విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..!
విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి.. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్‌లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు విశాఖ నగరవాసులు.. కాగా, వాయువ్య బంగాళాతంలో తీవ్ర వాయుగుండం… ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ తీరానికి సమీపించే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది.. కళింగపట్నంకు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.. అర్ధరాత్రి గోపాల్‌పూర్ – ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఐఎండీ.. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో వీస్తున్నాయి బలమైన ఈదురుగాలులు… సముద్రం అలజడిగా మారింది.. దీంతో, మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. విశాఖలోని సత్యం జంక్షన్, BVK కాలేజ్ దగ్గర రహదారికి అడ్డంగా విరిగిపడిపోయాయి చెట్లు.. దీంతో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఇక, ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు..
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ అరెస్ట్..
కడప శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మాధవిపై సోషల్ మీడియా వేదికగా చేయబడిన పరువునష్టం వ్యాఖ్యల కేసులో, కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు, తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే పోస్టులు వెలువడ్డాయని, ఆ పోస్టులు ప్రచారం చేయబడ్డాయని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తులో ఫేస్‌బుక్ ద్వారా ప్రచారంలో ఉన్న పోస్టులను నిర్వహించిన పేజీలను గుర్తించి, 15 ఫేస్‌బుక్ పేజీలను తొలగించడమైనది. సోషల్ మీడియా వేదికపై అసత్య ప్రచారాన్ని గమనించి, సంబంధిత అభియోగులను అరెస్ట్ చేయడమైనది. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యక్తిగత సహాయకుడు ఖాజాను హైదరాబాద్ నగరంలో అరెస్ట్ చేసి, కడపకు తీసుకువచ్చిన పోలీసులు.. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో విచారణకు తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఇతర ప్రమేయాలున్న అనుమానాల మేరకు దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ అరెస్ట్ వ్యవహారం కాకరేపుతోంది.. మరోవైపు, రాజకీయ కక్షలో భాగంగానే అధికార పార్టీకి చెందిన నేతలు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను.. వారికి సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు..
ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ. సీఎం రేవంత్ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు… మార్చి 8 న కోర్టు ఎపిసోడ్ పై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ నెల 6 న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై పార్టీ చర్చించింది. అభ్యర్ధి ఎంపికపై ఇంచార్జి మంత్రులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జ్ వివేక్.. తుమ్మల నాగేశ్వరరావు లకు రెండు మూడు రోజుల్లో రేసులో ఉన్న అభ్యర్ధులు… గ్రౌండ్ లో బలం ఉన్న అభ్యర్ధుల జాబితా ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్. ఇంఛార్జ్ మంత్రులకు మూడు రోజుల గడువు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలని సూచించారు. ఐతే.. ప్రస్తుతానికి బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్.. నవీన్ యాదవ్.. బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక రెడ్డి కోటాలో… సీఎన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్టు సమాచారం. ఐతే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచి తీరాల్సిన ఎన్నిక. దీంతో బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న టార్గెట్ తోనే పార్టీ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ .. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలని కోరారు. మరోవైపు, బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న లక్ష్యంతో ఏఐసీసీ కూడా అభ్యర్ధి ఎంపికపై సర్వే చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేసే సిఫార్సు.. ఏఐసీసీ చేస్తున్న సర్వే పరిశీలించిన తర్వాత ఎన్నికల్లో నిలిచే అభ్యర్ధి ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ చూస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లకు కీలక మార్పులు
హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌ల ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. సెప్టెంబర్ 11న రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రెండు కారిడార్ల కలిపి అంచనా వ్యయం సుమారు రూ. 3.30 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే మార్గంలో (నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం) మీదుగా చెన్నైకి రైలు మార్గం. శంషాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు అమరావతి వరకు వస్తున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన రైలు లైన్ వేయాలని అభ్యర్థన. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం ప్రకారం, కొత్త హైవే పక్కన రైలు మార్గం వేసే అవకాశం ఉంటే నిర్మాణ ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ మార్గానికి అంచనా వ్యయం రూ. 1.86 లక్షల కోట్లు. జీఎం ఆమోదం వచ్చిన తర్వాతే సర్వే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
విజయదశమి వేడుకల్లో శమీ పూజలు చేసిన మంత్రి
హన్మాకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ప్రసంగించారు. ముందుగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ రోజున అందరికీ మంచి విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాలకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. ఈ మేరకు చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిశీలించి జీవో జారీ చేసిందని, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిందని తెలిపారు. కొంతమంది మేధావులు, బీసీ నాయకులమని చెప్పుకునేవారు ఈ నిర్ణయానికి సహకరించకపోతే మౌనంగా ఉండాలని సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక అంశం అని, దీనికంటే మెరుగైన పద్ధతి ఉంటే భారత ప్రభుత్వం షెడ్యూల్ 9 లో చేర్చాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన లీగల్ ప్రక్రియలన్నీ చేసిందని, ఇప్పుడు దీన్ని అడ్డుకోవద్దని అన్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో వెలుగులోకి హృదయవిదారక అంశాలు..
కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. చాలా మంది కంప్రెస్సివ్ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని డాక్టర్లు తెలిపారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. సహజంగా ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతకడం కష్టం. పిల్లలైతే 30 సెకన్లలోనే ప్రభావానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. కొందరి ఊపరితిత్తుల్ని స్కానింగ్‌లో చూసినప్పుడు ఫ్రాక్చర్స్ కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాలకు అది ఓ హెచ్చరిక..!
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు భారతీయులను మతం ఏమిటని అడిగి కాల్చిచంపారని, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు.. ఉగ్రవాదులు మతమేంటో అడిగి టూరిస్టులను హతమార్చారు.. ఈ ఘటనలో దేశం మొత్తం రగిలిపోయిందన్నారు.. అయితే, మన బలగాలు ఉగ్రదాడికి దీటుగా సమాధానమిచ్చాయి.. ఇక, ఆపరేషన్ సిందూర్‌తో మన మిత్రదేశాలేవో తెలిసిపోయాయన్నారు.. ఇక, భారత దేశాన్ని అస్థిరపర్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి అన్నారు మోహన్ భగవత్… పక్క దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కలవరపెడుతున్నాయన్న ఆయన.. ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందన్నారు.. నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమం ప్రభుత్వాలకు హెచ్చరికలాంటిది అంటూ హెచ్చరించారు.. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాలసీలు తయారు చేయాలని సూచించారు.. మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని, ఇలాంటి అరాచకత్వాన్ని ఆపాలన్నారు. ఐక్యమత్యమే మన బలం, విడిపోతే నిలబడలేం అన్నారు.. మరోవైపు.. అమెరికా సుంకాలు దేశ ప్రజలందరిపై ప్రభావితం చూపించాయి.. మనం ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ భగవత్.. కాగా, మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను ఉద్దేశించి మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు..
Philippinesలో భారీ భూకంపం.. 72కు చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్‌లోని మధ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన 6.9 తీవ్రత గల భూకంపం వల్ల మృతుల సంఖ్య 72కు పెరిగిందని ఆ దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. గురువారం వెలువరించిన నివేదిక ప్రకారం ఈ భూకంపంలో 294 మంది గాయపడ్డారు. బుధవారం నాటి మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది మూడు రేట్లు ఎక్కువ. ఈ మృతులందరూ మధ్య విసాయాస్ ప్రాంతానికి చెందినవారే అని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో వచ్చిన ఈ భూకంపం వల్ల విద్యుత్ లైన్లు, వంతెనలు, వందేళ్ల పురాతన చర్చి సహా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం 2013లో పొరుగున ఉన్న బోహోల్ ద్వీపంలో సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైనదిగా అధికారులు పేర్కొన్నారు. 2013 నాటి భూకంపంలో 222 మంది మరణించగా.. ఇప్పుడు ప్రస్తుతానికి మృతుల సంఖ్య 72కి చేరింది. ఫిలిప్పీన్స్ “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున, ఏటా 800కు పైగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్!
అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ మంచిగా ఉందని, ఇందులో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఆటగాళ్లు బాగానే ఆడతారని చేజ్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో పాయింట్లు సాధించడం తమ లక్ష్యమని, ఈ పిచ్‌పై చివరిగా బ్యాటింగ్ చేయాలనుకోవడం లేదని తెలిపాడు. ఇక వెస్టిండీస్ తరపున ఖారీ పియెర్, జోహాన్ లేన్ అరంగేట్రం చేస్తున్నారు. మరోవైపు భారత జట్టులో కుల్దీప్ యాదవ్ తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు (జడేజా, కుల్దీప్, సుందర్) మరియు ఇద్దరు పేసర్లు (బుమ్రా, సిరాజ్) తో బరిలోకి దిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నాడు. కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ లో మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత భారత్ ఈ సిరీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటోందని, ‘సులభమైన ఎంపికల కోసం చూడటం లేదని’ గిల్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇలా..
మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన ‘రాజుగారి గది’.. సినిమా ఎప్పుడు వచ్చేదంటే?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4: శ్రీచక్రం సినిమా దసరా 2026కు విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ‘రాజు గారి గది’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ రాబోయే ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. పోస్టర్‌లో ఎరుపు చీర కట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ కనిపిస్తుండగా, ఆమె ముందు శక్తివంతమైన కాళీ దేవత విగ్రహం కనిపిస్తుంది. ఈ దృశ్యం సినిమా ఆధ్యాత్మిక, అతీత శక్తుల నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతుంది. “ఎ డివైన్ హారర్ బిగిన్స్” అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని భయానక అంశాలను తెలియజేస్తుంది.
ఎదురుచూపులు ముగిశాయి.. ‘అఖండ 2.. తాండవం’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కథను మరింత కొత్తగా తెరకెక్కించారని సమాచారం. ఇక దసరా పండుగను పునస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ లో విడుదల తేదీ, అలాగే పోస్టర్‌లో బాలకృష్ణ పొడవాటి జుట్టు, గడ్డంతో, మెడలో రుద్రాక్షలు ధరించి గంబిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగే చేతిలో భారీ త్రిశూలం పట్టుకుని, కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. అతని వెనుక ఉన్న మంచు, పోస్టర్ లోని డైనమిక్ పోజ్ బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అంచనాలను పెంచుతున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ అంటే చాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై-వోల్టేజ్ తో మరింత పవర్‌ఫుల్ గా మారుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.