎఫెక్ట్.. రుణభారం పెరుగుతోందని ఆందోళన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్‌ని పెంచుకునేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని నిపుణులు అంటున్నారు. గతంలో నాలుగు సార్లు రెపో రేటు పెరిగినప్పుడు లోన్ రీపేమెంట్ టైమ్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకున్నవాళ్లు ఇప్పుడు కూడా మరోసారి పొడిగింపు కోరుకుంటే దానివల్ల లోన్‌పై నెగెటివ్ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంటే.. మంత్లీ ఇంట్రస్ట్ పేమెంట్ అనేది ఈఎంఐ పరిధిలోకి రాదు. ఫలితంగా.. నెల నెలా ఈఎంఐలు కడుతున్నప్పటికీ ప్రిన్స్‌పల్ అమౌంట్ మాత్రం పెరుగుతూ పోతుందని హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల వల.. ఆస్ట్రేలియాలో హై మమ్ స్కాం
ఒకప్పటిలా సైబర్ నేరగాళ్ల వలలో జనాలు చిక్కుకోవట్లేదు. వాళ్ల పన్నాగాల్ని సునాయాసంగా పసిగడుతున్నారు. అందుకే.. జనాల్ని బురిడీ కొట్టించేందుకు వాళ్లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆఫర్లు, లాటరీ అంటూ గాలం వేయకుండా.. పరిచయం ఉన్న వ్యక్తులుగా నమ్మించి, శఠగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులోనూ వాళ్లు దాదాపు సక్సెస్ అవుతున్నారు. తెలిసిన వ్యక్తుల పేర్లతో సందేశాలు చేస్తూ.. ఈజీగా డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ ఇలాంటిదే ఒక స్కామ్ వెలుగు చూసింది. ఆ స్కామ్ పేరు ‘హై మమ్ స్కామ్’. ‘హై మమ్.. ఎలా ఉన్నావ్.. ఇది నా కొత్త నంబర్.. సేవ్ చేసుకో.. ఒకవేళ నువ్వు ఈ మెసేజ్ చూస్తే, వెంటనే నాకు రిప్లై ఇవ్వు’’.. ఇలా కొత్త నంబర్‌తో సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. ఈ సందేహాలు చూస్తే.. నిజంగా తమ సంతానమే అవి పంపించినట్టు అనిపిస్తుంది. ఆస్ట్రేలియన్స్ కూడా అలాగే భ్రమ పడ్డారు. ఆ సందేశానికి రిప్లై ఇస్తే.. తాము ఫలానా సమస్యల్లో ఉన్నామని, కొంత డబ్బు పంపించాలని ఇంకో మెసేజ్ వస్తుంది. ఇంకేముంది.. తమ సంతానం నిజంగానే సమస్యల్లో ఉందేమో అని, డబ్బులు పంపించారు. ఇలా షాపింగ్ పేరిట, స్కూల్ ఫీజ్ పేరిట.. ఇంకా రకరకాలుగా మోసం చేస్తూ వందల కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అక్కడి రిపోర్ట్స్ ప్రకారం.. ఇలాంటి మెసేజీలతో ఈ ఏడాది ఏకంగా 7.2 మిలియన్ డాలర్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు తేలింది. దీంతో.. దీనికి ‘హై మమ్ స్కామ్’గా పేరొచ్చింది.
మోడీ-ఫుతిన్ ఫోన్ కాల్ పై అమెరికా రియాక్షన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే! ఈ పరిణామాలపై తాజాగా అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమన్న మోడీ వ్యాఖ్యల్ని స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ‘‘మోడీ మాటల్ని మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఒకవేళ ఆయన సూచనలు ఆచరణలోకి అమలైతే.. అప్పుడు మేం వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేం మిత్రదేశాలతో సమన్వయం కొనసాగిస్తాం’’ ఆయన పటేల్ తెలిపారు. యుద్ధాన్ని ముగించి, శాంతి స్థాపనకు పాటుపడాలనే చూసే ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.