ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ.. సౌత్ గ్రూప్ పై అనుమానాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు శరత్ చంద్రారెడ్డితో పాటూ విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి బెయిల్ పిటిషన్లపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన పల్లిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో శరత్ చంద్రారెడ్డిని హాజరుపరిచింది. ఈ కేసులో సౌత్ గ్రూపు పైనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు సౌత్ గ్రూప్ చేరవేసిందని కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూపులో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, బోయినపల్లి అభిషేక్ ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈడీ రూ.100 కోట్లకు సంబంధించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. లిక్కర్ పాలసీ ద్వారా పలువురికి లబ్ధి చేకూర్చరాని ఈడీ ఆరోపించింది. 12 శాతం లాభాలు పొందేలా ప్లాన్ చేశారని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కీలక భూమిక పోషించారని కోర్టులో వాదనలు నడిచాయి.
దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తున్నారు
దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, నూతనధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని మంత్రి దయాకర్ రావు హామీ ఇచ్చారు. కవులు, కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తిగా సీఎం కేసీఆర్ ను ఆయన కొనియాడారు. 63 కోట్లరూపాయలతో బొమ్మెర, పాలకుర్తి, వాల్మీడిని టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ పార్టీ అని.. దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రాబోవు మహశివరాత్రికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాలకుర్తి విచ్చేస్తారని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. కాజీపేట్ (మం) బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్… బాలవికాస ఫౌండర్ ఆధ్వర్యంలో 20 మాసాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
వివాహేతర బంధాలకు యాప్.. ఇదేం చోద్యం?
ఏ దేశంలో అయినా వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పెళ్లితోనే ఒక కుటుంబం ఏర్పడుతుంది. కొన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే ఒక సమాజం అవుతుంది. కాబట్టి సమాజానికి మొదటి మెట్టయిన వివాహానికి నమ్మకమే పునాది. అందుకే భార్యా భర్తలు ఒకరికి ఒకరు సొంతం అని బావిస్తారు. తమ మధ్యన మూడో వ్యక్తిని ఊహించుకోలేరు. వివాహేతర సంబంధాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. అయినా నిత్యం ఎన్నో వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. వాటి కారణంగానే ప్రతి రోజు అనేక నేరాలు ..ఘోరాలు జరగటం మనం చూస్తున్నాం. వివాహేతర సంబంధం ఒక పురుషుడు, ఒక స్త్రీకి సంబంధించినది. ఇద్దరూ ఇష్టపడి సాగించే చాటు మాటు వ్యవహారం. ఇది పూర్తిగా కోరికకు సంబంధించినది. ఈ అనైతిక బంధాన్ని అల్లుకుని నేరం..చట్టం ..శిక్ష ఉంటాయి. అయితే ఇప్పుడు వివాహేతర సంబంధాలకు సంబంధించి ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తోంది. భార్య గాక మరో మహిళతో సంబంధం పెట్టుకున్న పురుషుణ్ని శిక్షించే చట్టాన్ని సుప్రీం కోర్టు చాలా ఏళ్ల క్రితమే సమీక్షించింది. పురుషుణ్ని మాత్రమే శిక్షించే వ్యభిచార నేర చట్టం మారాల్సిన అవసరం లేదా.. అంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎందుకంటే, వివాహేతర సంబంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో, వివాహితులు ఇష్టపూర్వకంగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరం కాదని ఇటీవల తీర్పు చెప్పింది. భార్యను భర్త ఆస్తిగా భావించడమనేది కాలం చెల్లిన భావనని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు వివాహేతర సంబంధం అనేది కేవలం నైతికతకు సంబంధించిన అంశంగా మారిపోయింది.
అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట
ఎక్కడైనా బంకుల్లో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్లాకులో రేటు కాసింత ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం బ్లాకులో తక్కువ…బంకులోనే ఎక్కువ రేట్లకు దొరుకుతుందటా పెట్రోల్. దింతో బంకులన్ని ఖాళీ అయ్యి బ్లాక్ దుకాణాల దగ్గర మాత్రం పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారట. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా ఈస్టోరీ చూసెయ్యండి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం. ఈ ప్రాంతం కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకి రోజు వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే పెట్రోల్ రేట్లు తెలంగాణలో కంటే కర్ణాటకలో తక్కువగా ఉండటంతో నారాయణఖేడ్ సరిహద్దు ప్రాంతాల్లో కొందరు బ్లాక్ దందాకి తెరలేపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలయిన కంగ్టి, నాగల్‌గిద్ద, మనూర్ మండలాలోన్ని గ్రామాల్లో పెట్రోల్ బంకుల్లో కాకుండా దుకాణాల్లోనే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. దీనికి కారణం పెట్రోల్ బంకుల్లో కాకుండా బ్లాక్‌లోనే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు దొరుకుతుంది. తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలుగా ఉంది. అయితే నారాయణఖేడ్ సరిహద్దు ప్రాంతాల నుంచి కర్ణాటకకి కేవలం 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
‘యుఎస్ఏ టుడే’ ఆస్కార్ నామినేషన్స్ లిస్టులో జూ.ఎన్టీఆర్
ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ మెంట్ తేదీ దగ్గర పడే కొద్దీ సినీబఫ్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ నామినేషన్స్ ప్రకటిస్తారు. ప్రపంచంలోని నలుమూలల ఉన్న భారతీయుల్లో ఈ దఫా ఆస్కార్ నామినేషన్స్‌పై ఆసక్తి రెట్టింపు అవుతోంది. రేసులో మన తెలుగు చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ పలు కేటగిరీల్లో పోటీకి సిద్ధం కావడమే మనవాళ్ళలో ఇంట్రెస్ట్ పెరగడానికి కారణమయింది. అమెరికాకు చెందిన ‘యుఎస్ఏ టుడే’ పత్రిక పదిమంది నటులను తప్పకుండా ఆస్కార్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఓ ఐటమ్ ప్రచురించింది. ఇందులో ఐదుమంది నటులు, ఐదుమంది నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో ‘ట్రిపుల్ ఆర్’లో తన నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చోటు చేసుకుంది. దాంతో మన తెలుగు సినీ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.
సముద్రంలో తప్పిపోయాడు… 24 రోజులు కాపాడిన ఆ రెండు
నిజంగా జీవించాలని రాసిపెట్టి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సహాయం లభిస్తుంది. సరిగ్గా ఇలాంటిదే ఈ స్టోరి. సముద్రంలో తప్పిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏకంగా 24 రోజుల పాటు సముద్రంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, సహాయం దొరుకుతుందో లేదో అనే పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎల్విన్ ఫ్రాంకోయిస్(47) అనే వ్యక్తి 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, చావు నుంచి మళ్లీ తిరిగి వచ్చాడు.
కరేబియన్ ద్వీపాల్లోని డొమినికా ద్వీపానికి చెందిన ఫ్రాంకోయిస్ కేవలం కెచప్, వెల్లుల్లి పొడిని తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. వర్షపు నీటిలో వీటిని కలుపుకని తింటూ ప్రాణాలను కాపాడుకున్నాడు. పాడైపోయిన నౌకలో ఒక్కటే ఉంటూ, వర్షపు నీటిని తాగుతూ 24 రోజుల పాటు బతికాడు.అతను ప్రాణాలతో బయటపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. పడవలోనే ఉంటూ రక్షించమని కోరతూ పడవపై ‘ హెల్ప్’ అనే పదాన్ని చెక్కాడు. చాలా వరకు సముద్రంలో నౌకలను చూసినప్పటికీ వాటిని ఆకర్షించేందుకు విఫలయత్నం చేశాడు ఫ్రాంకోయిస్. అయితే ఏ నౌక కూడా ఫ్రాంకోయిస్ ను గుర్తించలేకపోయింది. ఓ సారి సముద్రంలో వెళ్తున్న షిప్ అనను చూసేందుకు తను ఉంటున్న పడవకు నిప్పు కూడా పెట్టాడు. దీంతో పడవకు రంధ్రాలు పడి నీరు లోపలికి రావడం ప్రారంభించింది. చివరకు ఎలాగొలా పడవను తిరిగి బాగు చేసుకున్నాడు.
బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టాడు.. ఏందిరయ్యా ఈటాలెంట్
భారత దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. సోషల్ మీడియాలో ప్రతీరోజు దాదాపు ఎవరో ఒకరు మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటి వరకు లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఓ యువకుడు బెల్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో అదరగొట్టాడు.48 సెకన్ల క్లిప్‌లో, ఒక వ్యక్తి తన బెల్లీ డ్యాన్స్ ప్రదర్శనతో మ్యాజిక్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్న పెప్పీ బీట్‌లకు అతను అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతడి గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజన్లు కామెంట్స్ సెషన్లో ప్రశంసల వర్షం కురిపించారు. అతడి డ్యాన్స్ బ్రిలియంట్ అని ఓ యూజర్ రాసుకురాగా, అతడికి ఇదో వరమని మరో కామెంట్ వ్యాఖ్యానించారు.
సైబర్ నేరగాడి వలలో ఐసీసీ.. 10 మిలియన్ డాలర్లు హాంఫట్
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో అందరూ ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను నడిపించే ఐసీసీ కూడా సైబర్ నేరగాడి వలలో పడింది. 2.5 మిలియన్ డాలర్లకు పైగా ఐసీసీ మోసపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో 2.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్లు. దుబాయ్‌లోని ఐసీసీ కార్యాలయ అధికారులు ఈ ఆన్‌లైన్ మోసంపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.మరోవైపు ఈ ఫిషింగ్ స్కాంపై ఐసీసీ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు సైబర్ నేరగాడిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే బీసీసీఐ వంటి సంస్థకు 2.5 మిలియన్ డాలర్లు అంటే పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ రూపాయి అయినా 100 రూపాయలు అయినా మోసం మోసమే కాబట్టి ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసం ఐసీసీలో కలకలం రేపింది.
నిలకడ లేక.. నష్టాల నడక
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో ఆ ప్రభావం మన దేశ స్టాక్ మార్కెట్‌పైన కూడా పడింది. దీంతో ఈ వారాంతం రెండు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ శుక్రవారం ఉదయం అతి స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సాయంత్రం కూడా నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. రోజంతా అస్థిరంగానే కదలాడాయి. నిలకడలేక.. నష్టాల నడక సాగించాయి. రిలయెన్స్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు వెనకబడటం దెబ్బతీసింది. మొత్తానికి సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి 60 వేల 621 పాయింట్ల వద్ద ఇవాళ్టికి ట్రేడింగ్ ఆపేసింది. నిఫ్టీ 80 పాయింట్లు తగ్గి 18 వేల 27 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సున్నా పాయింట్ 7 శాతం డౌన్ అయ్యాయి. నిఫ్టీలో కోలిండియా, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు బాగా రాణించాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ భారీగా వెనకబడ్డాయి. సెక్టార్ల వారీగా చూసుకుంటే నిఫ్టీ మీడియా ఇండెక్స్ చెత్త ప్రదర్శన చేసింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. పీవీఆర్ స్టాక్స్ వ్యాల్యూ 4 శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 184 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 730 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 459 రూపాయలు లాభపడి గరిష్టంగా 68 వేల 818 రూపాయలుగా నమోదైంది.