గుంటూరు, కందుకూరు ఘటనలపై శేషశయనారెడ్డి విచారణ
కందుకూరు, గుంటూరు సంఘటన మీద శేష శయనా రెడ్డి విచారణ చేపట్టారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాలంటూ చేపట్టిన పంపిణీలో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు తీసింది. అంతకముందు డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.ఈ వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. తొక్కిసలాట ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ కమిటీని నియమించింది. కందుకూరు తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి శేష శయనా రెడ్డి కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కందుకూరు తెలుగుదేశం నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ లను శేష శయనా రెడ్డి కమిషన్ విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 11గం.కు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విచారణకు రావాలని నేతలకు శేష శయనా రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.
రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారు
మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం.. తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. జీవనది లాంటి శ్రీరామ సాగర్‌ను మహారాష్ట్ర చేతికి ఇస్తే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానం అవుతుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని.. ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువ ప్రాజెక్టు వృధా అవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోసమని.. ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే, కేసీఆర్‌ను ప్రజలు ఛీ కొడతారంటూ పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి మనం ఎన్నో ఉద్యమాలు చేశామని.. ఇప్పుడు ఆ నీళ్లను వాళ్ళు తోడుకుంటే చూస్తూ ఊరికే ఉందామా? అని ప్రశ్నించారు. బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని.. ఈ విషయంపై వాళ్లేమంటారని నిలదీశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రైతు ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.
కన్యాకుమారిలో ఘోరం.. చిన్నారి నరబలికి ప్రయత్నం
టెక్నాలజీ ఎంత పెరిగినా.. సమాజంలో ఎన్నిమార్పులు చోటుచేసుకుంటున్నా కొన్ని మూఢ నమ్మకాలు, సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో జరిగిన ఓ ఘటన సంచలనం కలిగించింది. కన్యాకుమారిలో చిన్నారిని నరబలికి ప్రయత్నించారు. చనిపోయిన భార్య ,కూతురి ఆత్మ శాంతించాలని నరబలికి పూజారి ఏర్పాట్లు చేశారు. రెండేళ్ల చిన్నారి కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లితండ్రులు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు గంటలలో చిన్నారిని కాపాడారు పోలీసులు. కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్ లో ఈ ఘటన జరిగింది. నాగర్ కోవిల్ కి చెందిన కన్నన్ , అఖిల భార్య భర్తలు. తమ ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి అదృశ్యం అయింది. ఆ చిన్నారి కోసం గాలించారు. కానీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీకోసం రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటి పక్కనే ఉన్న బావిలో పడిపోయి ఉంటుందని బావిలో దిగి వెతికారు పోలీసులు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేప్పట్టిన పోలీసులు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరటి తోటలో వింత శబ్దాలు రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు..
ఏపీలో లేఖల యుద్దం.. అమర్నాథ్ వర్సెస్ హరిరామజోగయ్య
ఏపీలో అసలేం జరుగుతోంది? ఒకవైపు టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం జరుగుతుంటే.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం చోటుచేసుకుంది. హరిరామజోగయ్యకు మంత్రి అమర్‌నాథ్ రెండో లేఖ రాశారు. టీడీపీ, జనసేన పొత్తు విషయంలో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబేనని మీరే పలుమార్లు విమర్శించారు, అలాంటి చంద్రబాబుతో పవన్ పొత్తుని మీరు సమర్థిస్తారా? అని అమర్‌నాథ్ లేఖలో మండిపడ్డారు.గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రాసిన లేఖ ఇది. కాపుల భవిష్యత్తు విషయములో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గార్కి రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు ,మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ గుడివాడ అమర్నాథ్ అంటూ ఈ నెల 5వ తేదీన లేఖ రాశారు.
భారత్ కు పాక్ ప్రధాని బెదిరింపు..షెబాజ్ షెరీఫ్ వక్రబుద్ధి
మొన్నటికి మొన్నే తమకు బుద్ధి వచ్చిందని, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని పాక్ ప్రధాని షెబాజ్ షెరీఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘‘పాకిస్తాన్ వద్ద అణ్వాయుధం ఉంది. కాబట్టి, భారత్ తమపై డేగకన్ను వేయలేదు. ఒకవేళ డేగకన్ను వేస్తే.. భారత్‌ని తన పాదాల కింద నలిపేసే శక్తి పాకిస్తాన్‌కి ఉంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పర్యటించిన ఆయన.. ఆ సమయంలోనే పై విధంగా స్పందించాడు. అంతేకాదు.. కశ్మీర్ ఇష్యూని షెబాజ్ మరోమారు తెరమీదకి తీసుకొచ్చారు. కశ్మీరులకు స్వేచ్ఛ దక్కాలంటే.. ఆర్థిక, రాజకీయ స్థిరత్వం పొందాలని పేర్కొన్నాడు. అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని.. రాజకీయ, దౌత్య, నైతిక సాయం అందిస్తామని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా.. అణచివేతకు గురైన కశ్మీరి సోదరులు, సోదరీమణులకు పాకిస్థాన్ మొత్తం అచంచలమైన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసేందుకు కలిసి వస్తోందని ట్వీట్ చేశాడు. భారత్ నుంచి విముక్తి పొందాలన్న కలను సాకారం చేసుకునేందుకు కశ్మీరి ప్రజలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, తమ త్యాగాల ద్వారా స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారని అన్నాడు. కశ్మీరి ప్రజల కలలు త్వరలోనే సాకారమవుతాయని చెప్పి.. తమ వక్రబుద్ధిని షేబాజ్ చాటుకున్నాడు.
ఐటీఐఆర్ పై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.జ ITIR ప్రాజెక్ట్ ను ఇవ్వడం లేదని కెసిఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పై దాడి చేస్తుంది. ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఐటీ కోసం అభివృద్ధి చేయడం. 2008 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు మంజూరు చేసింది…202 చదరపు కిలోమీటర్లు స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని.. మొదటి విడత 2013 నుండి 2018 వరకు… రెండో విడత 2018 నుండి 2038 వరకు అభివృద్ధి చేయాలని ప్లాన్ చేసిందన్నారు. కేంద్ర సహకారం 4 వేల 863 కోట్లు… అందులో 3 వేల 275 కోట్లు మంజూరు చేసింది..ITIR పై KTR బహిరంగ చర్చకు రావాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదు… రైల్వే లైన్ కు సహకారం లేదు… మెట్రో వేయలేదన్నారు.
రౌడీ షీటర్ దారుణ హత్య.. కారణం అదేనా?
హైదరాబాద్ పాతబస్తీలో ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతంలో కాలాపత్తర్ రౌడీ షీటర్ ఆయాజ్ అలియాస్ అబ్బు మినీ ట్రక్ వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా.. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేశారు. తొలుత అతని కళ్లల్లో కారం కొట్టి బయటకు లాగిన దుండగులు.. తమతో తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అబ్బు చనిపోయాడన్న విషయాన్ని నిర్ధారించుకొని.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంని పిలిపించి, ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ గిఫ్ట్ ని ఫస్ట్ లుక్ అనుకోవచ్చా?
సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చింది. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని అనౌన్స్ చేశారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ కి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందుగా దర్శకుడు విమల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సిద్ధునే డైరెక్టర్ అవతారం ఎత్తాడు. డైరెక్టర్ సమస్య తీరిపోయింది అనుకుంటుంటే హీరోయిన్ సమస్య మాత్రం రిపీట్ అయ్యింది.