రాజధాని ప్రాంతంలో సీఎం కొత్త ఇంటికి శంకుస్థాపన..
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తను కూడా రాజధాని ప్రాంతంలో ఇల్లు నిర్మాణాన్ని తలపెట్టారు.. దీని కోసం గత ఏడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌ను రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.. ఇంటి నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు చేరుకుని.. వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు.. భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది. రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది.. సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. సీఎం తమ ప్రాంతంలో ఇల్లు కట్టు కోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. భూమి పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంటి ప్లాన్ వివరించారు… అధికారిక నివాసం, కాన్ఫరెన్స్ హాల్‌కు సంబంధించి చర్చ జరిగింది.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అత్యాధునిక హంగులతో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరగనున్నట్టుగా తెలుస్తోంది.. ఇంటి నిర్మాణ ప్లాన్‌ను సీఎంకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించగా.. ఇంటి నిర్మాణ స్థలం చిట్టూ తిరుగుతూ పరిశీలించారు సీఎం చంద్రబాబు.. ఇక ఈ మధ్యే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.. 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 1లో ఇంటిని నిర్మించనున్నారట.. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట..
సీఎం ఛైర్మన్‌గా జలహారతి కార్పొరేషన్..
పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఉండనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా జల హారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. వైస్ ఛైర్మన్ గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉంటారు.. సంస్థ సీఈవోగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తారు. పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం – బనకచర్ల లింకు ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్.. 80 లక్షల మందికి తాగునీటిని అందించేలా పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది.. 9.14 లక్షల హెక్టార్ల కు నీటిని ఇవ్వటంతో పాటు 20 టీఎంసీల మేర పరిశ్రమలకు ఇవ్వొచ్చని స్పష్టం చేస్తోంది.. ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం.. గోదావరి బేసిన్ లో వృథాగా పోతున్న వరద జలాలను లోటు ఉన్న ప్రాంతాలకు తరలించేలా లింకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దాదాపు 150 టీఎంసీల వరకూ నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని లోటు ఉన్న జిల్లాలకు ఈ వరద జలాలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది..
ఎస్సై సుధాకర్‌పై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రావాలనే..!
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన కాక రేపుతోంది.. జగన్ పర్యటనపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.. ఇక, రామగిరి ఎస్సై సుధాకర్ పేరును జగన్ ప్రస్తావించడం.. జగన్ వ్యాఖ్యలకు సుధాకర్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఎపిసోడ్‌లో హాట్ కామెంట్లు చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు సరికాదన్నారు.. జగన్ ను విమర్శించే స్థాయి ఎస్సై సుధాకర్ యాదవ్ కు లేదన్న ఆయన.. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకర్ యాదవ్ కారణం అని ఆరోపించారు.. ఎస్సై సుధాకర్ యాదవ్ ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారు.. ఎస్సై సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది…! అని ఫైర్ అయ్యారు. ఇక, ఎస్సై సుధాకర్ యాదవ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం గ్రహించాలని సూచించారు.. పరిటాల కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేదన్న ఆయన.. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే.. వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా? అని ప్రశ్నించారు. ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయన్నారు.. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా? పోలీసులపై చంద్రబాబు దూషణలు వినిపించవా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు? చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాప్తాడు మాజీ ఎమ్మెల్ఏ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..
జగన్ టూర్ డ్రామాను తలపించింది.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటన మరోసారి అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం.. కానీ, వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు.. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూశారని మండిపడ్డారు. హెలిపాడ్ దగ్గరకు తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు.. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.. ఇంతచేసి పోలీసులను తప్పు పడుతున్నారు అని జగన్‌పై ఫైర్ అయ్యారు హోంమంత్రి అనిత.. 12.42 కిలో మీటర్ల రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయ్యింది.. కొద్ది నిమిషాల్లో చాపర్ బయలుదేరిపోయింది.. ఇదంతా ఫ్రీ ప్లాన్.. ఇలా కూడా ఆలోచన చేస్తారా? అనిపించిందని వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల జగన్ అరాచక పాలన గుర్తుకొచ్చింది.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు.. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు.. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి.. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు అని గుర్తుచేశారు.. ఖాకీ చొక్క ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా..? అని ప్రశ్నించారు.. వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 2800 పై చిలుకు హత్యలు జరిగాయి.. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11 కి దిగిపోయావు.. నువ్వు మారకపోతే అవి కూడా రావు అని ఎద్దేవా చేశారు.. వైసీపీ వాళ్ల తీరు మారకపోతే చట్టం తని పని తను చేసుకుపోతుందన్నారు. ఇక, జగన్ ని వదిలి చాపర్ వెళ్లిపోవడంపైనా సమగ్ర దర్యాప్తు చేస్తాం అన్నారు.. పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసులు తప్పులేదు.. అవన్నీ అవాస్తవాలు అని కొట్టిపారేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..
హెచ్సీయూ భూముల వివాదం.. విచారణకు బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హెచ్సీయూ భూముల వివాదంపై అటవీ శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ నేతలు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా మొదటి రోజు విచారణకు బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ వెళ్లారు. ఈ విచారణలో భూముల వివాదంపై సుధీర్ఘంగా విచారణ జరపనున్నారు.
సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం.. అధికారులు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాకు తాకింది ఈ వ్యాది. తొగుట మండలంలోని కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో గత కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిగా ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా అధికారులు ఫాంలోని కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్దారణ అయింది. ఇక, కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో పరిసరాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్ లో పని చేస్తున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన 50 వేల కోళ్లను చంపి వేయ్యాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు. 20 టీంలుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూడ్చేస్తున్నారు. అలాగే, కిలో మీటర్ పరిధిలో ఏవైనా కోళ్ల ఫారాలు ఉంటే ఆ కోళ్లను కూడా చంపెయ్యాలని పశువైద్యాధికారులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూపై జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే 85004 04016 నెంబర్ కి కాల్ చేయాలని సూచనలు జారీ చేశారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గత మూడు రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే, ఇవాళ (ఏప్రిల్ 9న) కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. దీంతో శాసన సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు.. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. అయితే, గత రెండు రోజుల నుంచి కూడా జమ్ము కశ్మీర్ అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీమ్ క్రమంగా వాయిదా వేస్తున్నారు. ఈరోజు కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎన్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ప్రతిష్టంభన ఏర్పడింది.. దాంతో హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికే..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మోడీ కేవలం పబ్లిసిటీ కోసమే తాపత్రయపడతారని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఆలోచన దారుణ వైఫల్యం అన్నారు. రాజకీయ పార్టీ భావజాలం దేశాన్ని మించిపోతే.. తెచ్చుకున్న స్వాతంత్ర్యం నిష్‌ప్రయోజనం అవుతుందని చెప్పారు. ఈ విషయంలో అంబేద్కర్ ఎప్పుడో అప్రమత్తం చేశారన్నారు. తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు అన్నారు. ఏళ్ల తరబడి గవర్నర్లు బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ పలు చట్టాలు చేసిందని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం, తప్పనిసరి విద్య, అటవీ రక్షణ లాంటి చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని తెలిపారు. వెనుకబడిన వర్గాల గురించి బీజేపీ నాయకులు గొప్పగా మాట్లాడతారు.. కానీ కులగణన మాత్రం చేయరని ధ్వజమెత్తారు.
ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం ఏపీ వచ్చిన అమెరికా యువతి
ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి ఖండాంతరాలు దాటుకుని భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హాయ్’ అనే పలకరింపుతో మొదలైన స్నేహం.. చివరికి పెళ్లిపీటల దాకా వెళ్లింది. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. దాదాపు వేల మైళ్ల దూరం ప్రయాణం చేసి ఏపీలోని ఒక మారమూల గ్రామానికి తల్లితో కలిసి ఫోరెరో వచ్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్నారు. చందన్.. ఏపీలోని ఒక పల్లెటూరు యువకుడు. ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చందన్ ఫ్రొఫెల్ చూసి ఫోరెరో ప్రేమలో పడింది. మొట్టమొదటిగా ఆమెనే హాయ్ అని పలకరించింది. అలా మొదలైన సంభాషణ.. ప్రేమలో పడేసింది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 14 నెలల తర్వాత కొత్త అధ్యాయానికి సిద్ధపడుతున్నట్లు పేర్కొన్నారు. చందన్ అభిరుచులకు ఆకర్షితురాలైనట్లు ఫోరెరో తెలిపింది. 8 నెలల ఆన్‌లైన్ డేటింగ్ తర్వాత.. చందన్‌తో పెళ్లికి తన తల్లి అంగీకరించినట్లు ఆమె చెప్పింది. జీవిత భాగస్వామి కోసం తన తల్లితో కలిసి భారత్‌కు వచ్చినట్లు ఫోరెరో స్పష్టం చేసింది. చందన్ వీసా కోసం ప్రయత్నిస్తున్నామని.. అమెరికాలో ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఫోరెరో పేర్కొంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ ప్రేమికులకు నెటిజన్లు గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. సుఖసంతోషాలతో ఇద్దరూ హాయ్‌గా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు. జంట చూడ ముచ్చటగా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.
భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిందంటే?
మగువలకు బంగారం ధరలు భారీ షాకిచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, 24 క్యారెట్లపై రూ.710 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.90,440గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పతనమై, ఆపై మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. ఈరోజు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.93,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 2 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.93,000గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు హిట్‌మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్‌ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్‌వేలకు మాజీ అధ్యక్షులు శరద్ పవార్, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, దివంగత భారత కెప్టెన్ అజిత్ వాడేకర్, దివంగత ఏక్‌నాథ్ సోల్కర్, దివంగత దిలీప్ సర్దేశాయ్, దివంగత పద్మాకర్ శివాల్కర్, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ పేర్లు పెట్టాలని సభ్యుల నుంచి ఎంసీఏకి అభ్యర్థనలు అందాయి. ‘ఎంసీఎ సభ్యుల నుండి పలు సూచనలు వచ్చాయి. తుది నిర్ణయం ఎంసీఏ జనరల్ బాడీ సభ్యులు తీసుకుంటారు’ అని ఎంసీఎ అధ్యక్షుడు అజింక్య నాయక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. ఎంసీఎ అపెక్స్ కౌన్సిల్ ఏప్రిల్ 15న రోహిత్ శర్మ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందని సమాచారం.
మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
మంచు ఫ్యామిలి అన్నదమ్ముల వ్యవహారం నిరంతర ధారా వాహికలా సాగుతూనే ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో కారు తో పాటు మరికొన్ని వస్తువులను విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నేడు కుటుంబంతో కలిసి జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ కు పరాభవం ఎదురైంది. ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని మంచు మనోజ్ కుటుంభ సభ్యులను లోనికి రాకుండా ఆపేసారు అధికారులు. దింతో ఇంటి బయట ఆందోళనకు దిగిన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘ అసలు నాకు మా నాన్నకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే పిచ్చోళ్ళని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న జల్ పల్లి వచ్చాము. కానీ ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాట చేయలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళ నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు. విష్ణు కెరియర్ కోసం నేను ఆడవేషం కూడా వేశాను. నేను గ్రాఫిక్స్ నేర్చుకుంటే విష్ణు గ్రాఫిక్స్ స్టూడియో పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ కేసులో ఎందుకు చార్జి షీటు దాఖలు చేయలేదో పోలీసులు చెప్పాలి. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి లోపలికి వెళ్తామంటే పోలీసులు వెళ్లనివ్వట్లేదు’ అని అన్నారు.
‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత జోష్ లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో ‘వార్ 2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహిచుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీసాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు టైగర్ లేని సీన్స్ ను షూట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు టైగర్ ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. మ్యాన్ ఆఫ్ మసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏప్రిల్ 22న ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడని ప్రకటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తొలిసారి ప్రశాంత్, ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.