రేవంత్ పాదయాత్ర.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే

హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇవాల్టితో మూడో రోజులకు చేరుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం రేవంత్ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈదులపూసపల్లి గ్రామంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత రైతులతో మాట ముచ్చట కొనసాగనుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఈదులపూసపల్లి నుండి మహబూబాబాద్ పట్టణానికి పాదయాత్ర కొనసాగనుంది. మహబూబాబాద్ పట్టణంలో పలు సెంటర్ల మీదిగా ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకోనుంది. తొర్రురు బస్టాండ్ వద్ద బహిరంగసభలో రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి పెద్దవంగర వద్ద బస చేయనున్న రేవంత్.
ఇక జూమ్ వంతు.. 13వందలమందికి ఉద్వాసన

ఐటీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడతాయో, ఎవరి జీతాల్లో కోత పడుతుందో తెలీని దుస్థితి ఏర్పడింది. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న వార్తలతో కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం పడిపోతోంది. అందుకే జీతాలు తగ్గించడం, లేదంటే ఉద్యోగుల్ని తగ్గించడం చేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలీక ఉద్యోగులు వణికిపోతున్నారు. ఉద్యోగం ఎప్పటివరకు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందోనని తెగ హైరానా పడుతున్నారు. ప్రస్తుతం ఆ భయాలు అలానే ఉన్నాయి మరి. దిగ్గజ కంపెనీలు కూడా తామేం తక్కువ అన్నట్టుగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అంటూ కంపెనీలు పింక్ స్లిప్ లు జారీచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే టెక్, ఐటీ రంగంలో లేఆఫ్స్ ఎలా ఉన్నాయో చూశాం. ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. తర్వాత దేశీయంగా ఐటీ సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్ వంటివి కూడా పెర్ఫామెన్స్ సరిగా లేదన్న కారణంతో వేలాదిమందికి సెండాఫ్ చెప్పేశాయి. ఇప్పుడు జూమ్ సంస్థ వంతు వచ్చింది.
అమెరికాలో తెలుగు వాడి సత్తా..పిట్ట కొంచెం కూత ఘనం

అమెరికాలో తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక గోల్డన్ గావెల్ ( టాప్ స్పీకర్ ) అవార్డు గెలుచుకున్న సాహిత్ మంగు తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించాడు. గార్డెన్ స్టేట్ డిబెట్ లీగ్ టోర్నమెంట్‌లో విజేతగా ఈ 12 ఏళ్ళ కుర్రాడు నిలిచాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి నిజం చేస్తూ.. తన ప్రసంగాలతో అదరగొడుతున్నాడు 12 ఏళ్ళ కుర్రాడు. న్యూజెర్సీలో సోమర్‌సెట్‌లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న సాహిత్ మంగు ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా గార్డెన్ స్టేట్ డిబెట్ లీగ్ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 04, 2023న, వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్ మంగు గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. 12 ఏళ్ల ఈ కుర్రాడి టాపిక్‌లు, డిబేటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌పై చేసిన అసాధారణ పరిశోధనలకు న్యాయ నిర్ణేతలు, ఉపాధ్యాయులు, తొటి స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. భారత్ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం తనది. అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన ఇండో అమెరికన్ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్ మంగు తన ప్రసంగాలతో అదరగొడుతున్నాడు. ప్రస్తుత అవార్డుతో పాటు, పాఠశాలలో పాటలు పాడటం, డిబేట్‌లో పాల్గొనటంతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. విద్యార్థులకు డిబేట్‌లలో సహాయం చేయడానికి జాతీయ లాభాపేక్ష లేని డిబేట్ క్లబ్‌లో పనిచేస్తున్నారు సాహిత్. వివిధ సంస్థల నుండి కోచ్‌లు మరియు సలహాదారులతో, డిబేట్ క్లబ్ వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెడుతుంది.
నర్సాపురంలో దొంగ నోట్ల కలకలం

దొంగనోట్లు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు దొంగ నోట్లు ముద్రించి, వాటిని పంపిణీ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో దొంగనోట్ల కలకలం రేగింది. నరసాపురం యాక్సిస్ బ్యాంకు డిపాజిట్ మిషన్ లో ఓ వ్యక్తి 500 రూపాయల దొంగ నోట్లు డిపాజిట్ చేశాడు. మొత్తం 40 నకిలీ నోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై బ్యాంక్ సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దొంగ నోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయింది. దొంగ నోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి దీని వెనుక కథ ఏంటి అని వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు..
ప్రగతిభవన్‌పై రేవంత్ కామెంట్స్.. బీఆర్‌ఎస్ నేతలు సీరియస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని ములుగు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి యాత్రపై ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డి కామెంట్స్ పైనా బీఆర్‌ఎస్ శ్రేణులు పిర్యాదు చేయగా ఇక నర్సంపేట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రెడీ అయ్యారు.
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన భూకంపాలు

టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎటూ చూసిన శిథిలాలే, కూలిపోయిన భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు, అంబులెన్సులు కదల్లేకుండా అవరోధాలు, సున్నాకు పడిపోయిన ఉష్ణోగ్రతలతో వెన్ను జలదరించే చలి. ఇదీ ప్రస్తుతం టర్కీ, సిరియాలో కనిపిస్తున్న పరిస్థితి. టర్కీ, దానిని ఆనుకున్న ఉన్న సిరియా దేశాల్లో హృదయ విదారక పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయం నాటికి టర్కీ, సిరియా దేశాల్లో 7,800 మందికి పైగా భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. బుధవారం ఉదయం నాటికి 7,800 దాటిపోగా.. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. భారీ భూకంపం వల్ల 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. విపత్తు జోన్‌కు సహాయం చేయాలని దేశాలను కోరింది.
ఘోర రోడ్డుప్రమాదం…30 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ఓ ప్యాసింజర్ బస్సు, కారును బలంగా ఢీకొట్టిన అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో 30 మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై మంగళవారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో లోయలోకి పడిపోయాయి. ప్యాసింజర్ బస్సు గిల్గిట్ నుంచి రావల్పిండికి వెళ్తోందని పోలీసులు తెలిపారు.