సీఎం జగన్ తో ఆస్ట్రేలియా ఎంపీల టీం భేటీ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఆస్ట్రేలియా ఎంపీల ప్రతినిధి బృందం. సీఎం జగన్‌ను కలిసి, విద్య, ఇంధనం మరియు నైపుణ్యాభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఆస్ట్రేలియా లేబర్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల బృందం ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే సహకారాలు మరియు శక్తి, విద్య & నైపుణ్యాల అభివృద్ధి రంగాలలో సృష్టించగల సినర్జీలపై వరుస చర్చలు జరిగాయి. సమావేశం తరువాత, ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని ఎంపీ & ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ మాట్లాడుతూ, ‘విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఇంధన రంగంలో విధానాల పరంగా మాకు చాలా సారూప్యతలు ఉన్నాయి. మేము ఒక సాధారణ దృష్టిని పంచుకుంటాము మరియు సమీప భవిష్యత్తులో ఈ రంగాలలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. పునరుత్పాదక శక్తిపై కూడా మేము చర్చలు జరిపాం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సౌరశక్తి పరంగా చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి నేను ఆసక్తిగా విన్నాను. ఇక్కడ చేసిన అభివృద్ధి అభినందనీయమని లీ టార్లామిస్ అన్నారు.
బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్
ఏపీలో జనసేనతో కలిసి నడుస్తామన్నారు బీజేపీ నేత సునీల్ థియోధర్. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని అబద్ధాలు చెబుతున్నారు….నరేంద్ర మోడీ, బీజేపీ నెంబర్-1. ఏపీలో టీడీపీ,వైసీపీ విఫలం అయ్యాయి. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పోయిలో పడ్డట్టుగా ఉందన్నారు సునీల్ ధియోధర్. ప్రాంతీయ, కుటుంబ పార్టీలతో నష్టం జరుగుతోంది. ఏపీకి న్యాయం చేయగలిగేది బీజేపీ ఒక్కటే అన్నారు. ప్రజల తరపున రోడ్డెక్కి పోరాడతాం అన్నారు. ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుంది. రెండుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల తరపున పీవీఎన్ మాధవ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం అని ప్రకటించారు సునీల్ ధియోధర్. ఆంధ్ర ప్రదేశ్ ను పునర్నిర్మించడం ఒక్క బీజేపీ – జనసేనకే సాధ్యం. మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని సునీల్ ధియోధర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు మాధవ్.
ఇదికదా మతసామరస్యం అంటే..
మనదేశం ఎన్నో కులాలు మతాల సమాహారం. సర్వ మానవ సౌభ్రాతృత్వం మనం ప్రపంచానికి నేర్పిన పాఠం. నాది, నేను కాదు.. మనది, మనం అనే వసుధైక కుటుంబ భావన భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతంగా నిలుపుతోంది. మనదేశంలో ప్రతిరోజూ ఏదో మతానికి, దైవానికి సంబంధించిన పండుగలు, ఉరుసులు జరుగుతుంటాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వినాయకచవితి వేడుకల్లో లక్షలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొంటూ ఉంటారు. వినాయక నిమజ్జనం వేళ ఎంతోమంది గణేష్ మండపాలకు స్వాగతం పలుకుతుంటారు. అదే విధంగా ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నాడు ఇఫ్తార్ విందుకి హాజరై హిందు సోదరులు తమ విశిష్టతను చాటుకుంటూ ఉంటారు. ముస్లింలకు కూడా హిందువులు ఇఫ్తార్ విందు ఇస్తారు. కూకట్ పల్లిలో వెలసిన పోచమ్మ తల్లి ఆలయానికి ఎంతో ఘనమయిన చరిత్ర ఉంది. ఆ ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. మంచి ఎండలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు చల్లని మజ్జిగ గ్లాసు అందిస్తారు. అమ్మవారి శోభాయాత్రలో ముస్లిం సోదరులు మజ్జిగ పంచి మనమందరం ఒక్కటే అన్న భావం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఏయూలో డ్రగ్స్ కల్చర్.. ఈ విశాఖకు ఏమైంది?
సాగరతీరంలో అదో ప్రశాంతమైన అందమైన క్యాంపస్.. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న యూనివర్సీటి..ఉన్నత విద్యలు అందించే చదువులు తల్లి.. దేశ విదేశాలకు ఎంతో మంది ప్రతిభా వంతులను అందించిన చదువుల దేవాలయం. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో మత్తు పదార్ధాలు.. విద్యార్ధుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది..వందేళ్ల చరిత్ర కలిగిన ఆ యూనివర్సీటిను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని పేరు ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు…యూనివర్సిటీ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో మత్తును పరిచయం చేస్తూ విద్యార్ధుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తాజాగా వెలుగుచూసిన ఘటనలో పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఉండడం అటు విద్యార్ధుల్లోను, ఇటు విద్యార్ధుల తల్లిదండ్రుల్లోను ఆందోళనకు కారణమవుతోంది. బీచ్‌రోడ్డులోని యోగా విలేజ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాల్లో వీరు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కడం వర్సిటీలో చర్చకు దారితీసింది. వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకునే చోట గంజాయి ఆనవాళ్లు బయటపడడం విస్మయానికి గురిచేస్తోంది. గత కొంతకాలంగా విశాఖ నగరంలో మత్తు పదార్థాల విక్రయం జోరుగా సాగుతోంది. గతంతో పోలిస్తే గంజాయి రవాణా విపరీతంగా పెరిగింది. జిల్లా సరిహద్దులను దాటిస్తున్న వారిలో యువతే అధికంగా పట్టుబడుతున్నారు. చాలా చోట్ల గంజాయి తాగుతున్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇటీవల పలుమార్లు పోలీసులు భారీ ఎత్తున మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సెక్యూరిటీ గార్డులు గంజాయితో పట్టుబడడం కలకలం రేపుతోంది. ఏయూలో మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందాం రండి
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేపై హాట్ కామెంట్స్ చేశారు. పెడ్డపప్పూరు సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందాం రండి అంటూ ఎమ్మెల్యేకి జెసి పిలుపునిచ్చారు. ఇసుక దోపిడీపై సాక్ష్యాధారాలతో వివరించారు జేసీ. ఇసుక రీచ్ లో నిబంధనలు పాటించడం లేదు. రోజుకి 20 మంది తో 75 ట్రాక్టర్లు లేదా15 టిప్పర్లు మాత్రమే తరలించాలి. కూలీలకు 300 రోజులు పని కల్పించాలి. అందుకు విరుద్ధంగా ఐదు యంత్రాలతో రోజుకి రాత్రింబవళ్ళు 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లు లోడింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే మానిటరింగ్ కమిటీ ఏం చేస్తోంది. కలెక్టర్ సహా కమిటీ లో ఉన్న 13 మంది ఏం చేస్తున్నారు. ఆధారాలతో అక్రమాలు బయట పెట్టినా అధికారులు స్పందించరా….? అని ఆయన మండిపడ్డారు. ఇలాగే వదిలేస్తే… మా ప్రాంతం నాశనం అవుతుంది. ఒక్క మీటరు తీయాల్సిన ఇసుక అరు అడుగులకు పైగా తవ్వుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. రోజుకి లక్ష రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే దీనిపై వెంటనే స్పందించాలన్నారు,
స్వీటికి ఆ జబ్బు ఉందంట..అది ఆపుకోలేదట
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దం సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.. ఇక ఈ మధ్యనే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ షూటింగ్ అనుష్క బిజీగా ఉంది. ఆమె రాక కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే స్వీటీకి ఒక జబ్బు ఉందంట.. జబ్బు అనగానే అదేదో ఆరోగ్య సమస్య అని అనుకోకండి.. స్వీటీ నవ్వును ఆపుకోలేదట.. ఒక్కసారి నవ్వితే.. కంట్రోల్ చేసుకోవడం కష్టమట.. ఒక 15 నిమిషాల వరకు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటుందట. అదేనండీ మన భాషలో చెప్పాలంటే పడిపడి నవ్వడం లా అన్నమాట. చుట్టూ తిరుగుతూ, కిందపడిపోయి అయినా నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని అనుష్కనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
పెళ్ళికి ముందే కియారా ప్రెగ్నెంట్ .. బాంబు పేల్చిన నటుడు
టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్న విషయం అందరికి తెల్సిందే. కానీ, ఏ రోజు కూడా వీరిద్దరూ.. తాము రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా చెప్పింది లేదు. ఇక సడెన్ గా వీరి పెళ్లి జరగబోతుందని మీడియా కోడై కూసింది. చెప్పినట్లుగానే అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గత రాత్రి వీరి రిసెప్షన్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అనుకొనేలోపు బాలీవుడ్ క్రిటిక్ కెఆర్ కె(KRK) పెద్ద బాంబ్ పేల్చాడు.
కోల్ కతాలో భారీగా బంగారం సీజ్.. విలువ ఎంతంటే?
బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా బంగారాన్ని తరలించేస్తున్నారు. ఒక్కోసారి పట్టుబడితే..ఒక్కోసారి అక్రమ రవాణా జరిగిపోతుంటుంది. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. ఇలా వారి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా జరిగిపోతోంది. వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నా..కస్టమ్స్ చెకింగ్‌లో పట్టుబడిపోతున్నారు. ఇంకొన్నిసార్లు తప్పించుకుని..యధేఛ్చగా సరఫరా చేయగలుగుతున్నారు. కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. 14 కోట్ల విలువ చేసే 24.4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈస్టర్న్ గేట్‌వే ద్వారా కొందరు గుర్తు తెలియని దుండగులు అక్రమంగా బంగారం తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వేతో బంగారం గుట్టును రట్టు చేశారు. బంగ్లాదేశ్ నుండి నాటు పడవలో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో అస్సాం, త్రిపుర, కోల్కతా, బంగాదేశ్ లకు చెందిన 8మందిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అసోం, త్రిపుర, కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్ డీఆర్ఐ అధికారులు పహారా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.