సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం.. ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.. వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఏపీకి మరో వాయుగుండం..
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే బెజవాడకు మరో వాయుగుండంతో గజగజలాడబోనుంది. ఇకపోతే ప్రస్తుతం నీట మునిగిన విజయవాడ నగరం ఇంకా నీటిలో నుంచి బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజయవాడ నగరవాసులకు ప్రత్యేకమైన సహాయసహకారాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకొని సహాయక చర్యలను చేపట్టిస్తున్నారు.
ముంపు బాధితుల వద్ద నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పనులు పూర్తి.. ట్రాక్ పై ట్రయల్ రన్
మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదనీటికి తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.. ఇంటికన్నె కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశారు అధికారులు. వరద దాటికి రెండు రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను.. 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. ఇంటికన్నె తాళ్ల పూసల పల్లి గార్ల దగ్గర జరిగిన డ్యామేజ్ మరమ్మత్తు కోసం సుమారు 1000 మంది సిబ్బంది పనులు చేపట్టారు. ఇంటికళ్ల దగ్గర 250 మంది పని చేస్తే, తాళ్ల పూసల పల్లి దగ్గర 200 మంది వర్కర్లు ట్రాక్ నీ మరమ్మత్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో 36 గంటల్లో ఇంటికన్నె కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేసి రైల్వే శాఖ అధికారులు రికార్డు సృష్టించారు. దీంతో సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. కాగా.. అధికారులు ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుండి రెగ్యులర్ ట్రైన్స్ నడపడానికి రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం-వరంగల్ రూట్లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. సుమారు 20 ప్రాంతాల్లో పాక్షికంగా నాలుగు చోట్ల పెద్ద ఎత్తున ట్రాక్ దెబ్బతింది ఇంటికన్నె తాలపూసల పల్లి దగ్గర డామేజ్ ఎక్కువైంది. దీన్ని రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికల సిద్ధం చేశారు.
హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే.. హైడ్రా కమిషనర్ వార్నింగ్..
హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే అని హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులో తీసుకున్న ఘటనపై హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ స్పందించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ కేటుగాళ్లు బెదిరంపులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి వారు ఎవరైనా వుంటే గుర్తించి తమ దృష్టికి తేవాలని రంగనాథ్ ప్రజలను కోరారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల కు సామజిక కార్యకర్తల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎలాంటి సమస్య రాకుండా కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం బెదిరించిన సమాచారం అందించాలన్నారు. డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాని హైడ్రా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా ను అరెస్ట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా ను పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి కైనా ఇలాంటి వారిపట్లు ప్రజలు, బిల్డర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్.. రాజకీయ అరంగేట్రం ఖాయమే?
భారత స్టార్ రెజ్లర్‌లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్‌లు రాహుల్‌తో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం సమావేశం అయింది. ఎన్నికల్లో పోటీ చేసే 34 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు హరియాణా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. నేడు అధికారికంగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం గమనార్హం. వినేశ్, పునియాలను సెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం.. ముప్పై మంది అధికారులకు ఉరి..
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకపోవడం వారి తప్పు. ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఆ ఘటనలో ఏకంగా 4000 మందికి పైగా మరణించారు. దక్షిణ కొరియా ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. వ్యక్తుల మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడతాయని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా, ఈ విపత్తులో తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేని వారందరినీ శిక్షించాలని కిమ్ జాంగ్ ఆదేశించారు. గత నెలలో కూడా పార్టీకి చెందిన 20 మందికి పైగా ప్రముఖులు హత్యకు గురయ్యారు. చాంగాంగ్ ప్రావిన్స్ నుండి తొలగించబడిన పార్టీ కార్యదర్శి కాంగ్ బాంగ్ హూన్ కూడా పట్టుబడ్డారు. ఈసారి ఉత్తర కొరియాలో వరదలు భారీ ఎత్తున వచ్చాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 4000 మందికి పైగా మరణించారు. ఇంత పెద్ద విషాదం తర్వాత కిమ్ జాంగ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అందులో కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పిల్లలు, వృద్ధులు, వికలాంగులను సైనికులు 15,400 మందికి పైగా ప్రజలను వరద నుండి రక్షించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి రావడానికి 3 నెలల సమయం పడుతుందని సుప్రీం లీడర్ చెప్పారు. ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1000 నుండి 1500 కంటే ఎక్కువగా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. దానిపై కిమ్ జాంగ్ ఉన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తరువాత అతను స్వయంగా తనిఖీ చేసినప్పుడు అసలు గణాంకాలు బయటపడ్డాయి. ఆ సమయంలో కిమ్ జోంగ్ ఇలాంటి వార్తలను తన పరువు తీస్తున్నట్లు అభివర్ణించారు.
కంగనా రనౌత్ ఎమర్జెన్సీపై స్టే విధించిన జబల్‌పూర్ హైకోర్టు
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఎందుకంటే సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. కంగనా రనౌత్ సినిమాపై జబల్‌పూర్ హైకోర్టులో విచారణ జరిగింది. ఎక్కడ ఈ నిషేధం విధించారు. వాస్తవానికి, ప్రస్తుతం ఈ చిత్రానికి ఆన్‌లైన్ సర్టిఫికేట్ సీరియల్ నంబర్ మాత్రమే జారీ చేయబడింది, అయితే దీనికి సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంతే కాదు కంగనా ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌ను కూడా నిషేధించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు, సిక్కు సంఘం ప్రతినిధులు ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా వారు పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దీనితో పాటు, సినిమా విడుదలైన తర్వాత కూడా ఏదైనా అభ్యంతరం ఉంటే, పిటిషనర్లు కోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. ‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెన్సార్ బోర్డు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌ను నిలుపుదల చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ అత్యవసర విచారణ కోసం జస్టిస్ బిపి కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలా డివిజన్ బెంచ్ ముందు ఉంచబడింది. ఇది నేడు విచారణకు రానుంది.
G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా ది గోట్ ’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా కనిపిస్తుండగా స్నేహ, లైలా, మాళవిక శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సెప్టెంబరు 5 న రిలీజ్ అవుతోంది ఈ పాన్ ఇండియా సినిమా. కాగా, ఈ సినిమాలో సీఎస్‌కే మాజీ క్రికెటర్ బద్రినాథ్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ విషయాన్నీక్రికెటర్ బద్రినాథ్ తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి తన వ్యక్తిగత ‘X’ ఖాతలో ఓ పోస్ట్ పెట్టారు. ది గోట్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు బద్రీనాధ్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన బద్రీనాధ్ ఇప్పుడు వెండితెరపై ‘తొలిసారి మెరవనున్నాడు. ‘ది గోట్’ కోసం నావంతు కృషి చేశాను. ఇందులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా నటనపై మీ రివ్యూ, సలహాల కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు స్పందిస్తూ, ఈ సినిమాను ఓకే చేసినందుకుగానూ బద్రినాథ్‌కు థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు వెంకట్‌ప్రభు, బద్రినాధ్ అద్భుతంగా నటించావడని కితాబునిచ్చాడు దర్శకుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
టీమిండియా స్టార్‌లకు కూడా నో ప్లేస్.. ఇండియా-ఎ తుది జట్టు ఇదే!
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో నాలుగు జట్లు తలపడుతుండగా.. ఓ టీమ్ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇండియా-ఎ vs ఇండియా-బి మధ్య రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-సి vs ఇండియా-డి మధ్య గురువారం ఉదయం మ్యాచ్ మొదలవుతుంది. అయితే అందరి దృష్టి ఎ vs బి మధ్యనే ఉంది. ఎందుకంటే ఎలో భారత టెస్ట్ టీమ్ రెగ్యులర్‌లు ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఎవరికి చోటుదక్కుతుందో చూడాలి. ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. అతని భాగస్వామి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. గిల్ సహా కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. ఈ ఇద్దరు మూడు, స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారత జట్టులో వేరు ఈ స్థానాల్లోనే ఆడుతున్నారు. రంజీ ట్రోఫీలో సత్తాచాటిన 23 ఏళ్ల శాశ్వత్ రావత్ మరో ఓపెనర్‌గా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ కీపర్‌గా ఆడనున్నాడు.
హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..
సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల శరద్ ఫైనల్ మ్యాచ్‌లో 1.88 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. మరోవైపు మరియప్పన్ 1.85 మీటర్ల ఎత్తుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇకపోతే మరియప్పన్ వరుసగా 3 పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు, ఈ మరియప్పన్ రియో పారాలింపిక్స్ 2016లో బంగారు పతకాన్ని, టోక్యో పారాలింపిక్స్ లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే పతకాలను సాధించిన శరద్ కు రెండేళ్ల వయసులో పోలియో సోకింది. మరియప్పన్ 5 సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో అతనిపై నుండి బస్సు దూసుకుపోయింది. దీని తర్వాత అతని కుడి కాలు వైకల్యం చెందింది. ఇక మంగళవారం ముగిసే సమయానికి భారత్ పతకాల సంఖ్య 20కి చేరుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు ఒకేసారి పోడియం పైకి వచ్చి మెడల్స్ తీసుకోవడం ఇది నాలుగోసారి.