(జూన్ 21న ‘మధురానగరిలో…’కు 30 ఏళ్ళు)
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాలరెడ్డికి ‘ఎమ్’ సెంటిమెంట్ లెటర్ అని చెప్పాలి. ఆయన నిర్మించిన ‘మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మురళీకృష్ణుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మాతో పెట్టుకోకు’ చిత్రాలన్నీ అలా ‘మ’ అక్షరంతో మొదలయినవే. వాటిలో బాలకృష్ణతో తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్నీ బంపర్ హిట్స్, ఇక యాక్షన్ హీరో అర్జున్ ను తెలుగునాట పాపులర్ స్టార్ గా మార్చిందీ ‘మాపల్లెలో గోపాలుడు’ అనే చెప్పాలి. బాలయ్యతో వరుస విజయాలు చూస్తూ, మధ్యలో ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించి అలరించారు గోపాల్ రెడ్డి. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో కొన్ని మినహాయిస్తే అన్నిటికీ కోడి రామకృష్ణనే దర్శకుడు. ఓ మిస్టరీ కథతో అప్పటి వర్ధమాన నటులను పెట్టి గోపాల్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మధురానగరిలో’.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ అమ్మాయి తన అన్న కనిపించక పోవడంతో అతణ్ణి వెదుక్కుంటూ వస్తుంది. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలని నలుగురు కుర్రాళ్ళు ప్రయత్నిస్తారు. చివరకు తన అన్నను అతని స్నేహితుడే చంపాడని తెలుసుకుంటుంది. అతను ఈమెను కూడా చంపాలని చూస్తాడు. తెలివిగా తప్పించుకొని, ఆ హంతకుడే చచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఆమె వెళ్ళిపోతూ ఓ సూట్ కేస్ ను ఆ నలుగురు కుర్రాళ్ళకు ఇచ్చి వెళ్తుంది. అందులో కట్టల కొద్దీ డబ్బు, నగలు ఉంటాయి. ఆ అబ్బాయిల ఊతపదం “బుల్లెబ్బాయ్… తేడాలొచ్చాయ్ లగెత్తండ్రోయ్…” అనడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో నిరోషా ప్రధాన పాత్ర పోషించగా, చిన్నా, రవిశంకర్, శ్రీకాంత్, రియాజ్ ఖాన్ ముఖ్యభూమికల్లో కనిపించారు. శరత్ బాబు, సురేశ్ అతిథి పాత్రల్లో నటించారు. బాబు మోహన్, హొనాయ్, వై.విజయ ఇతర పాత్రల్లో కనిపించారు. సిద్ధిక్, లాల్ రాసిన కథ ఆధారంగా ‘మధురానగరిలో’ తెరకెక్కింది. గణేశ్ పాత్రో మాటలు రాయగా, వెన్నెలకంటి పాటలు పలికించారు. ఎస్. బాలకృష్ణ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నటునిగా శ్రీకాంత్ కు మంచిమార్కులే సంపాదించి పెట్టింది. ఈ చిత్రం సైతం గోపాల్ రెడ్డికి లాభాలనే చూపించింది.