కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ ఓయూ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది.
రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం నిరాకరించింది. అనుమతించాలా? వద్దా అనే అంశాన్ని వీసీకే వదిలి వేసింది. అయితే యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఉన్నందున ఆయన రాకకు పాలక మండలి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ ఓయూ సందర్శన ఉంటుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ నాయకులు మాత్రం రాహుల్ ఓయూకు వెళ్లి తీరుతారని అంటున్నారు.
గత వారం రాహుల్ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించినప్పటి నుంచి ఓయూ మరోమారు ఆందోళనలకు వేదికైంది. ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థుల నిరసన ప్రదర్శనలతో క్యాంపస్ దద్దరిల్లింది. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు యూనివర్సిటీ అధికారుల తీరును తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో రాజకీయ సమావేశాలను అనుమతించరాదనే నిర్ణయం ఇప్పుడు కొత్తగా తీసుకున్నది కాదు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకూడదని గతంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. దానిని చూపిస్తూ అధికారులు రాహుల్ పర్యటనకు అనుమతించలేదు. కానీ ఆయనది రాజకీయ పర్యటన కాదని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వచ్చారు. హాస్టళ్లు, మెస్‌లకు వెళ్లి విద్యార్థులను కలిసి నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకుంటారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. అయినా ఓయూ పాలక మండలి తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే వారు రాహుల్ పర్యటనకు అనుమతివ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
తెలంగాణ ఉద్యమకాలంలో ఓయూ రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. దాంతో ఎకడమిక్‌గా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో క్యాంపస్‌లో రాజకీయ సమావేశాలను నిషేధించారు.
మరోవైపు అనుమతి లేకపోయినా రాహుల్ ఓయూకు వెళ్లితీరుతారని టిపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత వారం ప్రకటించారు. బీజేపీ నేతలు ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్‌లు పెట్టినప్పడు లేని అభ్యంతరాలు తమ విషయంలోనే ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓయూ సీఎం కేసీఆర్ ఆస్తి కాదని వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శుక్రవారం వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో దీనిపై కాంగ్రెస్ నేతలు సర్కార్‌ని ఎండగట్టే అవకాశం ఉంది.
ఓయూ అధికారులు ఇలా వ్యవహరించటం ఇదే మొదలు కాదు. 2020లో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సమయంలో ఆయన ఓయూని సందర్శించాలనుకున్నారు. కానీ పాలక మండలి అనుమతించలేదు. దాంతో ఆయన అడ్డంకులను ఛేదించుకుని క్యాంపస్‌లో ప్రవేశించారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ అలా చేస్తారో లేదో చూడాలి.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన ఓయూకు రాహుల్ వెళతానంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు సర్కార్ దిగజారుడు తనానికి నిదర్శనం అంటున్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు.
వాస్తవానికి రాహుల్ గాంధీని ఓయూకు రాకుండా ఆపటం వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏమిటో తెలియదు. కానీ కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నకాంగ్రెస్‌కు మాత్రం ఇది ఊపునిస్తోంది. టీఆర్‌ఎస్ అందించిన ఆయుధం. రాహుల్ యూనివర్సిటీకి వెళితే అంతగా ఏం కొంపలు మునుగుతాయి? ఎస్పీజీ రక్షణలో ఉండే ఆయన గంటలకు గంటలు అక్కడే ఉంటారా? మహా అయితే కాసేపు విద్యార్థులతో మాట్లాడి వెళ్లిపోతాడు. కానీ ఆయనను ఆపటం వల్ల ఇప్పుడు అదో పెద్ద విషయంగా మారింది. కొద్ది రోజుల నుంచి నిత్యం దాని మీదే చర్చ.
వాస్తవానికి రాహుల్ పర్యటనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కన్నా ఆయనను అడ్డుకుని ప్రభుత్వం చేస్తున్న ప్రచారమే ఎక్కువ. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు అనుమతి లేకపోయినా రాహుల్ ఓయూకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఆయనను అరెస్టు చేస్తుందా? అదే జరిగితే దాని మీద దేశ వ్యాప్తంగా చర్చ జరగదా? జాతీయ మీడియాలో పెద్ద వార్త కాకుండా ఉంటుందా?
రాహుల్ ఓయూ ఎపిసోడ్‌లో రచ్చ జరిగితే రాష్ట్రంలో రాజకీయ చర్చ టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌కు మారుతుంది. హుజురాబాద్ ఎన్నికల అనంతర పరిణమాలతో రాష్ట్రంలో రాజకీయ చర్చ ఎక్కువగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే సాగుతోంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ తిరిగి గాడిలో పడేందుకు రాహుల్ ఉస్మానియా ఎపిసోడ్ మంచి అవకాశంగా మారవచ్చు.
గతంలో బండి సంజయ్ దీక్ష విషయంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాగే ఓవర్ యాక్షన్ చేసిందనే అభిప్రాయం జనంలో ఉంది. కరోనా నిబంధనలను చూపి ఆయన దీక్షను అడ్డుకుంది. గ్యాస్ కట్టర్లతో గేట్లు కోసి అర్థరాత్రి ఆయనను అరెస్టు చేశారు. దాంతో అదో పెద్ద జాతీయ వార్తగా మారింది. బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆ పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చి టీఆర్‌ఎస్ సర్కార్ తీరును ఎండగట్టి వెళ్లారు.
బండి సంజయ్ విషయంలో చేసిన పోరపాటునే ప్రభుత్వం ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా చేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అయితే దీనిని పొరపాటు అని ఎందుకు అనుకోవాలి? కేసీఆర్ వ్యూహంలో భాగం అని కూడా అనుకోవచ్చుగా? నిజమే.. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సమ బలంగా ఉంటేనే అధికార పార్టీకి లాభం. ముక్కోణ పోటీలో అంతిమంగా అధికార పార్టీ లాభపడుతుంది. కనుక నాడు బీజేపీ.. నేడు కాంగ్రెస్‌ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారనే వాదనను విశ్లేషకులు సైతం ప్రస్తావిస్తున్నారు.