‘సరిలేరు నాకెవ్వరు’ అంటూ సాగిపోతోంది ‘భీష్మ’ బ్యూటీ రశ్మిక మందణ్ణా. కన్నడలో మొదలైన ఆమె ప్రస్థానం తెలుగులో సూపర్ హిట్ చిత్రాలతో సాగింది. దాంతో స్టార్ గా ఎదిగిన ‘ఛలో’ బ్యూటీ ‘ఛలో ఛలో’ అంటూ కోలీవుడ్ లో కాలుమోపింది. కార్తీతో ‘సుల్తాన్’లో నటించింది సుకుమారి. అయితే, కన్నడ, తెలుగు, తమిళంతో ఆగాక మన అందాల తుఫాను ముంబైని కూడా తాకింది. రశ్మిక ఇప్పుడు ముంబైలో మకాం వేసి హిందీ సినిమాలు చక్కబెడుతోంది! ఆల్రెడీ ‘టాప్ టక్కర్’ ఆల్బమ్ లో తళుక్కుమన్న బెంగుళూరు బేబీ నెక్ట్స్ రెండు బాలీవుడ్ చిత్రాల్లో కథానాయికగా అలరించనుంది!
సక్సెస్ లో ఉన్న హీరోయిన్ అన్నాక అభిమానులు పోగవకుండా ఉంటారా? అదీ రశ్మిక లాంటి బబ్లీ బ్యూటీకి ఫ్యాన్స్ కరువా? కానీ, ఆకాశ్ త్రిపాఠీ అనే ఓ వీరాభిమాని రశ్మిక లక్షలాది ఫ్యాస్స్ లో ఒకరు కాదు! ఆయన కొంచెం డిఫరెంట్! తేడా అని కూడా అనొచ్చు! ఇంతకీ, ఆకాశ్ త్రిపాఠి ఉరఫ్ రశ్మిక డై హార్డ్ ఫ్యాన్ ఏం చేశాడంటే…
ఆకాశ్ త్రిపాఠీ దేశమంతటా లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు సాగుతుండగానే తన అభిమాన సుందరిని కలుసుకుంటానని కర్ణాటక బయలుదేరాడట. 900 కిలో మీటర్లు రకరకాల పద్ధతుల్లో ప్రయాణించాడు. ట్రైన్ లు, బస్సులు సరిగ్గా లేని కరోనా కాలంలో వీరాభిమాని ఎలా ముందుకు సాగాడో మనకు తెలియదుగానీ… ఆయన రశ్మిక ఇంటి అడ్రస్ అడుగుతూ తిరుగుతోంటే కొందరికి అనుమానం వచ్చిందట! వెంటనే విషయం పోలీసులకి తెలిసంది. వాళ్లు ఆకాశ్ త్రిపాఠీని అరెస్ట్ చేశారు. మొత్తం కూపీ లాగారు. చివరకు తెలిసింది పాపం ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదనీ… మిస్ మందణ్ణాని మీట్ కావటమే ఆయన లక్ష్యమని పోలీసులకి అర్థమైంది!
వందల కిలో మీటర్లు ఆవేశంగా సాగిపోయిన అభిమాని ఆకాశ్ త్రిపాఠీ, దురదృష్టవశాత్తూ, రశ్మికని కలుసుకోనే లేదు. ఆమె ముంబైలో హిందీ సినిమాల హడావిడిలో ఉండగా ఈయన కర్ణాటక వెళ్లాడు. చేసేదేం లేక పోలీసులు కూడా గట్టిగా బుద్ది చెప్పి ఇంటికి పంపేశారట! ఇంతకీ, ఇంటిపేరు ‘త్రిపాఠి’ చూసి మీరేం అనుకుంటున్నారు… ఈ రశ్మిక ఫ్యాన్ ఎవరో ఉత్తరాది వాడు అనుకుంటున్నారా? కాదు… ఆయన ఇల్లు తెలంగాణలోనేనట! ఓ రశ్మిక ఫ్యాన్… హైద్రాబాదీ హై ఓల్టేజ్ స్టోరీ ఇది!