టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ బ్రాండ్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ బ్రాండ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. TONIQUE తమ ఒరిజినల్ బ్రాండ్ గా ఉంటే కాపీ చేసి The TONIC పేరుతో ట్రేడ్ మార్క్ కాపీ చేసి విక్రయాలు చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలైది.. మూడు రాష్ట్రాల్లో టానిక్ బ్రాండ్ తో అమ్మకాలు చేస్తోంది సంస్థ.. అయితే, నెల్లూరులో టానిక్ బ్రాండ్ కు ది టానిక్ పేరుగా కాపీ చేసి లిక్కర్ అమ్మకాలు చేయటంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. టానిక్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఎవరూ వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.. నెల్లూరులో టానిక్ బ్రాండ్ ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది..
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్.. చంద్రబాబు దిశా నిర్దేశం..
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేతలకు దిశా నిర్దేశం చేశారు.. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.. ప్రభుత్వం చేసే సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుంది.. ప్రజలతో మమేకం కావడమే కాదు… ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులు, నేతలు, కేడరే పార్టీకి ప్రతినిధులు.. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పీక్ లోడ్ లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించాం.. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాం. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలి.. జనాభాలో 13 శాతం మందికి పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నాం.. అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం రూ.5,,500 కోట్లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు చంద్రబాబు.. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోంది. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నాం.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు..
మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..!
తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ మరో కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో మరో నాలుగు రోరజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ అక్కడక్కడ ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా రేపటి వరకు వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచనలు చేసింది.
వారందరికీ కృతజ్ఞతలు అంటూ భావోద్వేగానికి గురైన డీజీపీ..
పోలీస్ సర్వీస్‌లో 33 సంవత్సరాల ఉన్నతమైన సేవల తర్వాత రాష్ట్ర DGP జితేంద్ర సూపర్ యానిమేషన్ పై అధికార పదవీ విరమణ చేశారు. వీడ్కోలు కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ సీనియర్ అధికారులు, మాజీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా DGP జితేంద్ర మాట్లాడుతూ.. “వీడ్కోలు అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసారు. మార్చింగ్, బ్యాండ్ ప్రదర్శనలు, గుర్రాల బృందం ప్రదర్శన అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఘనంగా జరిగేందుకు అకాడమీ డైరెక్టర్, ADG సీనియర్ అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. 33 సంవత్సరాల పోలీస్ సర్వీస్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్‌లలో తన అనుభవం అద్భుతమైనది అని తెలిపారు. పంజాబ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కి కేటాయింపుపై, ఇక్కడి సీనియర్ అధికారుల మద్దతు, మార్గదర్శకత్వం నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు తెలంగాణ పోలీస్ మేము మా ఇల్లుగా భావిస్తున్నాం అని జితేంద్ర పేర్కొన్నారు. తమ పదవీకాలంలో సాధించిన విజయాలను చెబుతూ.. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయి.. నేరాలు అదుపులో ఉన్నాయి. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, అంతర్రాష్ట్ర ముఠాలు, బెట్టింగ్ రాకెట్లు ఇలా అన్ని కంట్రోల్ చేశామన్నారు.
హౌస్ వైఫ్ అంటే అంత సులభమైన పని కాదు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
నిత్యం రాజకీయాలు మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు మహళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హౌస్ వైఫ్ అంటే అంతా సులభమైన పని కాదు అన్నారు జేసీ.. హౌస్ వైఫ్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని అభివర్ణించారు. అయితే, సమాజానికి మేలు చేయాలి అనే మహిళలు ముందుకు రండి అంటూ ఆహ్వానించారు.. తాడిపత్రిలో అండర్ డ్రైనేజ్ లో వెనక ఉన్నాం.. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ లో వ్యర్థ పదార్థాలు వేయడమే కారణం అన్నారు.. మహిళల సహాయ సహకారాలు మాకు కావాలి అన్నారు.. సోషల్ వర్క్ చేయడానికి ఆడపిల్లలు ముందుకు రావాలని సూచించారు.. ఒక రోజూ నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా.. తాడిపత్రి బాగుండాలి అనే వాళ్లు ముందుకు రండి.. పరకపట్టాలి అంటే ధైర్యం ఉండాలన్నారు.. ఇక, త్వరలో నెలకు రెండు లక్షలు ఇచ్చిన పని చేసే వాళ్లు ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మంచి పనులు చేసి మీకు గుర్తింపు తెచ్చుకోండి అంటూ సూచించారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి..
సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.. ఇక, సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ.. అతిపెద్ద బతుకమ్మగా గిన్నీస్ రికార్డుల కెక్కింది. మరోవైపు, ఇవాళ జరగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. కాగా, దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూ లయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక, సిటీలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెన్‌రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్” వరకు అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న ఈ ఉత్సవాల కారణంగా .. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ..
తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన యూట్యూబర్ అరెస్ట్!
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై నకిలీ వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్.. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఫేక్ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జెరాల్డ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలు చేసిన మరో 25 మందిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిని పోలీసులు కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రజాశాంతికి భంగం కలిగించడం, ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం విజయ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 110 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. నిన్న 51 మంది డిశ్ఛార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మళ్లీ ఏశాడుగా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కలప, కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై సుంకాలు విధించారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే.. భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా.. ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే నార్త్ కరోలినా దాని ప్రభావాన్ని కోల్పోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి నెలల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న కొన్ని దేశాలు తాజా సుంకాల నుంచి బయటపడనున్నాయి.
పండుగల వేళ బిగ్ షాక్.. వందలు కాదు వేలల్లో పెరుగుదల! తులం ఎంతో తెలిస్తే షాకే
2025 దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిగా పైగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1410 పెరగగా.. ఈరోజు రూ.1420 పెరిగింది. అలానే 22 క్యారెట్లపై రూ.1300, రూ.1300 పెరిగింది. దీంతో పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తోంది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,450గా.. 24 క్యారెట్ల ధర రూ.1,18,310గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవే ధరలు కొనాగుతున్నాయి. తులం 50 వేలు ఉన్నప్పుడు ఎక్కువ ధర అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా లక్ష 20 వేలకు చేరువైంది. ఇంకొన్నిరోజులు గడిస్తే సామాన్య జనాలు బంగారం గురించి మర్చిపోవాలేమో అని అనిపిస్తోంది. బంగారం పెరుగుల ఇలానే ఉంటుందని ఇటీవల నిపుణులు చెప్పారు. మరికొన్ని నెలల్లో రెండు లక్షల రూపాయలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్న స్టార్ కిడ్స్
కోలీవుడ్‌లో టూ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒకరేమో మ్యారేజ్ లైఫ్ ఎంటరయ్యాక యాక్టింగ్ కెరీర్ నుండి ఫిల్మ్ మేకింగ్ పై ఫోకస్ చేస్తే మరొకరు టీనేజ్ వయసులోనే మెగా ఫోన్ పట్టి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఏది చేసినా డిఫరెంటే. ఒక వైపు హీరోయిన్‌గానూ ఫ్రూవ్ చేసుకుంటూ.. మరో వైపు విలన్ రోల్స్‌లోనూ హడలెత్తించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. హీరోలకే టఫ్ ఫైట్ ఇచ్చింది వరూ.. ఇప్పుడు మరో స్టెప్ తీసుకోబోతోంది. మెగా ఫోన్ పట్టబోతోంది వరలక్ష్మీ. దోస డైరీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సరస్వతి అనే ఫిల్మ్ ఎనౌన్స్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తోంది. వరలక్ష్మి 40 ప్లస్‌లో మెగా ఫోన్‌పై మక్కువ పెంచుకుంటే, టీనేజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సూర్య తనయ దియా సూర్య. ఓ వైపు పేరెంట్స్ సూర్య, జ్యోతిక స్టార్ హీరో, హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకుంటే పేరెంట్స్ నటనా వారసత్వాన్ని కాదని డైరెక్టర్ గా రాణించాలని మెగా ఫోన్ పట్టింది దియా. ఈ 17 ఏళ్ల అమ్మాయి ‘లీడింగ్ లైట్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ప్రస్తుతం ఈ చిట్టి సినిమా ఆస్కార్ క్వాలిఫయింగ్ కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో రీజెన్స్ థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. ఆస్కార్ క్వాలిఫై అయితే డైరెక్టర్ గా సూర్య కూతురు సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. అటు వరలక్ష్మి, ఇటు దియా డైరెక్టర్స్ గా మరిన్ని సినిమాలు చేయాలని ఆశిద్దాం.
మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్..
మలయాళ సూపర్ స్టార్, అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నటిస్తున్న ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తో మమ్ముట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ –“మమ్ముట్టి గారు ఆరోగ్యం బాగానే ఉంది. అక్టోబర్ 1 నుంచి సెట్స్‌లోకి రానున్నారు. ఆయన కోలుకున్నందుకు మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. రెస్ట్ తీసుకుంటూ కూడా, సినిమా గురించే ఆలోచించారు. నేను ప్రతిరోజూ షూటింగ్ అప్‌డేట్ ఆయనకి ఇచ్చాను. లోకేషన్‌లో లేకపోయినా ఆయన మాతోనే ఉన్నారు,” అని అన్నారు.
పవన్ ను చూస్తే గర్వంగా ఉంది.. చిరు పొగడ్తలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా చూశారు. చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిదుర్గాతేజ్, వరుణ్ తేజ్, అకీరా, వైష్ణవ్, మనవరాళ్లతో కలిసి మూవీ చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఫ్యామిలీతో కలిసి మూవీ చూశాను. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. సుజీత్ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు సుజీత్ పనితనం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను ఇలా చూడటం చాలా గర్వంగా అనిపిస్తోంది. అతని స్క్రీన్ ప్రజెన్స్ సూపర్. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఓజీ సినిమాతో పవన్ కల్యాణ్ మంచి ట్రీట్ ఇచ్చాడు. తమన్ తన హార్ట్ నుంచి ఈ మ్యూజిక్ అందించినట్టు అనిపించింది. ఈ సినిమా విషయంలో అందరూ కష్టపడి పనిచేశారు. విజువల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఆయన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.