తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీష్ రావు
తెలంగాణ పద్దుల సీజన్ వచ్చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. సభలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రి హరీష్ రావుని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆచరిస్తుందని దేశం అనుసరిస్తుందని దార్శనిక ప్రణాళికతో దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షోభ సమయాల్లోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల, ప్రజల సంక్షేమంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఆర్థిక ఇబ్బందులు పడ్దామని, రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ పటిష్టకార్యాచరణ వల్ల జీఎస్డీపీ పెరిగిందన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై నేటితో తెర పడింది. ఈ తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో కీలకం కానుందనే నేపథ్యంలో.. హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాల్టి తీర్పుతో ఈ కేసు ఓ కొలక్కి వచ్చింది. ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సీబీఐకి అప్పగించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే..
బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్
బస్సులు నడుపుతున్న డ్రైవర్లు తగు జాగ్రత్తగా తీసుకోకపోతే ప్రమాదాలకు గురి కావాల్సిందే. వాళ్లు చేసే చిన్న తప్పు పలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. చిన్న అజాగ్రత్తగా ఉన్న వారు డ్రైవర్ తో ప్రయాణికులు సైతం మృత్యువాత పడే పరిస్థితులు ఎదురవుతున్నారు. ఇలాంటి ఘోరమై ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ లో చోటుచేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో ఉన్న బస్సు బయలు దేరింది. కాస్త ముందుకు వెళ్లిన బస్సు డ్రైవర్‌కు విపరీతమైన ఛాతిలో నొప్పివచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సునుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. కాసేపు బాగానే ప్రయాణిస్తున్న బస్సు ఒకసారిగా క్రాస్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ బస్సు డ్రైవర్ బస్సులో లేడు. బస్సు ఎటువెలుతుందో తెలియని ఆయోమయంలో ప్రయాణికులు వున్నారు. దీంతో బస్సు ఆసిఫాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆర్టీసి హైటెక్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులకు ఉన్నారు.
బీజేపీ నాయకుడిని హతమార్చిన మావోయిస్టులు
మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నాయకున్ని అత్యంత దారుణంగా హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు నీల్‌కంఠ్ నక్కెంను కిరాతకంగా చంపేశారు. గత 15 ఏళ్లుగా ఉసూర్ బ్లాక్‌కి బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న నీల్‌కంఠ్.. తన స్వగ్రామమైన పైక్రమ్‌లో బంధువు వివాహానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, నీల్‌కంఠ్‌పై ఎగబడ్డారు. మొత్తం 150 మంది గుంపుగా పైక్రమ్‌కి చేరుకున్నారు కానీ, వారిలో ముగ్గురు మాత్రమే నీల్‌కంఠ్‌పై దాడి చేసి చంపారు. కుటుంబ సభ్యుల ముందే కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆ మావోయిస్టులు.. ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ, ఆ బీజేపీ నాయకుడ్ని చంపారు. అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లేఖాస్త్రాలు… కౌంటర్లు, మాటల తూటాలు
ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయ భవిష్యత్తు చుట్టూ వాతావరణం వేడెక్కు తోంది. పవన్ కళ్యాణ్ టీడీపీకి పెద్ద కార్యకర్తగా మారారని , కాపులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు జనసేనకు సూటిగా తగిలాయి. మరోవైపు., కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటుగా స్పందించారు. అమర్నాథ్…. “ఓ బచ్చా” సాధారణ మంత్రిపదవికి అమ్ముడిపోయారు అంటూ లేఖ సంధిస్తే……మీ మానశిక ధృఢత్వం పట్ల అనుమానం కలుగుతుందని ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ,జనసేన పొత్తులపై విస్త్రతంగా ప్రచారం జరుగుతున్న వేళ అధికారపార్టీ దూకుడు పెంచింది. రాజకీయ అవసరాల కోసం కాకుండా కాపుల విస్త్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరుతోంది. ఆ దిశగా రాజకీయ ప్రాతినిధ్యం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం అయ్యిందని అందుకు మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్యే నిదర్శనం అంటోంది అధికారపార్టీ. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దూకుడు మరింత పెంచారు ఏపీ ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. శనివారం నాడు పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంటలో నిర్మించిన కృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవన్ ను స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.
బిహార్‌లో మరో వింత ఘటన
బిహార్‌లో మరో వింత ఘటన వెలుగు చూసింది. సమస్తిపూర్ జిల్లాలో రైల్వే లైన్ చోరీకి గురయ్యింది. దాదాపు 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను కొందరు దుండగులు దొంగలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిందితులపై శాఖాపరమైన విచారణను ఏర్పాటు చేశామని, ఇందులో దోషులుగా తేలితే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. జనవరి 24వ తేదీన వెలుగు చూసిన ఈ ఘటన కేసుని స్క్రాప్ స్కామ్‌గా పేర్కొంటున్నారు.ఈ రైల్వే లైన్‌ను లోహత్ చక్కెర కార్మాగారం కోసం వేశారు. అయితే.. ఆ మిల్లు మూతపడి చాలాకాలం అవుతోంది. అది మూతపడినప్పటి నుంచి ఆ రైలు మార్గం కూడా మూసివేయబడింది. మిల్లు మూతపడిన తర్వాత అక్కడున్న సరుకుతో పాటు రైల్వే లైన్‌ను కూడా టెండర్ తీసుకొని, స్క్రాప్‌గా వేలం వేయాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే ఆ రైల్వే ట్రాక్ దోపిడీ చేయబడింది. ఈ ఆరోపణలపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. చోరీ నిజమని తేలింది. దీనిపై దర్భంగా ఆర్పీఎఫ్‌లో పోలీసు కేసు నమోదైంది. ప్రాథమిక విచారణలో భాగంగా.. జంఝార్‌పూర్ అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్‌తో పాటు మధుబని హౌస్‌కీపింగ్ అసిస్టెంట్ ముకేశ్ కుమార్ సింగ్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరూ రైల్వే లైన్‌ను టెండర్ లేకుండా.. కొందరు వ్యాపారులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చేర్యాల సీఐపై సస్పెన్షన్ వేటు
సిద్దిపేట జిల్లా చేర్యాల CI శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినదుకు సస్పెండ్ చేస్తూ సిద్దిపేట CP శ్వేతా ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం చేర్యాల ZPTC మల్లేశం హత్య జరిగిన రోజు CI శ్రీనివాస్ అందుబాటులో లేడు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్ లో దాదాపు గంటన్నరకు పైగా CI రాక కోసం వేచి చూశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అయితే సీఐ ఎంతసేపటికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పని నిమిత్తం బయటకు వెళ్లారు అనుకున్న ఎమ్మెల్యే తరువాత ఆయన ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తనపనులకై బయటకు వెళ్లినట్లు తేలడంతో మండిపడ్డారు. ఇదేనా సీఐ ప్రజలకు అందుబాటులో ఉండేది అంటూ ఉగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకే ఇంతగా వేచి చేసే పరిస్థితి నెలకొన్నప్పుడు ఇక ప్రజల పరిస్థి ఏంటని ప్రశ్నించారు.
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం.. 100మందికి పైగా మృతి
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటిదాకా 100 మందికి పైగా మృతి చెందినట్టు తేలింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 4:17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 6.7 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.