బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న నడ్డా
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన పాదయాత్ర 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఐదో విడత ప్రజా పోరాట యాత్ర నేడు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ముగింపు సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40 కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
డా.వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డిక సహా ఆరుగురికి రిమాండ్
భాగ్యనగరంలో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రమీంపట్నం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే సమయంలో 58 నిమిషాల వీడియో విడుదల చేస్తే.. అందులో రెండు నిమిషాలే పోలీసులు మీడియాకు విడుదల చేశారని నవీన్ రెడ్డి ఆరోపించాడు. భయం వేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో నవీన్ రెడ్డిపై వరంగల్, విశాఖపట్నం, ఆదిభట్లలో నమోదైన వాటితో కలిపి 4 కేసులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. పరారీలో ఉన్న రుమన్, పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.ఈనేపథ్యంలో మంగళవారం సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరవేశాడు నవీన్ రెడ్డి. తనే, బాధితుడినంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈవీడియో సంచలనంగా మారింది. ఇక, 6 రోజులుగా ఇతడి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దవున్న ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, రాత్రి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.
విశాఖ ఆర్కే బీచ్ లో రెచ్చిపోయిన యువతి.. పోలీసుపై దాడి
విశాఖలో తానేం తక్కువ తాగలేదు అని ఓ యువతి తనని తాను నిరూపించుకుంది. గంజాయి, బీరు తాగిన మైకంలో ఓ యువతి హల్చల్ చేసింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద యువతి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గంజాయి మద్యం మత్తులో దుర్భాషలాడి త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నిన యువతి ఉదంతం కలకలం రేపింది. నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంది అమూల్య. రేపటి నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మైకంలో సవాల్ విసిరింది అమూల్య. ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతుండగా పోలీసులు చూశారు. నైట్ రౌండ్స్ లో ఉన్న ఏఎస్ఐ ఆమెను చూసి వెళ్లి ప్రశ్నించగా బీర్ బాటిల్ తో పోలీస్ పై దాడి చేసింది. త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డురావడంతో అతని కన్నుపై బీరు బాటిల్ తగిలి గాయం అయింది. పైగా బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే యువతి తాగిన మత్తు వ్యాల్యూ 149 వచ్చింది.దీంతో అమూల్య పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. రాత్రి స్టేషన్ లో ఉంచకూడదని ఆమెని పంపించేశారు. ఉదయం రావాలని ఆదేశించారు. ఈఘటన విశాఖలో సంచలనంగా మారింది.
ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణ.. భక్తులకు ఇక్కట్లు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం డిసెంబర్ మాసం వచ్చిందంటే భవానీ దీక్షల విరమణతో సందడిగా ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభం అయ్యాయి….దీక్ష విరమణలకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు….ఉదయం ఆరున్నరకు మూడు హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్ష విరమణలను వైదిక కమిటీ ప్రారంభించింది…ఇవాల్టి నుండి 19 వరకు మండల,అర్ధ మండల దీక్ష విరమణలు జరగనున్నాయి….మొదటి రోజే భవాని భక్తుల రద్దీ తో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. సర్వదర్శనానికి రెండు క్యూ లైన్స్ మాత్రమే ఇవ్వటంతో క్యూ లైన్స్ లో భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు…గంటల పాటు క్యూలైన్స్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని కనీసం మంచినీరు కూడా ఇచ్చేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో కిక్కిరిసిపోయాయి క్యూలైన్లు. దుర్గమ్మ దర్శనం కోసం అర్ధరాత్రి నుండే క్యూ లైన్స్ లోనే భక్తులు వేచి వున్నారు. ఉచిత దర్శనానికి రెండు క్యూ లైన్స్ మాత్రమే ఇవ్వటంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు భక్తులు. వేల సంఖ్యలో భవానీ మాలవిరమణకు తరలి వస్తున్నారు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో దర్శనానికి ఇక్కట్లు తప్పటం లేదని భక్తులు మండిపడుతున్నారు.
చిక్కుల్లో పడేసిన వేట.. రాళ్లమధ్యలో 24 గంటలు నరకం
హ్యాపీగా షికారుకు వెళ్లాలి అనుకునే వారికి కొన్ని సందర్భాల్లో ఆషికారే నరకకూపంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. ఆచిక్కుల్లో పడ్డప్పుడు మనకు రక్షించే వారు ఉంటే మనం బతికి బట్టకలిసినట్లే కానీ ఆపరిసర ప్రాంతాల్లో రక్షించేవారు లేకుంటే ఇక మన జీవితంపై ఆశ వదులుకోవాల్సిందే. కానీ.. ఓ ప్రబుద్ధుడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లు ఉంది అతను బతికేశాడు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం వేట కోసం అడవి వైపు వెళ్లాడు. అయితే ఘన్‌పూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా ఓ చోటు రాళ్ల గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది.. ఆరాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న సమయంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారిపోయి రాళ్లమధ్యలో పడిపోయింది దీంతో ఆఫోన్ అందుకునే క్రమంలో రాజు జారి రాళ్లమధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు. లోతైన రంధంలో పడిపోయి బయటకు వచ్చే అవకాశం లేక కాపాడండి ప్లీజ్.. ఎవరైనా ఉన్నారా? అంటూ ఆర్తనాదాలు చేస్తూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. రాత్రైనా రాజు ఇంటికి రాలేకపోయే సరికి కుటుంబ సభ్యులు అడవంతా గాలించారు అయినా రాజు జాడ దొరకలేదు.
కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం… కోళ్ళు, బాతులకు కష్టకాలం
కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేరళలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు అధికారులు. దీంతో దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ అనే రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలు, జంతు సంక్షేమ శాకలను ఆదేశించింది. బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చిన ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కోడి, బాతు, కోడిగుడ్లు, మాంసం అమ్మకాలు, దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని 19 గ్రామపంచాయతీల్లో కోడి, బాతులు, ఇతర పెంపుడు పక్షల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.
పఠాన్ మూవీకి నిరసన సెగ
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘ పఠాన్’ మూవీకి నిరసన సెగ తగులుతోంది. మరో బాలీవుడ్ సినిమాకు ‘బాయ్ కాట్’ సెగ తగులుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్ గా ఉంది. బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పఠాన్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘బేషరమ్’ సాంగ్ విడుదల అయింది. ఈ పాటలో దీపికా పదుకొణె చాలా హాట్ గా బికినీలో నటించింది. అయితే దీనిపై రచ్చ మొదలైంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలిగిస్తేనే సినిమాకు అనుమతి ఇస్తాం అని లేకుంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. ఈ పాటలో దీపికా పడుకొణె కాషాయ రంగులో బికనీ ధరించి ఈ పాటలో కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతోంది.
ఫిఫా వరల్డ్ కప్.. మొరాకోను మట్టికరిపించిన ఫ్రాన్స్
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన మొరాకోను మట్టికరిపించింది ఫ్రాన్స్. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మొరాకో ఆశలపై ఫ్రాన్స్ నీళ్లు చల్లింది. ఆదివారం అర్జెంటీనాతో తలపడననుంది ఫ్రాన్స్. హోరాహోరీగా జరిగి సెమీఫైనల్ మ్యాచులో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను ఓడించింది. థియో హెర్నాండెజ్, రాండల్ కోలో మువానీ చేసిన గోల్‌లతో ఫ్రాన్స్ మొరాకో ప్రపంచ కప్ కలను చెరిపేసింది. ఏడు ఎడిషన్లలో ఇది ఫ్రాన్స్ నాలుగు సార్లు ఫైనల్ కు చేరింది. మెస్సీతో కూడిన అర్జెంటీనా జట్టుపై గెలిచి వరల్డ్ కప్ సాధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది. గ్రూప్ దశలో బెల్జియంను ఓడించి, స్పెయిన్, పోర్చుగల్‌లను ఓడించి మొరాకో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. బలమైన జట్లను ఓడిస్తూ సెమీస్ కు చేరుకుంది మొరాకో. ఆఫ్రికా నుంచి సెమీస్ చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. మ్యాచ్ మొత్తంలో ఎక్కువ సమయంలో బాల్ మొరాకో జట్టు ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఫ్రాన్స్ ఢిపెన్స్ ను దాటుకొని గోల్ చేయలేకపోయింది.