టీడీపీ వారే రెచ్చగొట్టారు.. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడింది..!
మాచర్లలో జరిగిన ఘర్షణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.. అయితే, చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనే.. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు లేవన్న ఆయన.. మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.. వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు? నిజాలు విచారణలో తేలుతాయని స్పష్టం చేశారు. అసలు పిన్నెల్లి ఆ రోజు సీఎంవోలోనే ఉన్నారు.. గడప గడపకు కార్యక్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారని ఆరోపించారు సజ్జల.. ఇక, వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలే ప్రధాన లబ్దిదారులుగా తెలిపారు.. టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదని విమర్శించిన ఆయన.. దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసే ఉండొచ్చు అన్నారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని క్లారిటీ ఇచ్చారు.
చైనా కుయుక్తులు..సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపు
జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో వీటిని మోహరించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో చైనా బంగ్డా ఎయిర్ ఎయిర్‌బేస్ లో అత్యాధునిక WZ-7 ‘సోరింగ్ డ్రాగన్’ డ్రోన్ ను ఉంచింది. 2021లో తొలిసారిగా ఈ డ్రోన్ ను చైనా ఆవిష్కరించింది. ఏకంగా 10 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎగరడం దీని ప్రత్యేకత. నిఘాతో పాటు క్రూయిజ్ క్షిపణులను ఇది భూమిపై లక్ష్యాలపై ప్రయోగించగలదు. అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవు. అయితే ప్రస్తుతం ఇండియా ఎయిర్ ఫోర్స్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ తో కలిసి కొత్త తరం డ్రోన్లను తయారు చేస్తోంది.
బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర అసెంబ్లీకి తన రెండున్నర నెలల పాపతో మహిళా ఎమ్మెల్యే వచ్చారు. డియోలాలి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ ) ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ అహిరే శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు చంటి బిడ్డతో వచ్చారు. బిడ్డను చేతిలో పట్టుకుని అసెంబ్లీలో నడుస్తున్న ఎమ్మెల్యే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చంటిపాపతో చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కోవిడ్ తర్వాత రెండేళ్లకు నాగ్ పూర్ లో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఈ సారి సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని అనుకున్నానని ఎమ్మెల్యే సరోజ్ వెల్లడించారు. నేను తల్లిని, ప్రజాప్రతినిధిని. కరోెనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్లుగా నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదని ఆమె అన్నారు. నేను ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి, నా ఓటర్లు సమాధానాలు పొందేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె అన్నారు.
కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది
Harish 1
తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతుంది అంటే అది కేసీఆర్ వల్లనే అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి హరీష్ రావు. అంతకుముందు హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గజ్వేల్ లో క్రైస్తవ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలు పంపిణీ, విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ లో చెలరేగిన చిచ్చు.. రేపు సీనియర్ల భేటీపై ఉత్కంఠ
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ.. వలస నేతలతో పాటు అసలు కాంగ్రెస్ వాళ్లకు కూడా అన్యాయం జరుగుతుందనే ఉమ్మడి స్వరం వినిపించింది. అసలు కాంగ్రెస్ వాళ్లదేనన్నారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మరోవైపు ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశానికి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేతలు హాజరుకాలేదు. సీనియర్ నేతల వ్యాఖ్యలపై రేవంత్ వర్గం నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేపథ్యానికి చెందిన 12 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్లు అయిందని సీనియర్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలను తెలంగాణ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించారు.ఈ క్రమంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా పరిశీలించనుంది. అసంతృప్త నేతలతో సమావేశం కావాలని ఇంచార్జి కార్యదర్శులకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డిపై మల్లురవి ఫైర్.. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతారా అని ఆగ్రహం
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని కోమటిరెడ్డి మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నోరు జారి ఇష్టమున్నట్టు మాట్లాడితే నాలుక చీరుస్తాం జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెట్టిన రాజకీయ బిక్షతో పదవులు పొంది ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా, ఎంపీ గా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, డబ్బులకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యలనించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు లు పొంది వేల కోట్లు సంపాదించిన రాజగోపాల్ రెడ్డి నేడు పదవులు, సంపద ఇచ్చిన కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కుట్ర చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అవుతుందని మండిపడ్డారు.
చైనాకు తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు.. ఇండియాలోనే ఉంటా
తాను చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, ఇండియాలోనే ఉంటానని బౌద్ధ గురువు దలైలమా సోమవారం స్పష్టం చేశారు. భారత్‌ను అత్యుత్తమ దేశంగానూ అభివర్ణించిన ఆయన.. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలతో పాటు చైనాలోనూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ నేను చైనాకు తిరిగి వెళ్లను. భారత్‌లోనే ఉంటాను, ఇదే ఉత్తమమైన దేశం, కాంగ్రా-పండిట్ నెహ్రూనే నా శాశ్వత నివాసం’’ అంటూ దలైలమా చెప్పుకొచ్చారు. కాగా.. టిబెట్‌కు చెందిన 14వ దలైలమా 1959 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. 1951లో టిబెట్‌ను చైనా ఆక్రమించి, అప్పటి నుంచి పాలన కొనసాగించడం మొదలుపెట్టింది. వారి జాతీయ, సాంస్కృతిక గుర్తింపులను, సాంప్రదాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా.. చైనా ఈ దురాక్రమణకు దిగింది. అయితే.. చైనా ప్రభుత్వాన్ని తిరిగి వెనక్కు పంపించేందుకు టిబెటన్లు తిరుగుబాటు చేశారు. కానీ.. ఇందులో వాళ్లు విజయం సాధించలేదు
సేమ్ టు సేమ్… సచిన్ కు జరిగిందే.. మెస్సీకి జరిగింది
క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ అనేక సారూప్యతలు ఉన్నాయి. క్రికెట్‌లో సచిన్ జెర్సీ నంబర్ 10 అయితే.. ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10. వీళ్ల మధ్య ఇంకా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ 8 ఏళ్లకు జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. అలాగే 2014లో ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన అర్జెంటీనా మళ్లీ 8 తర్వాత జరిగిన ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అంతేకాకుండా 2003 ప్రపంచకప్‌లో సచిన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. 2014 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోనూ మెస్సీ గోల్డెన్ బాల్ విన్నర్‌గా నిలిచాడు. కాగా ఎట్టకేలకు క్రికెట్‌లో సచిన్ తన ప్రపంచకప్ కల నెరవేర్చుకున్న తరహాలో మెస్సీ కూడా తన జట్టుకు వరల్డ్ కప్ అందించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. అయితే 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత సచిన్ కొన్నాళ్ల పాటు వన్డేలు ఆడినట్లే ఇప్పుడు మెస్సీ కూడా మరికొంతకాలం ఫుట్‌బాల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని మెస్సీ చెప్పడంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.