మరోసారి మానవత్వం చాటుకున్న జగన్
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. తన కడప పర్యటనలో సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించాడు భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు. భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నానని తెలిపాడు. అయితే, తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు.
చైనాలో కరోనా కల్లోలం.. ఒకేరోజు 3.7 కోట్లమందికి కోవిడ్
కరోనాకు జన్మస్థానం అయిన చైనాను ఉప్పెనలా కమ్మెస్తోంది మహమ్మారి. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఏ దేశం చూడని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు విదేశీ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలపై చైనా స్పష్టత ఇవ్వడం లేదు. జీరో కోవిడ్ ఎత్తేసిన తర్వాత చైనా వ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారంలో ఒకే రోజు చైనాలో 3.7 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావచ్చు. డిసెంబర్ మొదటి 20 రోజల్లో చైనాలో దాదాపుగా 24.8 కోట్ల మంది అంటే దాదాపుగా జనాభాలో 18 శాతం మంది వైరస్ బారిన పడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అంతర్గత సమావేశాల్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు జనవరి నుంచి మార్చి మధ్యలో చైనాలో మూడు కరోనా వేవ్ లు దాడి చేస్తాయని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
పారిస్ లో కాల్సుల కలకలం.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్ రాజధాని పారిస్ గన్ కాల్పులతో దద్దరిల్లింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ నగరం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శుక్రవారం సెంట్రల్ ప్యారిస్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గన్ తో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నగరంలోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల్లో కాల్పుల ఘటన జరిగినట్లు ఫ్రెంచ్ టెలివిజన్ నెట్‌వర్క్ బీఎంఎఫ్ టీవీ నివేదించింది. గన్ ఫైరింగ్ తరువాత భద్రతా బలగాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని వారికి ధన్యవాదాలు తెలిపారు ఫ్రాన్స్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్. పారిస్ పోలీసులు ఘటన జరిగినప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత సాయుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడి వయసు 60 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఏ ఉద్దేశ్యంతో కాల్పులు జరిపాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
బాలయ్యతో పవన్..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కలవని కలయికలు కలిసినప్పుడు అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలిద్దరు ఒకే స్టేజిపై కనిపిస్తే అభిమానులకు పండుగే. ప్రస్తుతం ఆ పండుగే చేసుకుంటున్నారు నందమూరి- మెగా ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ గెస్ట్ గా వస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుంది. ఇక దానికి ముందే ఈ కాంబో కలిసి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బాలయ్యను పవన్ కలిశారు. కొద్దిసేపు ఆయన చిత్ర బృందంతో ముచ్చటించారు. ప్రస్తుతం బాలయ్య వీరసింహరెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అనుకోకుండా జరిగిందో.. కావాలనే జరిగిందో తెలియదు కానీ.. వీరసింహారెడ్డి షూట్ లో పవన్ ప్రత్యక్షమయ్యారు. ఇక ఒకే ఫ్రేమ్ లో బాలయ్య- పవన్ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
జనవరిలో సీఎస్ ల భేటీ.. జవహర్ రెడ్డి రివ్యూ
ఢిల్లీలో జనవరిలో రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. సీఎస్ ల సమావేశంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయం నుంచి వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, సంబంధిత శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు. జనవరి మొదటి వారంలో జరగనున్న 2వ జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఏం చర్చించాలనేది ఎజెండా రూపొందించనున్నారు. ఈసమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, పీఎం ముఖ్య కార్యదర్శి డా.పి కె.మిశ్రా వీసీ చర్చించారు. జనవరి 5 నుండి 7వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సిఎస్ ల సమావేశం జరగనుంది. వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ అంశాలపై సిఎస్ లు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ. ఇన్నోవేటివ్ విధానాలతో రావాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు రాజీవ్ గౌబ.
టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడేళ్ల విరామం తర్వాత 2023 మార్చి నెలలో నిర్వహించబడనుంది. డిగ్రీ మరియు యూనివర్శిటీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా అర్హతను తనిఖీ చేయడానికి పరీక్ష విధానంలో రెండు పేపర్లు చేర్చినట్లు ఉస్మానియా యూనివర్శిటీ పేర్కొంది. పేపర్-I మొత్తం 100 మార్కులతో 50 ప్రశ్నలను కలిగి ఉంటుంది. పేపర్-II 100 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల పరీక్ష వ్యవధి ఉంటుంది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్
మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొంత మంది నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్లుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. గడ్చిరోలి పోలీస్ సీ-60 యూనిట్, చత్తీస్ గఢ్ డీఆర్జీ పోలీసులు సరిహద్దులోని దమ్రంచ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. నక్సలైట్లు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సలైట్లు ఆరోమేటిక్ రైఫిళ్లను ఉపయోగిస్తూ పోలీసులపైకి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్‌పాల్ తెలిపారు. గడ్చిరోలి పోలీసులు, బీజాపూర్ పోలీసుల బృందాలు దమ్రంచ అడవుల్లో పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశంలో రైతుబంధు
దేశంలో పెద్ద మార్పు రావాలని, పేదలు,రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని.. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశానికి అందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఆయన వెల్లడించారు. హర్యానా,పంజబ్, బీహార్,కర్ణాటక,తెలంగాణ, మహారాష్ట్ర పై మొదటగా దృష్టి సారించాం అని..ఆరు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని.. రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల మంచి స్పందన ఉందన్నారు. దేశంలో ప్రతీ మూలకు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తామని అన్నారు. త్వరలోనే కేసీఆర్ బీఆర్ఎస్ విధానాలను ప్రకటిస్తారని తెలిపారు.
భారత్ జోడో యాత్ర.. రేపు రాహుల్ గాంధీతో పాల్గొననున్న కమల్ హాసన్..
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ప్రస్తుతం హర్యానాకు చేరింది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు రేపు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మక్కల్ నీది మయ్యం(ఎంకేఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ గతంలో కోరారు. డిసెంబర్ 24న దేశ రాజధానిలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని కమల్ హాసన్ ఎంకేఎం ఆఫీస్ బేరర్ సమావేశంలో అన్నారు. దేశ రాజధానిలో జరిగే యాత్రలో కనీసం 40,000 నుంచి 50,000 మంది యాత్రికులు పాల్గొంటారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి తెలిపారు.