బుల్లితెర కథానాయిక, వెండితెరపై ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మౌనీ రాయ్ మొత్తానికీ పెళ్ళిపీటలు ఎక్కేసింది. మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను గోవాలో జనవరి 27న పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం బెంగాలీ, మలయాళ సంప్రదాయంలో జరిగింది. మౌనీరాయ్ ది బెంగాల్ కాగా, దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సూరజ్ ది కేరళ. చిన్నప్పటి నుండే నటన అంటే మక్కువ ఉన్న మౌనీరాయ్… కెరీర్ ను టీవీ సీరియల్స్ తో ప్రారంభించింది.
అక్కడ వచ్చిన గుర్తింపుతోనే అక్షయ్ కుమార్ సరసన ‘గోల్డ్’మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇక ‘కేజీఎఫ్ చాప్టర్ 1’లో ఇక్కడ తమన్నా ఐటమ్ సాంగ్ లో నర్తించగా, హిందీ వర్షన్ లో మౌనీరాయ్ చేసింది. డాన్సర్ గానూ పలు బుల్లితెర కార్యక్రమాలలో గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్ మొత్తానికి 36 సంవత్సరాల వయసులో సూరజ్ తో మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది. నిజానికి గత యేడాదిలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. వాటిని మౌనీరాయ్ అప్పట్లోనే ఖండించింది. మొత్తానికి ఆ వార్తలు నిజం చేస్తూ ఈ రోజు వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.