తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చీ రాగానే ఈ పాట విశేషాదరణ పొందుతూ, కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఈ పాటకు “దిగు దిగు దిగు నాగో నాగన్నా… దివ్యాసుందర నాగో నాగన్నా…” అనే జానపదం స్ఫూర్తి. ఈ జానపద గీతం నలుపు-తెలుపు చిత్రాల కాలంలోనే సినిమాల్లో పల్లవించింది. ఇప్పుడు మళ్ళీ సందడి చేస్తోంది.
‘దిగు దిగు నాగ…’ బాణీలోనే వేటూరి సుందర రామ్మూర్తి ‘దిగు దిగు భామ…’ అంటూ పదాలు పేర్చి చిరంజీవి ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’లో పాట రాసేసి అలరించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలచింది. ఇక సినిమాలో చిరంజీవి, విజయశాంతి ఈ పాటకు చేసిన డాన్సునూ జనం మరచిపోలేదు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలచింది. ఆ తరువాత రెండేళ్ళకు శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్పయాగం’లో “దిగు దిగు నాగ… నెత్తి మీది డేగ… దిమ్మెర పడిపోగా…” అంటూ సి.నారాయణ రెడ్డి పలికించిన పాటకు విద్యాసాగర్ బాణీలు కట్టారు. ఆ పాట సైతం అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మళ్ళీ థమన్ ఆ పాటను పట్టుకు వచ్చారు. థమన్ బాణీలకు తగ్గట్టుగా అనంత్ శ్రీరామ్ “దిగు దిగు నాగ…” జానపదానికి తగ్గ పదాలు పేర్చారు. కేవలం పల్లవిలో మాత్రమే జానపద గీతంలోని పదాలను ఉపయోగించుకొని, తరువాత అంతా సినిమాకు తగ్గట్టుగా గీత రచన సాగింది.
‘వరుడు కావలెను’లోని “దిగు దిగు నాగ…” పాట ప్రస్తుతం భలేగా ఆకట్టుకుంటోంది. ఇలాగే సినిమా సైతం సందడి చేస్తే మంచి విజయం కోసం ఎదురుచూస్తోన్న నాగశౌర్య ఓ హిట్టు పట్టేసినట్టే!