దొరలా వచ్చి గోల్డ్ చెయిన్ కాజేసిన కేటుగాడు
ఈజీమనీకి అలవాటుపడుతోంది యువత. ఎంత నిఘా వున్నా తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా నంద్యాలతో ఓ కేటుగాడు జ్యూయలరీ షాప్ సిబ్బందినే బురిడీ కొట్టించాడు. సీసీ కెమెరాల నిఘా , సెక్యూరిటీ గార్డుల బందోబస్తు , సిబ్బంది అప్రమత్తతతో వుండే చందన బ్రదర్స్ షోరూమ్ లో చేతివాటం ప్రదర్శించాడు ఓ కేటుగాడు. దొరలా వెళ్లి సిబ్బంది కళ్ళు గప్పి, రూ.2 లక్షల విలువైన గోల్డ్ ఛైన్ కాజేసి , తీరిగ్గా కాఫీ తాగి దర్జాగా వెళ్ళిపోయాడు. చోరీ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని చందన బ్రదర్స్ షోరూంలో బిజినెస్ పలచగా వుంది. సిబ్బంది భోజనం చేసి, రిలాక్స్ గా వుండే మధ్యాహ్నం సమయంలో షోరూంలో కాలు పెట్టాడు కేటుగాడు. గోల్డ్ సేల్స్ కౌంటర్ వద్దకు వెళ్లి , చైన్ల మోడల్స్ చూడటం మొదలు పెట్టాడు. సేల్స్ మెన్ శివకుమార్ కొన్ని మోడల్స్ చూపించాడు. శివకుమార్ ఏమరుపాటుగా వున్న సమయంలో తాను తెచ్చుకున్న నకిలీ ఛైన్ ను పెట్టి, గోల్డ్ చైన్ ను కాజేసి ,.తనకు నచ్చిన మాడల్స్ లేవని చెప్పి జారుకున్నాడు కేటుగాడు. ఐతే గోల్డ్ చైన్ల సంఖ్య కరెక్ట్ గా వున్న నాణ్యతలో తేడా రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు శివకుమార్.
గుడివాడలో జాబ్ మేళా… వేలాదిమంది హాజరు
కృష్ణా జిల్లా, గుడివాడలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర, హీరో , మారుతి లాంటి దిగ్గజ కంపెనీలతోపాటు మొత్తం 45 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. VKR & Vnb పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన మేళాలో రెండు వేల మందికి పైగా విద్యావంతులు పాల్గొన్నారు.మేళాలో పాల్గొన్న యువతకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న పోరాటాలకు సంఘీభావంగా నేడు గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు.చేతగాని పాలకుల వల్ల లక్షలాది మంది విద్యావంతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
మరోసారి బీసీ లు యుద్ధానికి రెడీ కావాలి
మరోసారి బీసీలు తమ హక్కుల సాధనకు, ఆత్మగౌరవం కోసం యుద్ధానికి సిద్ధం కావాలన్నారు డీకే పార్టీ అధ్యక్షుడు వీరమణి. బీసీ సామాజిక వర్గం అనుభవిస్తున్న 27 శాతం రిజర్వేషన్ లు బీపీ మండల్ వల్లే సాధ్యం అయ్యాయి. బీసీ కమిషన్ రికమండేషన్ పార్లమెంట్ గడప దాటకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయి.. మండల్ కమిషన్ రిపోర్ట్ బుట్టదాఖలు అవకుండా అనేక పోరాటాలు జరిగాయి. బ్రాహ్మణుల చేతిలో ఉన్న ప్రసార మాధ్యమాలు బీసీల కష్టాలు బయటకు రానీయలేదన్నారు వీరమణి. అగ్రకులాల ఆధిక్యతతో కుయుక్తులు పన్ని 50 శాతానికి రిజర్వేషన్ లు మించకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేశారన్నారు. 52 శాతం ఉన్న బీసీ లకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. పేరుకు 27 శాతం ఉన్నా , బీసీ లకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్ లు అందుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ను ప్రైవేటీకరణ చేయడంతో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కు రిజర్వేషన్ లు అందటం లేదు. బీసీల ఆత్మ గౌరవం కోసం మండల్ ప్రాణాలు అర్పించారు.
ప్రేమికుల రోజు హార్ట్ బ్రేక్.. ఫర్లేదు అబ్బాయిలు
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని.. రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా మార్చి 30 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రేమికుల రోజున హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు నాని ఎప్పుడో చెప్పుకొచ్చాడు. “ఓరి వారి.. నీది కాదురా పోరి” అంటూ సాగే సాంగ్ ను ఫిబ్రవరి 13 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నేడు ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ప్రేమికుల రోజున హార్ట్ బ్రేకింగ్ సాంగ్.. ఇట్స్ ఓకే బాయ్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ ఇస్తామని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వెంగళరావు నగర్లో కాంగ్రెస్ హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంభాని ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలుపుతూ కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంభాని మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని.. పేదరిక నిర్మూలన చేసేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సంభాని. సర్వమాత సామరస్యం కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. వరంగల్ డిక్లేరేషన్ తూ.చ తప్పకుండా పాటిస్తామన్నారు. కవులు రైతులకు కూడా 15 వేలు ఇస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర వస్తుల ధరలను నియంత్రిస్తామన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేనోడు మహరాష్ట్ర వెళ్లి అక్కడ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాడంటా అని ఎద్దేవా చేశారు సంభాని. బీఆర్ఎస్ పచ్చి అబద్ధాల పార్టీ అన్నారు.
క్షుద్రశక్తులు వస్తాయని గురువునే బలిచ్చిన శిష్యుడు
సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆ మంత్రగాడి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బసంత్ సాహు అనే వ్యక్తి దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య అనే వ్యక్తి తంత్ర విద్య నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గురుశిష్యులు ఇద్దరూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. కాగా శిష్యుడు తంత్ర-మంత్ర విద్యలో గురువును మించిన శక్తులు పొందాలనుకున్నాడు. అంతే.. అర్ధరాత్రి గురువుతో కలిసి స్మశానంలో క్షుద్రపూజలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువు బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు తనకూ వస్తాయని భావించాడు. బసంత్ క్షుద్రపూజలు చేస్తుండగా అతనిపై దాడి చేశాడు. ఓ పెద్ద కర్రతో గురువు తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే.. రక్తం తాగడం ప్రారంభించాడు.
పాదాలలో వాపు దేనికి సంకేతం?
మనిషి శరీరంలోని ముఖ్య భాగాల్లో గుండె ఒకటి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని లక్షణాల ద్వారా గుండె సమస్యల్ని ముందుగానే కనుక్కునే అవకాశం ఉంది. ఉబ్బిన పాదాలు మీ గుండెపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తాయంటున్నారు వైద్యులు, సరిగ్గా చెప్పాలంటే మడమకి ఎలాంటి నొప్పి లేకుండానే ఉబ్బినట్లుగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు.. అదే విధంగా వాచిన ప్రాంతం కాస్తా వేడిగా మారుతుంది. ఆ వాపు ఉన్న ప్రాంతంలో నొక్కితే చర్మం సొట్టలా పడుతుంది. పరిస్థితి ఎక్కువ సమయం ఇలానే ఉంటే కచ్చితంగా వైద్యులని సంప్రదించాలి.ఇలాంటి సమస్యని పెరిఫెరల్ ఎడెమా అంటారు. కణజాలంలో ద్రవం చేరినప్పుడు ఇది వస్తుంది. ఎక్కువగా చేతులు, కాళ్ళకి వస్తుంది. ఈ సమయంలో చేతులు, కాళ్ళు బరువుగా మారుతుంటాయి, కాళ్ళలోకి నీరు చేరి సమస్యగా అనిపిస్తుంది. ఇది గుండెజబ్బులు రావడానికి ముందు లక్షణం అంటున్నారు వైద్యుల, ఇది అలెర్జీ కారణంగా కూడా వస్తుంది ఒక్కోసారి.ఈ సమస్య ఉన్నప్పుడు పాదాల్లో వాపు మాత్రమే కాకుండా, చేతులు, ముఖం ఉబ్బినట్లుగా ఉంటాయి. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా వాపు వచ్చేస్తుంది. కొన్ని సార్లు రోగికి మెడనొప్పి కూడా ఉంటుంది.పెరిఫెరల్ ఎడెమా వల్ల గుండెకి రక్త సరఫరా తగ్గినప్పుడు గుండెపై వత్తిడి పెరుగుతుంది. గుండె పంప్ చేసే రక్తాన్ని బలహీనపరిచినప్పుడు అది తీవ్రంగా మారుతుంది. గుండె జబ్బుకూడా వచ్చే ప్రమాదం ఉంది. దగ్గు, ఆగకుండా వస్తూంటే, గురక, కడుపులో ఉబ్బరంగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. బరువులో తేడా వచ్చినా, మనసులో ఆందోళన ఎక్కువగా ఉన్నా పెరిపెరల్ ఎడెమా ప్రభావం చూపుతుందని గ్రహించాలి.
సుఖానికి అలవాటు అయ్యా.. అందుకే సినిమాలు మానేశా
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఇక మా ఎలక్షన్స్ లో హేమ చేసిన రచ్చ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే మా ఎలక్షన్స్ లో జరిగిన వివాదం వలనే హేమ బాగా ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు అంటే ఖచ్చితంగా హేమ ఉండాల్సిందే.. అలాంటిది గత కొన్ని రోజులుగా హేమ ఏ సినిమాలోనూ కనిపించలేదు. దీంతో ఆమె సినిమాలు మానేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై హేమ స్పందించింది. ఇటీవలే జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ మణికొండలో నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టిన విషయం తెల్సిందే. ఆ ఈవెంట్ కు హాజరైన హేమ తాను సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. “కొత్తగా బిజినెస్ పెట్టాను.. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. బిజినెస్ బాగా డెవలప్ అయ్యి, సంపాదించడం ఎక్కువై పోయి, సుఖపడడం అలవాటు అయ్యి, కష్టపడడానికి ఇష్టపడడం లేదు” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది మాత్రం హేమ రివీల్ చేయలేదు. దీంతో అభిమానులు అప్పుడప్పుడైనా సినిమాల్లో కనిపించండి.. జనాలు మర్చిపోకుండా అని కొందరు.. ఇప్పటికైనా అర్ధం చేసుకున్నారు. మంచిగా బిజినెస్ చేసుకోండి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.మరి ముందు ముందు రోజుల్లో హేమ ఏమైనా సినిమాల్లో కనిపిస్తుందో లేదో చూడాలి.