కోలీవుడ్ లో క్రేజీ హీరో శివ కార్తికేయన్. చిన్న ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, ఇవాళ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ‘డాక్టర్’ అనే మూవీలో నటించాడు. అనిరుధ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ సినిమా ఈ యేడాది మార్చి 26న విడుదల కావాల్సింది. కానీ తమిళనాడులో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా అనుకున్న తేదీన ఈ మూవీ విడుదల కాలేదు. ప్రియా మోహన్ హీరోయిన్ గా నటించిన ‘డాక్టర్’ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లోని తాజా సమాచారం ప్రకారం డైరెక్ట్ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. అతి త్వరలోనే ఈ సంస్థ ‘డాక్టర్’ను తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ అనువదించి స్ట్రీమింగ్ చేయబోతోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని తెలుస్తోంది.