హిట్టు కొట్టినోడు ఇరగదీస్తాడు అని సినిమా సామెత. పదేళ్ల క్రితం రిపబ్లిక్ డే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్
బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దాంతో అభిమానులు ఆ సంబరాన్ని తలచుకుంటూ హృతిక్ సోషల్ మీడియాలో అభినందనలతో సందడిచేశారు. అదేమన్నా సూపర్ డూపర్ హిట్టా అంటే అందేమీ కాదు. నిర్మాతకు మంచి లాభాలు చూపించిన చిత్రమే. బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసినదే. సినీ ట్రేడ్ పండిట్స్ సూపర్ హిట్
అని కితాబు కూడా ఇచ్చారు. అంతకు మించి ఏమీలేదు. మరెందుకింత హంగామా? అక్కడే ఉంది అసలు కథ! ఈ సినిమా 1990లో అమితాబ్ బచ్చన్ హీరోగా ముకుల్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన అగ్నిపథ్
కు రీమేక్ కావడం ఇక్కడ విశేషం! 1990 నాటి అగ్నిపథ్
ను నిర్మించిన యశ్ జోహార్ తనయుడు కరణ్ జోహార్ 2012 నాటి అగ్నిపథ్
ను నిర్మించడం మరో విశేషం! ఈ సినిమా ద్వారా కరణ్ జోహార్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన కరణ్ మల్హోత్రా దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ అగ్నిపథ్
ను తమ తండ్రికి నివాళిగానూ కరణ్ జోహార్ ప్రకటించారు.
అమితాబ్ బచ్చన్ వంటి మేటి నటుడు, నాటి సూపర్ స్టార్ తో యశ్ జోహార్ అగ్నిపథ్
తీసి చేతులు కాల్చుకున్నారు. నిజానికి అమితాబ్ అగ్నిపథ్
తక్కువేమీ పోగేయలేదు. ఆ రోజుల్లో ఆ వసూళ్ళు అదిరిపోయేవే వచ్చాయి. కానీ, సినిమా పెట్టుబడికి, రాబడికి పోల్చిచూస్తే నష్టమొచ్చిన చిత్రంగానే పరిగణించాల్సి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కు ఆ అగ్నిపథ్
ద్వారా ఉత్తమనటునిగా నేషనల్ అవార్డు లభించింది. అంతకు మించి అదేమీ సాధించలేదు. ఆ అవార్డు విషయంలోనూ పలు విమర్శలు వినిపించాయి. అమితాబ్ బచ్చన్ అంతకు ముందే అంతకంటే గొప్పగా నటించిన చిత్రాలు ఉన్నాయని, నిజానికి వాటితో పోలిస్తే అగ్నిపథ్
లో ఆయన నటన చెత్తగా ఉందనీ విమర్శించారు. ఇక హృతిక్ రోషన్ తో కరణ్ జోహార్ అగ్నిపథ్
ఆరంభించినప్పుడూ పలు విమర్శలు వినిపించాయి. అమితాబ్ బచ్చన్ సినిమానే సరిగా ఆడలేదు. దానికి మళ్ళీ రీమేక్ ఒకటా అన్నారు. హృతిక్ హీరోగా న్యాయం చేయలేడనీ వాదించారు. ఇలాంటి విమర్శల నడుమే కరణ్ జోహార్ అగ్నిపథ్
ను రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. మరి అలాంటప్పుడు అగ్నిపథ్
ను గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది కదా! అందుకే అగ్నిపథ్
పదేళ్ళు పూర్తయిన సందర్భాన్ని అటు హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఇటు అభిమానులు గుర్తు చేసుకున్నారు.