Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.
Read Also: Catherine Tresa : ‘మెగా’ ఆఫర్ కొట్టేసిన బన్నీ హీరోయిన్..
‘‘ఈ దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ప్రభుత్వం దీనిని అంగీకరించింది. వారికి దీని గురించి తెలిస్తే ఎందుకు ఏం చేయలేదు.? దాడికి మూడు రోజుల ముందే ప్రధాని మోడీకి ఇంటెలిజెన్స్ నివేదిక పంపించినట్లు నాకు సమాచారం అందింది. అందువల్లే ఆయన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిని నేను ఒక న్యూస్ పేపర్‌లో చదివాను’’ అని ఖర్గే అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిలో నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించిందని ఖర్గే చెప్పారు.
దాడి తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు సమాధానంగా.. పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. పహల్గామ్‌లో ఘోరమైన ఉగ్రవాద దాడికి కొన్ని రోజుల ముందు.. పర్యాటకులను, ముఖ్యంగా జబర్వాన్ శ్రేణి పర్వత ప్రాంతంలోని శ్రీనగర్ శివార్లలోని హోటళ్లలో బసచేసే వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి.