కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణం అయిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో బయటపడ్డవారికి లెక్కలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం చేస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం వస్తుంది. దానివలన రాకపోకలు కూడా సులభతరం అవుతాయి. ఈ కీలకమైన ప్రాజెక్టు దశాబ్దాలుగా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఈ 62 కిలోమీటర్లు కెనాల్ రోడ్డును హైవేగా మారుస్తూ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు పంపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకి రెండు రోడ్లు ఉండగా మూడో ప్రత్యామ్నాయ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల సామర్లకోట – రాజమండ్రి మధ్య ఉన్న టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైవే కి సంబంధించి భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లడానికి ఏడీబీ రోడ్డు ఉంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా కెనాల్ రోడ్డు కూడా వినియోగంలో ఉంది. 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదు. అంచనా వ్యయం కూడా అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా మార్చేందుకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లడంతో వెంటనే అనుమతులు లభించాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి యఅఇతే కాకినాడ – రాజమండ్రి మధ్య రవాణాతో పాటు ఇతర రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళ వారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.. అయితే, ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దర్శకుడు వర్మ.. అయితే, గురువారం రోజు కూడా వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసిన విషయం విదితమే.. దీంతో.. ఆర్జీవీ దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లపై విచారణ మంగళవారం చేపట్టనుంది ఏపీ హైకోర్టు..
పాకిస్థాన్‌లో కూడా ఇలా లేదు.. పీఏసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి. ఇక, పీఏసీ అన్ని తప్పిదాలనూ ఎత్తి చూపుతుంది.. పాకిస్థాన్ సహా అన్ని దేశాల్లో పీఏసీ ప్రతిపక్షానిదే అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గతంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చింది పీఏసీయే అని వెల్లడించారు.. బోఫోర్స్ కుంభకోణం వెలికి తీసింది కూడా పీఏసీనే.. 2G స్పెక్ట్రమ్ కూడా మనోహర్ జోషీ వెలికి తీశారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో కుంభకోణాలు కూడా 2010లో PAC వెలికి తీసింది.. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా గీతారెడ్డికి PAC ఇచ్చారు.. 2019లో మేం PAC చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కి ఇచ్చాం.. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది..? అని ప్రశ్నించారు.. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం.. అందుకే PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే పీఏసీ.. సభ్యుల సంఖ్యతో సంబంధంలేదు..
సంప్రదాయం ప్రకారం నేటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. కానీ, మీరు ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు.. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వడం జరుగుతోందన్న ఆయన.. సంప్రదాయం కొనసాగిస్తారా..? ఒంటెద్దు పోకడతో వెళతారా చూడాలనే నామినేషన్ వేశామన్నారు.. తాలిబన్ల సంస్కృతి మనకు కావాలా..? అలాంటి సంస్కృతి పోషిద్దామా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజాస్వామ్యం లేదు.. అంతా మా ఇష్టారాజ్యమే అంటున్నారని దుయ్యబట్టారు.. ఇలాంటి సంప్రదాయాలు రాబోయే తరాలకు ఏం చెపుతాయి..? ఇనఅ నిలదీశారు.. అందుకే ఇలాంటి సంప్రదాయం తాము బాయ్ కాట్ చేస్తున్నాం అని వెల్లడించారు.. వాళ్ల అభిప్రాయం ప్రజలమీద రుద్దకూడదు.. పోటీకి మాత్రమే మేం దూరంగా ఉంటాం అన్నారు.. కౌన్సిల్ లో మాకు ఏకగ్రీవం కదా.. పదవి గురించి కాదు.. సంప్రదాయం కొనసాగించాలని సూచించారు బొత్స..
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. నల్లగొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహాకులను మంత్రులు ప్రశంసించారు. అనంతరం జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి ఎంపీలు, ఎంఎల్ఏలు, అధికారులు హాజరయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాహుల్ గాందీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. గత ప్రభుత్వ అసమర్ధత, అవినీతి వల్ల 50 వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా పని చెయ్యాలన్నారు. సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదని తెలిపారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు. అధికారం కోల్పోయి కొంతమంది.. అధికారం కోసం కొంతమంది రైతులను ఇబ్బదలకు కూడా చేస్తున్నారని తెలిపారు. అధికారుల దయ వల్ల వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వం వైపు నుండి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌కు ఉందని సూచించింది. అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. స్పీకర్‌కు టైమ్ బాండ్ లేదని ధర్మాసనం పేర్కొంది. పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. కాగా, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్య దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్జి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా, ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక, ఘటన స్థలానికి అదనపు బలగాలు భారీగా మోహరిస్తున్నాయి. అయితే, ఒడిశా సరిహద్దుల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోలు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. సౌత్ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున గాలింపు చేపట్టింది. దండకారణ్యంలో మావోలు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టేశారు. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపగా.. అలర్టైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగింది. ఇప్పటి వరకు పది మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో INSAS, AK-47, SLR సహా పలు ఆయుధాలను హస్తగతం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం.
భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపేసిన కెనడా
భారత్ వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో అదనపు తనిఖీలు చేపట్టడాన్ని కెనడా ప్రభుత్వం విరమించుకుంది. కెనడా నుంచి భారత్ వెళ్లే వారికి ఈ అదనపు తనిఖీలు నిర్వహిస్తామని ఇటీవల ఆ దేశ మంత్రి తెలిపారు. అందుకోసం మిగతా ప్యాసింజర్లలా కాకుండా భారత్ వెళ్లే వారంతా కొన్ని గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు కెనడియన్ ప్రభుత్వం పేర్కొనింది. ఇక, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 1 నుంచి 19వ తేదీ మధ్యలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కెనడా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్‌కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను పెంచామని వెల్లడించారు. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు జరిగాయని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కెనడా సర్కార్ వెనక్కి తీసుకుంది.
తమపై రష్యా దాడిని ఖండించండి.. ప్రపంచ దేశాలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా కీవ్‌పై మాస్కో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ చేసిన పోస్ట్‌లో.. ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి మా ప్రాంతంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన నిప్రోను ఢీ కొట్టిందని ఆయన వెల్లడించారు. మాతో యుద్ధానికి నార్త్ కొరియా నుంచి 11వేల మంది సైనికులను తీసుకురావడంతో పాటు మాపై క్షిపణితో దాడి చేశారని జెలెన్ స్కీ ఆరోపించారు. కాగా, ఈ యుద్ధాన్ని మరింత విస్తరించొద్దని ప్రపంచ దేశాధినేతలు పిలుపునిస్తున్నా కూడా వ్లాదిమిర్ పుతిన్ పట్టించుకోవడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. తాజా దాడితో రష్యాకు శాంతి చర్యలపై ఇంట్రెస్ట్ లేదనే విషయంలో క్లారిటి వచ్చింది. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే రియాక్ట్ కావాలని జెలెన్‌స్కీ రాసుకొచ్చారు.
తీరుమారని టీమిండియా.. 150కే ఆలౌట్
భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చిన యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీని తర్వాత, దేవదత్ పడిక్కల్ కూడా నంబర్-3లో తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. దింతో ఇద్దరు డక్ అవుట్ గా ఏను తిరిగారు. ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్ వ్యక్తిగత స్కోరు 5 వద్ద విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా భారత్‌కు మూడో దెబ్బ పడింది. లంచ్ ప్రకటనకు ముందు కేఎల్ రాహుల్ 26 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో వివాదాస్పదంగా ఔటయ్యాడు. లంచ్ విరామం తర్వాత మిచెల్ మార్ష్ ధృవ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4)లను తన ఖాతాలో వేసుకున్నాడు. 37 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న పంత్ పాట్ కమిన్స్ విలువైన వికెట్ తీశాడు. దీని తర్వాత, హర్షిత్ రాణా 7 పరుగుల వద్ద అవుట్ కాగా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత్‌కు చివరి వికెట్ నితీష్ రాణా రూపంలో పడింది. జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్స్ తీయగా.. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ లు చెరో 2 వికెట్లు తీశారు.
సత్యదేవ్ జీబ్రా ఓవర్సీస్ టాక్.. హిట్టా లేదా ఫట్టా..?
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. అనేక రిలీజ్ ల వాయిదాల అనంతరం మూడు సినిమాలు మధ్య పోటీగా జీబ్రా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ టాక్ పరిశీలిస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలను చూపిస్తూ సాగిన కమర్షియల్ డ్రామా ఆకట్టుకుంది. ఎన్నో పరాజయాల తర్వాత హీరో సత్యదేవ్ తన మార్క్ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడనే టాక్ వస్తోంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కథ రచన మరియు టైట్ స్క్రీన్‌ప్లే, డీసెంట్ ఫస్ట్ హాఫ్ మరియు అద్భుతమైన సెకండాఫ్‌తో సూపర్ అనిపించింది. క్లైమాక్స్‌లో అన్ని పాయింట్స్ ను కనెక్ట్ చేసే విధానం చాలా బాగుంది. రవి బస్రూర్ అందించిన BGM మరియు మిక్సింగ్ పర్వాలేదు. హీరో సత్యదేవ్ మరియు హాస్యనటుడు సత్య మధ్య వచ్చే సీన్స్, కామెడీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటే, సినిమాలో వచ్చే థ్రిల్లర్ ఎపిసోడ్స్ మెప్పించాయి. కానీ అక్కడక్కడ అనవసరపు సన్నివేశాల్ని చేర్చి బోర్ కొట్టించాడు. కాస్త ల్యాగ్ అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది జీబ్రా. ప్రియా భవాని శంకర్ పరిధి మేరకు మెప్పించింది. ఓవరాల్ గా చేసుకుంటే మెప్పించే డ్రామా జీబ్రా.
చరణ్ భారీ సినిమాలోకి జగ్గూ భాయ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది రామ్ చరణ్ 16వ సినిమా. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హీరోకి ఇది 16వ సినిమా కాబట్టి ఆర్సీ16 అని పిలుస్తున్నారు. బుచ్చిబాబు ఈరోజు ఉదయం మైసూరులోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మైసూర్ లో లేడు. సోమవారం నుంచి మైసూరులో రామ్ చరణ్ షూటింగులో పాల్గొనే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఆయన మైసూరు వెళ్లే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి రామ్ చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు బుచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాన్ని ఊహించని కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తమ “రంగస్థలం” సినిమా ప్రెసిడెంట్ పాత్రలో జీవించిన వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు చేరినట్లుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో తాను ఒక కమాండింగ్ పాత్ర చేయనుండగా అది అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమాలో జగ్గూ భాయ్ ఎలా చేస్తారో చూడాలి.
నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ రెడ్డి టెస్టు క్యాప్‌ను అందుకోవడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ చేతుల మీదుగా టెస్టు క్యాప్‌ను అందుకోవడం నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణాలని చెప్పారు. ‘టెస్టుల్లో అరంగేట్ర సమయంలో విరాట్ కోహ్లీతో టీమిండియా క్యాప్ అందుకోవాలని నితీశ్ ఎప్పటి నుంచో కలలు కన్నాడు. ఆ కల నేడు నెరవేరింది. నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణం ఇదే. ఓ తండ్రిగా నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ ఏడాది నితీశ్‌కు గొప్పగా కలిసొచ్చింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఆడుతున్నాడు. కోహ్లీతో కలిసి నితీశ్ ఆడుతుండడం ఆనందంగా ఉంది’ అని ముత్యాల రెడ్డి చెప్పారు.