కుదిరితే జనసేనతోనే పొత్తు.. లేకుంటే జనంతోనే
Somu1
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతూనే వుంది. పొత్తు పొడుపులు.. పెదవి విరుపులు కనిపిస్తూనే వున్నాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా 15 నెలల వరకూ గడువు వుంది. అయితే, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తులపై తాను చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జన సేనతో మైత్రిపై బయట అనేక ప్రచారాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే “వస్తే జన సేన తో” లేదంటే జనం తోనే మా పొత్తు అంటున్నాం అని అన్నారు సోము.జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనదని చెప్పారు. ఓట్లు చీలకూడదనే పవన్ కామెంట్స్, చంద్రబాబు తో భేటీల నేపథ్యంలో బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయని, అందుకే వస్తే జన సేన తో వెళ్ళాలని తాను అంటున్నట్టు స్పష్టం చేశారు సోము. ఫోన్ ట్యాపింగ్ విషయం కొత్తేమీ కాదనీ, టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు వైసీపీ నేతల ఫోన్ల ట్యాప్ చేసిందనీ, ఇప్పుడు టీడీపీ నేతల, సానుభూతి పరుల ఫోన్లు ట్యాప్ చేస్తారనీ అందులో వింతేమీ లేదన్నారు సోము. అధికారం , అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్లు ఆంటూ తనదైన శైలిలో వివరించారు సోము వీర్రాజు. జన సేన తో పొత్తు పై బయట అనేక ప్రచారాలు ఉన్నాయి…అందుకే వస్తే జన సేన తో పొత్తు అంటున్నాం. జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనది…రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రధామయిన పాత్ర బీజేపీదే అన్నారు సోము వీర్రాజు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదని మండిపడ్డారు. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అదానికి కట్టబెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం మాత్రం ఉన్న సంపదను అమ్మేస్తోందని అన్నారు. ఎల్‌ఐసీని అదాని కాళ్లదగ్గర పెట్టారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అధిక వేతనాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలు దేశం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఐటీ రంగంలో 2 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11 లక్షల 48 వేల కోట్లకు చేరగా… రాష్ట్రంలో తలసరి ఆదాయం 3 లక్షల 17 వేలుగా ఉందని తెలిపారు.
నా మీద కుట్రలు చేస్తున్నారు… బెదిరిస్తున్నారు
నెల్లూరు జిల్లా రాజకీయంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ .ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకి వచ్చారు. వై.సి.పి లో కొనసాగడం ఇష్టంలేక మౌనంగా నిష్క్రమిస్తాం అని అనుకున్నా. కానీ నా వ్యక్తిత్వాన్ని శంకించేలా మాట్లాడుతున్నారు. అందుకే సమాధానం చెబుతున్నా. మా బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడాడు. బంధువునని.. మాట్లాడక పోతే బాగుండేదని అలా అంటున్నాడు. గతంలో నీకు వీర విధేయుడినే..ఇప్పుడు కాదు. నన్ను నమ్మక ద్రోహం అంటున్నావు. నిన్ను జెడ్.పి.చైర్మన్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ని ఎందుకు విభేదించావు. వై.ఎస్.కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఓదార్పు యాత్ర అప్పుడు ఏమి చెప్పావు. కాంగ్రెస్ మహా సముద్రం..జగన్ ఒక నీటి బొట్టు అన్నావు. జగన్ తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని చెప్పావుగా. పొదలకూరు లో వై.ఎస్.ఆర్.విగ్రహం.పెట్ట నేయకుండా అడ్డుకున్నావు. వై.సి.పి.ఎం.ఎల్.ఏ.గా వుంటూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టిందెవరు..నువ్వు కాదా..ఇది అందరికీ తెలుసు. మాట మాటకు సమాధానం ఇస్తానన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పుట్ల కొద్దీ పిల్లల్ని కన్నడు.. ఇప్పుడు ప్లానింగ్ అంటున్నడు..
ఓ వ్యక్తి ఒకట్రెండు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్ టీం కంటే ఓ ఎక్స్‌ట్రా ప్రేయర్ అదనంగా ఉన్నట్లు 12 మందిని మనువాడాడు. పిల్లలను కూడా పదుల సంఖ్యలో కాదు.. సెంచరీని దాటి దూసుకుపోతున్న పిల్లల సంఖ్యతో అతని గురించి తెలుసుకున్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు తాత అయ్యాడు. ఈ 12 మంది భార్యలతో అతనికి 102 మంది పిల్లలు ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడిక వారిని పోషించలేకపోతున్నానని.. పిల్లలు వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నాడు. ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన ఆ పెద్దమనిషి పేరు మూసా హసస్య. మరి ఆ ఘనుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్లక తప్పదండోయ్. తూర్పు ఉగాండాకు చెందిన ముసా హసస్య కసేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు. 17 ఏళ్ల వయసులో 1972లో తొలి వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఏడాదికి తొలికాన్పులో సాండ్రా నాబ్వైర్ జన్మించింది. అయితే ఒక భార్యతో సుఖంగా ఉన్న అతనికి.. వంశాభివృద్ధి కోసం మరిన్ని వివాహాలు చేసుకోవాలని సోదరుడు, బంధువులు సూచించారు. వారి మాట నమ్మిన హసస్య.. ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. ఈ పిల్లలకు కూడా వివాహాలు అయ్యాయి. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు హసస్య తాత అయ్యాడు. వారి కుటుంబమే ఓ గ్రామమంతా అయ్యింది.
కరెంట్ స్తంభానికి ఢీకొట్టిన ఆటో..నలుగురి పరిస్థితి విషమం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో పంటలు వేసేందుకు గోవిందరావుపేట మండలం మద్దుల గూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను టీఎస్ 28టీ 2286 నంబర్ గల ఆటోలో డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ అతి వేగంతో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్‌సీ వద్ద మూల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన సునీత(38) అక్కడికక్కడే మృతి చెందింది.మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా, జ్యోతి, బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం డ్యూటీలో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అర్ధరాత్రులు నగ్నంగా డోర్ బెల్స్ కొడుతున్న మహిళ
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్లుండి కాలింగ్ బెల్ మోగింది. ఒక సారి మోగగానే ఎవరో అయి ఉంటారులే అని ఇంటి యజమాని పడుకున్నాడు. కానీ ఆగకుండా అలాగే బెల్ మోగుతుండడంతో నిద్రనుంచి లేచి కోపంగా డోర్ తెరచాడు. ఎదురుగా ఉన్న సీన్ చూసి షాక్ తిన్నాడు.. నోటి వెంట మాట రాలేదు. కాళ్లు చేతులు గడగడవణుకుతున్నాయి. కట్ చేసి చూస్తే ఎదురుగా దెయ్యం… బట్టలేవు.. జుట్టంతా విరబోసుకుని ఎదురుగా నిల్చుని ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావడంలేదు. కాసేపైన తర్వాత ఆ దెయ్యం నడుచుకుంటూ వెళ్లింది. ఊపిరి పీల్చుకుని షాకునుంచి బయటకు వచ్చి ఫాలో అయ్యాడు. అప్పుడు అర్థం అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో మిలక్ ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రుళ్లు ఓ మహిళ కొన్ని రోజులుగా ఇదే చేస్తోంది. ఆ మహిళ పలు ఇళ్ల ముందు కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు అయింది. ఈ వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. దీనిపై స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు మహిళను గుర్తించామని, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం.. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుసుకున్నామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు.
బల్దియా ఉద్యోగినిపై వేధింపులు..మహిళలు లేని చోటుకు ట్రాన్స్ ఫర్ చేయాలని
సంవత్సరాలు గడుస్తున్నా మహిళలపై జరుగుతున్న దాడులు విషయంలో మాత్రం మార్పు రావడంలో లేదు. పైగా ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతుంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కంప్లైట్లలో ఎక్కువగా మానసిక వేధింపులే. సమాజంలో నానాటికీ మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అవాంఛనీయ, హింసాత్మక ఘటనల గురించి రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇల్లు, ఆఫీసు, బడి, గుడి, బజారు ఇలా ప్రతిచోట ఏదో ఒక మూల మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇటువంటి ఘటనే హైదరాబాద్ లోని మహిళా ఉద్యోగినిపై ఓ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన జిహెచ్ఎంసిలో చోటుచేసుకుంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా కె.లావణ్య విధులు నిర్వహిస్తోంది. ఆమెపై కొంతకాలంగా అందులోనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.మోహన్‌సింగ్ తనను మానసికంగా వేధిస్తుండటంతో సహించలేకపోయింది. అతని నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయినా అతను ఆమెను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు ఇక తట్టుకోలేని లావణ్య ఆర్.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్ లోకేష్‌కుమార్.. పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్‌శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. దీంతో అతడిని జీహెచ్ ఎంసీ నుంచి తప్పించి ప్రాధాన్యత లేని, మహిళలేతర పోస్టుకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది
అమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ని పొగిడేస్తున్న జనం
ఊరు చిన్నదే అయినా.. ఆ గ్రామస్తుల మనసు చాలా పెద్దది . ఎంత పెద్దదంటే తమ పల్లెలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక చేయూత అందించేంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికీ ఎంతోమంది ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. పెళ్లీడుకు వస్తున్న అమ్మాయిని చూసి గుండె మీద కుంపటిలా చూస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆడబిడ్డ పెండ్లి చేస్తున్నారు. కానీ ఊరిలో ఆడపిల్ల పుడితే ఇంట్లో వాళ్లే కాదు ఊరంతా సంబరపడుతోంది. కుమార్తె పుట్టడం వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం వాసులు. కారణం వారి సర్పంచ్ పానుగంటి రూప. తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేసి అభయం ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేల బాండ్ ఇస్తానని సుద్దపల్లి సర్పంచి రూప ప్రకటించారు. గ్రామంలో ఈ నెల 5 నుంచి ఏడాది పాటు అమలు చేస్తామన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటంటే.. ఆడపిల్లల జననం తక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తనవంతుగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూప చెబుతున్నారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించగా.. ఏటా 20లోపు మాత్రమే ఆడపిల్లలకు సంబంధించిన జనన ధ్రువపత్రాలు తీసుకుంటున్నారని గుర్తించారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు సర్పంచి దంపతులు రూప- సతీష్‌రెడ్డి మొదటి అడుగు వేశారు. తమ పిల్లలు యోగితారెడ్డి(9వ తరగతి), రక్షితరెడ్డి(6వ తరగతి)ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు.
భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ‘ప్రగతి’కి 60 ఏళ్లు
ప్రపంచంలోని కీలకమైన పరిశ్రమల్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ ఒకటి. ఆదాయంపరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇందులో ఇండియా కూడా విశేషంగా రాణిస్తోంది. మన దేశంలో మొత్తం రెండున్నర లక్షల ప్రింటింగ్ కంపెనీలున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రగతి ఆఫ్‌సెట్ ప్రైవేట్ లిమిటెడ్ తనదైన చెరిగిపోని ముద్ర వేసింది. అత్యత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తూ 60 ఏళ్లుగా తిరుగులేని సేవలందిస్తోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారాలను, విలువ కట్టలేని ప్రశంసలను పొందింది. 49 ఇంటర్నేషనల్ అవార్డులను, 69 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్ ప్రింటింగ్ మ్యాప్‌లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 1962లో 10 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ప్రగతి సంస్థ ప్రస్థానం ఇవాళ 440 కోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకోవటం గొప్ప విషయం. ప్రస్తుతం ఈ కంపెనీ పరుచూరి నరేంద్ర సారథ్యంలో సగర్వంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. 42 ఏళ్ల కిందట.. అంటే.. 1978లో.. ప్రగతిలోకి ప్రవేశించిన పరుచూరి నరేంద్ర.. సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ విజయపథాన్ని కొనసాగిస్తున్నారు. ముద్రణా రంగంలో తన తండ్రి పరుచూరి హనుమంతరావు నెలకొల్పిన వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు.