కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే! నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, కంగనా ఏనాడూ మహేశ్ ని, ఆలియాని మన్నించలేదు. వీలైనప్పుడల్లా ఏకి పారేసింది. ఆమెతో బాటూ ఆమె సోదరి రంగోలీ ఛండేల్ కూడా భట్ ఫ్యామిలీని సొషల్ మీడియాలో చాలా రోజులు టార్గెట్ చేసింది…
కంగనా, రంగోలి మాటలతో హర్టైన ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ 2006లో ఓ ట్వీట్ చేసింది. మహేశ్ భట్ తనకి బ్రేక్ ఇచ్చినా కూడా కంగనా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని ఆమె అంది. అంతే కాదు, మహేశ్ భట్ తో పాటూ ఆయన భార్యని, కూతుర్ని కూడా కంగనా టార్గెట్ చేస్తోందంటూ సోనీ రాజ్దాన్ ఆరోపించింది. కానీ, కంగనా తరుఫున రంగోలీ ధీటుగా సమాధానం ఇచ్చింది!
‘వో లమ్హే’ సినిమా డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ మహేశ్ భట్ కాదనీ వివరించింది రంగోలి. కాబట్టి సినిమాలో ఆఫర్ ఆయన ఇవ్వలేదని, బ్రేక్ ఇచ్చినట్టు కూడా కాదని ఆమె స్పష్టం చేసింది. ఇక కంగనాకు అసలు తొలి చిత్రం అందించింది అనురాగ్ బసు అంటూ కుండ బద్ధలు కొట్టింది కంగనా సోదరి. విషయాన్ని మరింత విషదపరుస్తూ వివరణ ఇచ్చిన రంగోలి… ‘వో లమ్హే’ తరువాత కంగనా మహేశ్ భట్ తో పనిచేయనుందని చెప్పింది. అందుకు కోపగించిన భట్ ఆమె ప్రీమియర్ షోకి వస్తే చెప్పు విసిరేసి దుర్భాషలాడాడని పేర్కొంది. స్పెషల్ షో చూడనీయకుండానే కంగనాని మహేశ్ భట్ తిప్పి పంపాడట. అప్పట్నుంచీ కంగనాకి, భట్ ఫ్యామిలీకి పర్మనెంట్ గా శత్రుత్వం ఏర్పడిపోయింది! అదీ అసలు సంగతి.