2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ఆయన నివాసంలో భేటీ అనంతరం తేజస్వీ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిసినట్లు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గురించి చర్చించినట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీడియాతో వెల్లడించారు. జార్ఖండ్‌లో అధికార కూటమికి చెందిన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సంకీర్ణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తేజస్వీ యాదవ్ చెప్పారు. జార్ఖండ్‌లో పార్టీ పనిని తాను ముందుగానే పర్యవేక్షించాలని అనుకున్నానని అయితే ఆర్జేడీ చీఫ్ , తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా జార్ఖండ్‌లో పర్యటించలేకపోయానని వెల్లడించారు. సింగపూర్‌లో తన తండ్రికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. తన మాతృభూమికి తిరిగి వస్తారని, ఆయన ప్రాణం ఈ భూమితో ముడిపడి ఉందన్నారు. ఇదే సమయంలో మేము బీహార్ లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బీజేపీని అధికారం నుండి తొలగించడంలో సక్సెస్ అయ్యామన్నారు.
కాంగ్రెస్, జేడీయూ టిప్పు సుల్తాన్‌ను నమ్ముకుంటున్నాయి.. బీజేపీ మాత్రం..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం కర్ణాటకలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ మరియు కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీయూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కాంగ్రెస్, జేడీ(ఎస్)లు విశ్వసించాయని, ఈ రెండు పార్టీల వల్ల కర్ణాటకకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రం 16వ శతాబ్దపు తుళువ రాణి ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటా స్పూర్తితో సుసంపన్నమైన పాలన అందిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని.. ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా ఉపయోగించుకుందని ఆరోపించారు. టిప్పును నమ్మే జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఓటేయాలా లేక రాణి అబ్బక్కపై విశ్వాసం ఉంచిన బిజెపికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి..? ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని దేశభక్తులా..? లేక కర్ణాటకను ఏటీఎంగా మార్చుకున్న గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ కా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని.. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కర్ణాటక అభివృద్ధి చెందిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను గుర్తుంచుకుంటారని.. ఆయన నాయకత్వంలోనే బెంగళూర్ అభివృద్ధి చెందిందని అన్నారు.
మళ్ళీ రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్ అని విదుత్య్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. నిన్న సాయంత్రం 4గంటల వరకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అయితే.. గత ఏడాది ఇదే రోజున 11,420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా.. మే నెల వరకు 15000 మెగావాట్ల వరకు చేరే అవకాశం వుందని విశ్వసనీయ సమాచారం. ఇంకా వేసవికాలం మొదలుకాకముందే.. విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న కేవలం 11,822 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. కొద్దిరోజులుగా వ్యవసాయ బోర్లకు 10 గంటల్లో త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నారు. శుక్రవారం నుంచి 12 గంటల నుంచి సరఫరా పెరగడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి వ్యవసాయ బోర్లకు 24 గంటల త్రీఫేజ్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్టంగా 15 వేల మెగావాట్లకు మించి డిమాండ్ ఉండవచ్చని డిస్కమ్ లు అంచనా వేస్తున్నాయి.
మంత్రి హరీష్ రావుని కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావుని కలిసి రిప్రెసెంటేషన్స్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావుని తన ఛాంబర్‌లో కలిసిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని కోరారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ స్కీమ్ కింద 5 కోట్ల 50 లక్షల ఫండ్స్ ఇవ్వాలని కోరడం జరిగిందని, సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం 3 కోట్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా.. ‘సంగారెడ్డి పట్టణంలోని ఈద్ గా అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్లు ఇవ్వాలని కోరుతున్నానని, సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరుతున్నానని అన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణంలోనే ముస్లిం ల ఖాభారస్థాన్ (స్మశానవటిక ) కొరకు 5 ఎకరాల భూమి కావాలి.. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలి. అలాగే సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటిక కోసం 5 ఎకరాల భూమి కావలెను.. ఇది కూడా సర్కార్ వెంటనే పరిశీలించి మంజురు చేయాలనీ కోరుతున్న.. ఇక క్రిస్టియన్స్ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల భూమి క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్ (స్మశానవటిక ) కేటాయించాలని ప్రభుత్వని కోరుతున్న.. సదశివాపేట్ లో మెహబూబ్ పాషా దర్గా అభివృద్ధి కోసం 3కోట్లు మంజూరు చేయాలనీ ప్రభుత్వాని కోరుతున్న.
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS -2 లో లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పందించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ప్రమాద విషయాన్ని ఎంపీ విజయ్ సాయి రెడ్డి, సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళాం అన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ముంబైలో వైద్యం అందించాలని కోరాం. కాంట్రాక్టు ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగి అన్న తేడా లేకుండా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తాం అన్నారు. ప్రతి కార్మికునికి అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. కేంద్రం ఎప్పుడో ప్రైవేటీకరిస్తామని ఇప్పటి నుంచే రిక్రూట్మెంట్ నిలిపివేయడం దారుణం అన్నారు. అసలు ప్రైవేటీకరణ జరుగుతుందా. ? ఇలాంటి ప్రమాదాలకు పని ఒత్తిడి కూడా ఓ కారణం అన్నారు. నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకువెళ్లాలని కార్మికులు ఒత్తిడికి గురవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి స్టీల్ ఉన్నతాధికారి వరకు ఢిల్లీ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాల కోసం ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈ ప్రమాదంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రారంభానికి సిద్ధమయిన ఆధునిక స్మశాన వాటిక
హన్మకొండ 57వ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి కాలనీలో రూ.3.90 కోట్లతో రెండు ఎకరాల్లో నిర్మించిన అత్యాధునిక శ్మశానవాటిక (వైకుంఠ ధామం) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యుఎంసీ) ద్వారా ఆధునిక మోడల్ శ్మశానవాటికగా నిర్మించినట్లు చెప్పారు. “మేము త్వరలో ఈ అత్యాధునిక శ్మశానవాటికను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నగరానికి వచ్చిన సందర్భంగా దీనిని ప్రారంభించే అవకాశం ఉంది’’ అని ఎమ్మెల్యే తెలిపారు. GWMC అధికారుల ప్రకారం.. శ్మశానవాటికలో అన్యదేశ మొక్కలతో కూడిన ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌ను కూడా అభివృద్ధి చేశారు. “నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, కట్టెల గది, స్త్రీ పురుషులకు ప్రత్యేక స్నానపు గదులు, టాయిలెట్లు, లాకర్ రూమ్, ప్రార్థన గదులు, కూర్చునే గదులు, కాళ్లు మరియు చేతులు కడుక్కోవడానికి స్థలం మరియు కాంపౌండ్ వాల్‌తో కూడిన ఈ సదుపాయంలో లైటింగ్‌ను అభివృద్ధి చేశాం.” అని అధికారులు వెల్లడించారు. మృతదేహాలను తీసుకెళ్లే వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలం కేటాయించారు. మరణించిన వారి బంధువులు దహన సంస్కారాల తర్వాత పాటించే 11 రోజుల కర్మలు పూర్తయ్యే వరకు వైకుంఠ ధామం కాంప్లెక్స్‌లో ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వివాదాలకు కేంద్ర బిందువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం
మంగళగిరిలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఇప్పుడు ఈ ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన దేవాలయంగా మరియు లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం రాజకీయాలకు వేదికగా మారింది, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆనుకొని ఉన్న పెద్ద కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తల్లో ఉంది. ఈ కోనేరు నుండి నీటిని తీసుకొని స్వామివారికి నిత్యం అభిషేకం చేయడం కోసం పాండవుల కాలంలో ఈ కోనేటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ కోనేరు పునర్నిర్మాణం కొరకు వైసీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలు వెచ్చించి మరమ్మత్తులు నిర్వహిస్తుంది, కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ దీని మరమత్తులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిత్యం ఈ కోనేరు వద్ద సంచరిస్తున్నారని, కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బినామీ అని, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా నీటిని తోడి, పూడిక తీయాలని నిర్ణయించి ఆ పనులు జరుగుతుండగా, కోనేటి అడుగు భాగంలో గుప్త నిధులు ఉన్నాయని ఒక వర్గం చెబుతుంది.
కాశ్మీర్ లో లిథియం నిల్వల గని… మన భవిష్యత్ మార్చేస్తుందా? ఉపయోగాలేమిటి..?
జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 60 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లిథియం భారతదేశ భవితను మార్చబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. కాస్మిక్ మెటల్ గా పేరొందిన లిథియంకు ప్రస్తుతం మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. రాబోయే కాలం ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగంలో లిథియం బ్యాటరీల వినియోగం పెరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ లో భారీగా లిథియం నిల్వలు బయటపడటం శుభసూచకంగా కనిపిస్తోంది. కర్ణాటక మాండ్యా జిల్లాలో 1600 టన్నుల లిథియం నిల్వలు ఉన్నప్పటికీ.. ఇది వాణిజ్యపరంగా అంత లాభదాయకంగా లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాలు అతిపెద్ద లిథియం ఉత్పత్తి, ఎగుమతిదారులుగా ఉన్నాయి. ప్రపంచానికి కావాల్సిన మెజారిటీ లిథియాన్ని ఈ మూడు దేశాలు సప్లై చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఖనిజాల్లో లిథియం ఒకటి. దీన్ని మొదటిసారిగా 1817లో జోహాన్ ఆగస్ట్ ఆర్ఫ్‌వెడ్‌సన్‌చే కనుకొనబడింది. లిథియం అనేది లిథోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ‘రాయి’ అని. అత్యల్ప సాంద్రత ఉన్న లిథియం నీటితో తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. విషపూరితం. అయితే లిథియం అనేది భూమిపై సహజంగా ఏర్పడలేదు. సూపర్ నోవా అనే నక్షత్ర విస్పోటనం సమయంలో ఈ మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నక్షత్ర పేలుళ్ల సమయంలో అణు ప్రతిచర్యలలో ఎక్కువ భాగం లిథియం ఉత్పత్తి అవుతుందని.. ఇది విశ్వం అంతటికి ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న యువకులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్లు దాటినా సుమారు 200 మంది పెళ్లి కాని ప్రసాదులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమై 25న దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక, దీనికి బ్రహ్మచారుల పాదయాత్ర అని పేరు కూడా పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికేలా దీవించాలని అక్కడి దేవతకు మొక్కులు చెల్లించనున్నారు. మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే యువతకు వధువు దొరకడం లేదు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వాదం పొందడమే ఈ యాత్ర ఉద్దేశమని వారు వెల్లడించారు ఆ పెళ్లి కానీ ప్రసాద్‌లు.