పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్ ఎటాక్..
ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కేసు మరోసారి చర్చగా మారి రచ్చకు దారితీస్తోంది.. సుగాలి ప్రీతి తల్లి పార్వతి కామెంట్లపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడం.. ఆ తర్వాత జనసేన కౌంటర్ ఇవ్వడంతో రచ్చగా మారింది.. ఇక, మరోసారి స్పందించిన సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం చేయడం లేదు.. నా కూతురు చనిపోయిన రోజే డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్ మాట తప్పారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడా ఈ కేసు తీసుకెళ్లారు.. ఇప్పడు పవన్ కల్యాణ్ పై ఒత్తిళ్లు వస్తున్నాయా, ప్రలోభాలకు లొంగిపోయారా? అంటూ మండిపడ్డారు పార్వతి.. 14 నెలలుగా ప్రీతిబాయి కేసు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం తప్పా..? అని నిలదీశారు.. నటి జత్వాని కేసులో ఎలా జైలుకు పంపారో… ప్రీతిబాయి కేసులో విచారణాధికారులకు నార్కో అనాల్సిస్ టెస్ట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి..
కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నన్ను ఎందుకు గెలుకుతున్నారు..?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్ల సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. “ప్రజల కోసం ప్రాణాలు అర్పించే ఉక్కు సంకల్పం నాది.. నా రాజకీయ జీవితం పూల పాన్పు కాదు.. నిత్యం ముళ్ల మీద ప్రయాణం.. ఎన్నో సమ్మెట దెబ్బలు ఓర్చుకున్న ఈ గుండె తాటాకు చప్పుళ్ళకు బెదరదు.. ప్రజా సేవలో వెనక్కు తగ్గదు..” అంటూ ట్వీట్ చేశారు.. ఇక, ఈ వ్యవహారంపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రశాంతమైన నెల్లూరులో కొంతమంది రౌడీ షీటర్లు అరాచకాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.. జులై 1న రౌడీ షీటర్లు కూర్చుని నన్ను చంపాలని మాట్లాడుకున్నారు.. మూడు రోజుల ముందు పోలీసులకు వస్తే.. ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదు..? అని నిలదీశారు.. అసలు, నన్ను చంపితే డబ్బు ఎవరు ఇస్తారనేది పోలీసుల విచారణలో తెలియాలన్నారు.. రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను చంపే సంప్రదాయం మా ఇంట్లో లేదు అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.. రౌడీ షీటర్లు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి అనుచరులు అని ఓ మీడియా రాసిందని మండిపడ్డారు.. విద్యార్ది దశలోనే ఎన్నో పోరాటాలు చేశాను. రౌడీలకు, గుండాలకు భయపడనన్న ఆయన.. వైఎస్ జగన్ ని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను.. 16 నెలలు అధికారాన్ని వదులుకుని టీడీపీలో చేరాను. వైస్సార్సీపీకి సవాల్ విసిరుతున్నా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. వెనకడుగు వేసిదేలన్నారు.. అసలు, నన్ను చంపితే కోట్లు రూపాయల డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడను.. నన్ను హత్య చేస్తామని మాట్లాడిన గుండాలకు మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా భయపడరు.. నా చివరి శ్వాస, ఓపిక, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలోనే ఉంటాను అని ప్రకటించారు కోటంరెడ్డి..
రుషికొండ బిల్డింగ్‌ల కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ పోటీ పడుతున్నారు..!
కూటమి సర్కార్, వైసీపీ మధ్య రుషికొండపై నిర్మించిన భవనాలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. తాజాగా, రుషికొండ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.. కొన్ని చోట్ల డ్యామేజ్ జరిగినట్టు పేర్కొన్నారు.. ఇక, దానిని ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై సెటైర్లు వేశారు.. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రుషి కొండ బిల్డింగ్‌లు వాడుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ పోటీ పాడుతున్నారని విమర్శించారు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో సీఎం (లోకేష్) విశాఖ పర్యటనకు వచ్చినప్పటికీ కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడక పోగా చులకనగా మాట్లాడారని మండిపడ్డారు.. రాష్ట్రంలో సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం.. జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించడం అలవాటుగా మారిందన్నారు.. కూటమి పార్టీ నేతలకు రుషికొండ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది.. అక్కడ వాతావరణం ఆస్వాదించి, సెల్ఫీ తీసుకుని విమర్శలు చేయడం అలవాటైందని ఎద్దేవా చేశారు..
కుప్పంకు కృష్ణమ్మ.. సీఎం చంద్రబాబు జలహారతి
కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ – నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు.. ఏకంగా శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడు భూములను తడుపుతోంది కృష్ణా నది.. పంచెకట్టుకుని సంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు.. ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.. తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. జై చంద్రబాబు… జైజై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు..
సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరణ.. కొనసాగుతున్న రైళ్ల రాకపోకలు
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ర్వైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరించారు. తలమాడ్ల వద్ద ట్రాక్ మరమ్మత్తులు పూర్తయ్యాయి. మరమ్మత్తులు పూర్తి కావటంతో యాదావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళ్లింది. 36 గంటలపాటు కొనసాగిన మరమ్మతు పనులు.. మొదట డెమో ట్రైన్ తో ట్రాక్ చెక్ చేసిన రైల్వే అధికారులు.. ఒక్క రైలును నిజామాబాద్ వరకు పంపిన అధికారులు.. నిజమాబాద్ – నాందేడ్ మధ్య రైళ్లు రద్దయ్యాయి.
తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్ పిటిషన్.. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దంటూ..
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హరీష్‌రావు పిటిషన్ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మేము కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వడం లేదంటేనే ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లు అర్ధం అవుతుంది.. వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం కదా.. వాస్తవాలు వినడానికి కాంగ్రెస్ పార్టీ గాని, శ్రీధర్ బాబు గానీ ఇష్టంగా లేరు.. నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే అని తెలిపారు.
రాజకీయంగా పార్టీలు వేరైనా.. గోపినాథ్ వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు.. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు..1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు.. గోపీ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు.. సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దని అడ్డుకున్న భర్త.. కత్తితో దాడి చేసిన భార్య..
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం యువత పెద్ద ఎత్తున వీడియోలు చేస్తున్నారు. కొందరు వినోదం కోసం చేస్తే, మరికొందరు ఫాలోవర్లు పెంచుకోవడం, పాపులారిటీ దక్కించుకోవడం కోసం కూడా రీల్స్ చేస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ రీల్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక వ్యక్తి తన భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీలమైన రీల్స్ చేయవద్దని అడ్డుకున్నందుకు కత్తితో దాడి చేసిందని అనీస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బాధితుడు అనీస్ చేసిన ఫిర్యాదులో.. తన భార్య ఇష్రత్ క్రమం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల రీల్స్ చేస్తోంది.. వాటిని ఆపమని అడిగిన ప్రతిసారీ ఆమె నన్ను తప్పుడు కేసులలో ఇరికిస్తానని బెదిరించడమే కాకుండా, ఒకసారి నాపై కత్తితో దాడి కూడా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులకు సమర్పించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే, చాలా కాలంగా తన ప్రవర్తనలో మార్పులు వచ్చాయి.. నా భార్యకు ఇతర పురుషులతో సంబంధాలు ఉన్నాయని, ఇంటి బాధ్యతలను పట్టించుకోకుండా ఫోన్ లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోందని ఆరోపించాడు. ఈ విషయాలపై అడిగితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పాటు నా కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరించడం లాంటివి చేస్తోందన్నాడు. గతంలో కూడా ఆమె తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నాడు. ఇక, ఇప్పుడు నన్ను నా ఇంట్లోంచి బయటకు గెంటేశారని అనీస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. ట్రంప్ టారిఫ్‌లపై రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్య
శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌సింగ్ పై విధంగా స్పందించారు. నేటి ప్రపంచం చాలా వేగంగా మారుతోందని.. ప్రతిరోజూ కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయని చెప్పారు. ఉగ్రవాదం అయినా… ప్రాంతీయ సంఘర్షణలు అయినా.. అన్ని సవాళ్లతో కూడుకున్నదే అని తెలిపారు. శతాబ్దం నుంచి అన్ని రంగాల్లో అత్యంత అస్థిరంగా.. సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో వ్యూహాత్మక అవసరాల గురించి మాట్లాడకూడదన్నారు. అలా చేస్తే స్వావలంబన్ అవుతుందని తెలిపారు.
2004 సంక్రాంతి క్లాష్ 2026లో రిపీట్ అవుతుందా?
టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. ఆ క్రేజ్ దృష్ట్యా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ బ్యానర్లు అన్నీ ఈ సీజన్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఇలాంటి హై వాల్యూ సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తే అవి ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వడం తప్పదు. అలాంటి క్లాష్‌లలోనే ఇప్పటికీ మర్చిపోలేని ఘట్టం 2004 సంక్రాంతి క్లాష్.ఆ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘అంజి’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అప్పటివరకు తెలుగు సినిమాలో పెద్దగా లేని గ్రాఫిక్స్ విజువల్స్, టెక్నికల్ హంగులు చూపించడంలో ఈ సినిమా ముందంజ వేసింది. అయితే, బాగా ఎక్స్‌పెక్ట్ చేసినంతగా సినిమా కనెక్ట్ అవ్వలేదు. ప్రేక్షకులు అంజిని చూసి నిరాశతో థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ కూడా బరిలోకి దిగింది. బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా సగటు రేంజ్‌లో నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాల మధ్యలో, అప్పటివరకు స్టార్‌డమ్ కోసం కష్టపడుతున్న ప్రభాస్ తన ‘వర్షం’ సినిమాను రిలీజ్ చేశారు. అసలే కొత్త హీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్ దిశ మలుపు తిరిగింది. అలా 2004 సంక్రాంతి క్లాష్ తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే సీన్ మళ్లీ 2026 సంక్రాంతిలో రిపీట్ అవుతుందా అన్న చర్చ సినీ సర్కిల్స్‌లో గట్టిగా నడుస్తోంది.
మీ ప్రేమ, ధైర్యం ఎప్పటికీ మా లో పదిలం.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు (94) వయసులో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నారు.ఈ విషాద వార్త తెలుసుకున్న తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. భద్రత కోసం అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా చేరుకున్నారు , పవన్ కల్యాన్ సతి మని కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈ విషయం పై చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు..”మా అత్తయ్య.. దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. కనక రత్నమ్మ గారి జీవితం, కుటుంబం కోసం చూపిన సేవ, ప్రేమ, మరియు ధైర్యం ఎల్లప్పుడూ అల్లు కుటుంబం కోసం మార్గదర్శకంగా నిలుస్తుంది.
ట్రైలర్ లానే సినిమా ఉంటే.. బాక్స్ ఆఫీస్ షేకింగ్ పక్కా
ఈ మధ్యకాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ విషయంలో నెటిజన్లను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జ పరిమిత బడ్జెట్‌లోనూ వావ్ ఫ్యాక్టర్ ఉన్న విజువల్ సినిమాలతో సూపర్ హీరోగా ఎదుగుతున్నాడు. ‘హనుమాన్’ తర్వాత ఆయన జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుని, పాన్ ఇండియా ప్రేక్షకులకు యూనివర్సల్ కంటెంట్ అందిస్తున్నాడు. తాజాగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. కేవలం మూడు నిమిషాల ట్రైలర్ మాత్రమే అయినా, సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఫ్రేమ్ గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ పొందిన ట్రైలర్ మరొకటి రాలేదని చెప్పాలి. ట్రైలర్‌లో హీరో తేజ సజ్జ, విలన్ కోసం వెతికే తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు, వాటిని అడ్డుకునే యోధుడి పోరాటం, ఎనర్జిటిక్ యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అందించిన విధంగా సన్నివేశాలు ఉన్నాయి.యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్‌తో సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ చివర్లో శ్రీరాముడు షాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా, ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకు అంచనాలను పెంచుతూ, సెప్టెంబర్ 12న బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.