యోగి వేమన జయంతి.. సీఎం వైఎస్ జగన్ పుష్పాంజలి
యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.. అయితే, యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది… ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.. కాగా, వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.. అంటే, ఆయన పద్యాలకు ఉన్న ప్రజాధరణ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు..
నా జీవితంలో ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు
నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి ప్రశంసలు కురపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మంగళగిరిలో అరణ్యభవన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాక్షించారు.. ఇక, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ పాలన ఉందన్న ఆయన.. నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంపై.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నియంత పాలన అని విమర్శించడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు, పవన్ ఎన్ని దూషణలు చేసినా.. దానిని ఆశీర్వాదంగానే తీసుకుంటామని ప్రకటించారు.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అయ్యన్నకు పోయేకాలం దాపురించిందంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంగళగిరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2024లో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని.. నా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదని.. సంక్షేమం అభివృద్ధితో జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కాబోతున్నాడని జోస్యం చెప్పారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ కి మీరు అనుకూలమా అని మీడియా ప్రశ్నించగా..? ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం చెప్పనని పెద్దిరెడ్డి ముక్తసరిగా సమాధానం చెప్పారు.
ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ.. ఒకటికి 421 మంది పోటీ..!
ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్ పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా పోటీ పడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువులకు గట్టి పోటీ నెలకొంది.. అది ఎంతలా అంటే.. ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడేలా.. ఎస్ఐ పోస్టులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువు జనవరి 18వ తేదీతో ముగిసింది.. ఆ సమయానికి 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.. వీరిలో పురుష అభ్యర్థులు 1,40,453 మంది, మహిళా అభ్యర్థులు 32,594గా ఉన్నారు.. అయితే, పోలీసు శాఖలో కేవలం 411 (సివిల్ పోలీసు-315, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్-96) పోస్టుల భర్తీకి మాత్రమే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.. 2022 నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిసెంబరు 14 నుంచి 2023 జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు.. ఇక, అభ్యర్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష జరగనుంది.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ
సికింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ మిస్టరీగా మారింది. లోకో పైలెట్ మిస్సింగ్ కేసు నమోదై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఛేదించక పోవడంపై లోకో పైలెట్ వాసవీ తల్లిదండ్రులు మీడియా ముందుకు రావడంతో.. దీనిపై సనత్‌నగర్ సీఐ ముత్తూ యాదవ్ NTV తో మాట్లాడారు. అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె తన వెంట ఎలాంటి ఏటీఎం, సెల్ ఫోన్ కానీ తీసుకెళ్లకపోవడంతో ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందికరంగా మారిందని అన్నారు. భరత్ నగర్ వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన సీసీ ఫుటేజ్ ఒకటే ఉందని.. భరత్ నగర్ నుండి సిసి కెమెరాలు పని చేయడం లేదని సీఐ మీడియాకు తెలిపారు. కాబోయే భర్తను కూడా మూడుసార్లు స్టేషన్ కి పిలిపించి విచారించామన్నారు. ఆమె తోటి ఉద్యోగులను కూడా విచారించామని వెల్లడించారు. వాసవి ప్రభకు సంబంధించిన ఆచూకీ లభిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని సనత్‌నగర్ సీఐ ముత్తూ యాదవ్ కోరారు. నవంబర్ 30 తేదీన ఇంటి నుండి వెళ్లి పోయిందని వాసవీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇటీవలే సంచిత్ సాయి అనే వ్యక్తి తో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 11 తేదీన వివాహం కోసం వాసవీ ప్రభ షాపింగ్ చేసింది. అంతవరకు బాగానే వున్న వారిఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. వాసవీ ప్రభ ఇంట్లో మొబైల్ వదిలేసి అదృశ్యమైంది. ఇంట్లోనే తన ఐడి కార్డు, మొబైల్ ఫోన్, ఏటిఎం కార్డు, ఆధార్ కార్డులను వాసవి వదిలేసి వెళ్ళిపోవడం కలకలం రేపుతుంది. పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో గొడవ పడినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి రావాలని వాసవీ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. నీకు ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేస్తామని, ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని తల్లిదండ్రులు ఆవేడుకుంటున్న తీరు అందరినీ కలిచి వేస్తోంది. గత ఏడాది జులై 15 తేదీ నుండి సికింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ గా విధులు నిర్వహిస్తున్న వాసవీ ప్రభ.. డిసెంబర్ 5 నుండి పెళ్ళి కోసం సెలవులు పెట్టింది. ఇటు ఉద్యోగానికి రాక, అటు కనిపించక పోవడంతో పేరెంట్స్ ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు వాసవి పేరెంట్స్. తనకూతురిని తొందరగా తమ వద్దకు చేర్చాలని వేడుకున్నారు.
జల్లికట్టులో యువకుడు మృతి.. పోలీసులపై గ్రామస్తుల దాడి, టెన్షన్
సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు రక్తం చిందిస్తూనే ఉన్నాయి.. అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ఈ ఏడాది కూడా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, తిరుపత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నాట్రపల్లిలో నిన్న నిర్వహించిన జల్లికట్టులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.. అయితే, ఆ యువకుడు మృతికి పోలీసులే కారణం అంటూ ఆరోపిస్తున్న గ్రామస్తులు.. పోలీసులపై దాడికి తెగబడ్డారు.. గ్రామస్తుల దాడిలో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులైన పోలీసులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.. మరోవైపు నాట్రపల్లిలో భారీగా మోహరించారు పోలీసులు.. ఇవాళ గ్రామంలో జరగాల్సిన జల్లికట్టును రద్దు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు..
మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధర.. వెండిది అదే దారి..
మరోసారి వరుసగా పైకి కదులుతూ సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నాయి పసిడి ధరలు.. వెండి కూడా పసిడి బాట పట్టింది.. అయితే, ఇవాళ బంగారం కొనుగోలు దారులకు కాస్త రిలీప్ దొరికినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇవాళ పసిడి ధరలు కాస్త కిందికి దిగివచ్చాయి.. బులియన్ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.300 వరకు తగ్గింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్న తరుణంలో.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు.. ఇక, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,350గా ఉంది.. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000కి తగ్గింది.. ఇక, చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,790గా.. 22 క్యారెట్ల ధర రూ. 52,980గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల మంగాల ధరం రూ. 56,781గా ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ. 52,050గా ఉంది.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730గా.. 22 క్యారెట్ల ధర రూ. 52,000కు చేరింది.. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730కి తగ్గితే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000కి చేరింది.. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే కొలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 74,800, విజయవాడలో రూ. 74,800, ఢిల్లీలో రూ. 72,200, ముంబైలో రూ. 72,200గా, చెన్నైలో రూ. 73,500గా, బెంగుళూరులో రూ. 73,500గా పలుకుతోంది.
యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్‌ను ఢీకొట్టడం నవ్వులు పూయించింది. బౌండరీ వద్ద రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారగా క్రికెట్ ఫ్యాన్స్ సరదా కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్-ఎంఐ కేప్‌టౌన్ జట్ల మధ్య మ్యా్చ్ జరిగింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో సామ్ కరన్ వేసిన 13వ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా మార్కో జాన్సన్ కొట్టిన షాట్ బౌండరీవైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కోచ్‌లను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్ బౌండరీ వద్దే ఉంది. దీంతో నేరుగా యాంకర్‌ను ఫీల్డర్ ఢీకొట్టడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. కానీ పెద్ద గాయం ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్ 20 ఓవర్లలో 171/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 172/8 పరుగులు చేసి విక్టరీ సాధించింది. మార్కో జాన్సన్ 27 బంతుల్లో 66 రన్స్ చేసి సన్‌రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
హీరోయిన్‌తో స్టూడెంట్ మిస్‌బిహేవ్
మలయాళ నటి, ‘ఆకాశమే నీ హాద్దురా’ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాంకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. మొదట హీరోయిన్‌కు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి ప్రవర్తనతో అపర్ణ ఇబ్బందిగా ఫీలయ్యింది. ఆ స్టూడెంట్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసింది. అయితే, ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సమయంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్ అక్కడే ఉన్న ఆ స్టూడెంట్ చేస్తోన్న పనిని అడ్డుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటనకుగానూ అపర్ణ జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోన్న అపర్ణ బాలమురళి.. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్‌తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమంలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు మరో ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి జోరుమీదుందీ ఈ హీరోయిన్.
పెళ్లి కూతురు స్మార్ట్ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..
ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తోంది.. ఇదో సంస్థ వాణిజ్య ప్రకటన కావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌గా ఆలోచిస్తే.. ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అంటోంది ఓ పెళ్లి కూతురు.. బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని స్టార్టప్ సిటీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఒకటి ఇక్కడి వాతావరణం, రెండోది ట్రాఫిక్ జామ్… అసలు ట్రాఫిక్ జామ్ విషయం ఏమిటంటే, విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకునే సమయం కంటే.. విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందట.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ఓ వధువు బుర్రకు అద్భుతమైన ఐడియా తట్టింది.. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది.. అసలే ముహూర్తం సమయం ముంచుకొస్తుంది.. వధువు ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.. అప్పుడే స్మార్ట్‌గా ఆలోచించింది వధువు.. కారును వదిలే.. మెట్రో రైల్ ఎక్కింది.. సరైన సమయానికి మండపానికి చేరుకుంది.. పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు చేసినా.. కొన్ని చివరికి మూడ్ పాడు చేసే ఘటనలు చోటు చేసుకుంటాయి.. పెళ్లికి వచ్చేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆలస్యంగానైనా చేరుకుంటారేమో.. కానీ, పెళ్లి చేసుకోవాల్సినవారే ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.. మొత్తంగా ట్రాఫిక్ జామ్‌తో తన పెళ్లికి ఆలస్యంగా కాకుండా.. మెట్రో రైల్ ఎక్కి మండపానికి చేరుకుంది.. నగలు ధరించిన నవ వధువు.. మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఆ యువతిని చూసి అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు గందరగోళానికి గురయ్యారు.. కానీ, వధువు దీని గురించి ఏమీ పట్టించుకోకుండా.. మెట్రోలో తన గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరింది. ఆమె సానుకూలత అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక, ఈ వీడియో @peakbengaluru అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోతో అతను వాట్ స్టార్ !! భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, స్మార్ట్ బెంగళూరు పెళ్లికూతురు తన కారును వదిలి, పెళ్లి ముహూర్త సమయానికి ముందు తన పెళ్లి మండపానికి చేరుకోవడానికి మెట్రో ఎక్కింది!! అని వీడియో షేర్ చేశారు.. ఇప్పటికే ఆ వీడియో 4.8 వేల మందికి పైగా నెటిజన్లు చూశారు.. పెళ్లి కూతురు ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.
మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?
గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సాహించడం లేదు. ఓటీటీ పుణ్యమా అని ఒరిజినల్ వర్షన్స్‌లోనే ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. అందుకే.. స్టార్ హీరోలందరూ ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. అది హిట్ అవుతుందా? బోల్తా కొడుతుందా? అనే సంగతులు పక్కనపెడితే.. ఒరిజినల్‌లో ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంటుందని, రీమేక్‌లో అలాంటి భావన ఉండటం లేదని చెప్తున్నారు. ఆల్రెడీ చూసేసిన సినిమానే రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో రీమేక్ చిత్రాలపై ఇంత వ్యతిరేకత ఉన్నా.. మన హీరోలు మాత్రం రీమేక్ చిత్రాలను ఒక సవాల్‌గా తీసుకొని, వాటిని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి రెండు రీమేక్‌లు (ఖైదీ నం.150, గాడ్‌ఫాదర్) చేసేశారు. వాల్తేరు వీరయ్యలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్‌తో అభిమానులను అలరించిన ఆయన.. భోళా శంకర్ (వేదాళం) అనే మరో రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తమిళంలో మంచి విజయం సాధించిన ‘విశ్వాసం’ సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 2019లో విడుదలైన ఆ సినిమాలో అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించారు. ఈ తెలుగు రీమేక్‌కు దర్శకుడు వివి వినాయక్ మెగాఫోన్ పట్టనున్నాడట! అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
మస్క్ షాకింగ్ నిర్ణయం..మరోసారి ఉద్యోగాల కోత!
మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొదట 7,500 మంది ఉద్యోగులు ఉండగా సగానికిపైగా మందిని తొలగించారు. ఈసారి ఈ సంఖ్యను 2000 దిగువకు కుదించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అధికారులకు మస్క్ ఆదేశాలు జారీ చేశారట. మరో వారం, 10 రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ కష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ ఆఫీసులకు అద్దె కట్టలేని పరిస్థితులకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు, నియాన్ లోగో, ఇతర సామగ్రిని వేలానికి పెట్టారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. దీనికి సంబంధించి హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ సంస్థ 27 గంటల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 631 సర్‌ప్లస్ కార్పొరేట్ ఆఫీస్ ఆస్తులు ఉంచారు. ఇండస్ట్రీయల్ కిచెన్ వేర్, వైట్‌బోర్డులు, డెస్కుల వంటి ఆఫీస్ ఫర్నీచర్, కేఎన్95 మాస్కులు కలిగిన 100కుపైగా బాక్సులు, డిజైనర్ కుర్చీలు, కాఫీ మిషన్లు వంటివి వేలం వేసింది.