ప్రధాని మోడీ ఈఏడాది చివరి మన్ కీ బాత్.. ఏం చెప్పారంటే?
కోవిడ్-19 వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల మహమ్మారి వ్యాప్తికి కారణమైన కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వం వైరస్‌కు వ్యతిరేకంగా చర్యలను వేగవంతం చేసింది. 2022 భారతదేశానికి అనేక విధాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని అన్నారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లతో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దేశం ఐదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు. అంతరిక్షం, రక్షణ, డ్రోన్ రంగాలలో కొత్త పురోగతిని సాధించింది.
రేపు శ్రీశైలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఆంక్షలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతిర్లింగము శక్తిపీఠము కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ , ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు, ఏపీ సరిహద్దు ప్రాంతం శిఖరం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి శ్రీశైలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి లింగాలగట్టు, శిఖరం వద్ద రాకపోకలకు అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలకు ముందుగానే వచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు పోలీసులు.
కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి.. పేరేంటంటే?
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీతో బంధంపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను బీజేపీ సభ్యుడిని కాదని.. కానీ చాలా మంది తాను ఆ పార్టీకి చెందిన వాడినే అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆ ప్రచారానికి ఈ రోజు తెర దించుతున్నానని.. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి పల్లెకు, గడప గడపకు వెళ్తానని ఆయన చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుందని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు
పదవిలో ఉన్నా లేకున్నా..ప్రజలకు తోడుగా ఉంటా
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ నేతలు ఎవరో కాదు.. కడియం శ్రీహరి, రాజయ్య. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్మడపల్లి (ఐ) లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను పదవి ఉన్నా లేకున్నా నా శక్తి మేరకు ప్రజలకు తోడుగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నా అన్నారు శ్రీహరి. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా పనిచేసే ఆలోచన ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నామా , దాచుకున్నామా అనేది కాకుండా అధికారాన్ని ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవు పలికారు. దాదాపు 15 సంవత్సరాలవుతుంది… నేను ఎమ్మెల్యేగా లేను. మీ దగ్గరకు రాలేదు కానీ నన్ను చూడగానే మీరు చేసిన అభివృద్ధి మాత్రమే అని ప్రజలు నాకు చెప్తుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఏ వృత్తిని ఎంచుకున్నా ఏ రంగంలో ఉన్నా ప్రజలకు సేవ చేసి ఆ సంతృప్తి పొందాలన్నారు కడియం శ్రీహరి.
400 వందల కోసం గొడవ.. లారీ కిందతోసి హత్య
ప్రజల్లో క్రూరత్వం రోజురోజుకూ పెరిగిపోతోంది. క్షణికావేశంలో ఇతరుల ప్రాణాలు తీయడానికి తిరుగు లేదు. డబ్బు కోసమో, భూమి కోసమో.. ఏ కారణం చేతనైనా ఇతరుల ప్రాణాలు తీస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. బంధాలు, బాంధవ్యాలు మరిచి ఓ దుండగుడు ఆర్థిక లావాదేవీల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని హత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాలానగర్‌లో జరిగిన దారుణ హత్య స్థానికంగా చాలాకలకలం రేపుతోంది. కాశీరాం, శ్రీనివాస్‌లు బాలానగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రూ.400 కోసం గొడవ జరిగింది. డబ్బుల వివాదం కాస్త రచ్చ రచ్చగా మారింది. నర్సాపూర్ కూడలిలో కాశీరాం శ్రీనివాస్ పై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పటికి కోపం చల్లారకపోవడంతో కాశీరాం శ్రీనివాస్‌ను వస్తున్న లారీ కిందకు తోసేశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సీరియల్ నటి ఆత్మహత్యలో “లవ్ జిహాద్” కోణం
సీరియల్ నటి తునీషా శర్మ మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె మరణంలో లవ్ జిహాద్ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో తునీషా శర్మ ఓ టీవీ షో సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ అనే టీవీ షోలో తునీషా శర్మ సహ నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ వల్లే తను ఆత్మహత్యకు పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా తునీషా తల్లి ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు అయింది. పోలీసులు మహ్మద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత 15 రోజుల క్రితం వీరిద్దరు విడిపోయారని, ఈ ఆత్మహత్యకు మహ్మద్ ఖానే కారణం అని ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే( బీజేపీ) రామ్ కదమ్ ఈ ఆత్మహత్యలో ‘లవ్ జిహాద్’కోణం ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తామని.. అన్ని కోణాల్లో పరిశీలిస్తామని.. దోషులను విడిచిపెట్టబోమని, తునీషా శర్మ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఆత్మహత్యకు కారణాలు ఏమిటి..? ఇందులో లవ్ జిహాద్ ఉందా..? లేక మరేదైనా సమస్య ఉందా..? అనేది దర్యాప్తులో తేలుతుందని తునీషా కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ఆర్జీవీ నీ పనికిమాలిన టైం మాకు ఇవ్వు…
రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా ‘మసూద’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన ‘మసూద’ సినిమా హారర్ జానర్ లవర్స్ ని మెప్పిస్తోంది. హారర్ కామెడి, హారర్ లవ్ లాంటి మిక్స్డ్ జానర్ సినిమాలు వస్తున్న టైంలో సినీ అభిమానులకి వెన్నులో వణుకుపుట్టించే రేంజులో వచ్చిన సినిమా ‘మసూద’. థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోని ఇటివలే ‘ఆహా’లో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా ఇంత సౌండ్ చెయ్యడం ఇదే మొదటిసారి.
వీరసింహారెడ్డి షూటింగ్ లో క్రిస్మస్ సంబరాలు
‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. హీరోయిన్ శృతి హాసన్, బాలకృష్ణల పైన ఈ సాంగ్ ని రూపొందిస్తున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్, క్రిష్ లు బాలయ్యని కలిసింది కూడా ఈ సెట్స్ నుంచే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖొరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ సెట్స్ లోనే ‘క్రిస్మస్’ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేసిన బాలకృష్ణ, ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ పేరు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ‘మా బావ మనోభావాలు’ సాంగ్ బయటకి రావడమే ఇందుకు కారణం. ఒక పర్ఫెక్ట్ ఐటెం సాంగ్ ని ఇచ్చిన తమన్, నందమూరి అభిమానుల్లో జోష్ తెచ్చాడు. ‘మా బావ మనోభావాలు’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ‘మా బావ మనోభావాలు’ సాంగ్ 5.5 మిలియన్ వ్యూస్, 125k లైక్స్ ని రాబట్టి మాస్ ని మెప్పిస్తోంది.