ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్, ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి సింగ్ కథానాయికగా నటించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ, ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్‌లైన్‌తో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
“చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే ఇష్టం. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ‘ఆచార్య’ షూటింగ్ సమయంలో ఆయనతో మాట్లాడిన అనుభవం మరపురానిది. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. పలు డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్‌గా, ఆర్టిస్ట్ అసిస్టెంట్ గా కూడా పనిచేశా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించా. నిర్మాత బంగార్రాజు సహకారంతో ‘మధురం’లో హీరోగా అవకాశం వచ్చింది,” అని ఉదయ్ రాజ్ తెలిపారు.
“దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఉత్సాహం కలిగింది. 90ల నేపథ్యంలో సాగే ఈ కథ, పదో తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య ప్రేమ కథగా ఆకట్టుకుంటుంది. నేను మూడు విభిన్న లుక్స్‌లో కనిపిస్తాను—చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మధ్య వయస్కుడిగా. ఈ గెటప్స్ కోసం చాలా కష్టపడ్డాను. కొన్ని సన్నివేశాల కోసం చబ్బీగా కనిపించాల్సి వచ్చింది, మళ్లీ సన్నగా కనిపించేందుకు ఆహారం మానేసి కొన్ని రోజులు నీరు మాత్రమే తాగాను,” అని వివరించారు.
“నాకు ఏ అవకాశం సులభంగా రాలేదు. చాలా కష్టపడితేనే అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విషయంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాను. కానీ, నిర్మాత బంగార్రాజు గారు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసి, ధైర్యం ఇచ్చారు. నాతో పాటు దర్శకుడు రాజేష్, సంగీత దర్శకుడు వెంకీ వీణ గారు సహా అంతా కొత్తవారమైనా, బంగార్రాజు గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు,” అని తెలిపారు. “హీరోగానే కాకుండా, ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న రోల్ అయినా సరే, సవాలుగా తీసుకుంటాను,” అని చెప్పారు.