ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టు భాషలు అభివృద్ధి చెందాయి. అలా మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు ఉన్నాయి. ఐతే కొన్నిటికి మాత్రమే భారత రాజ్యాంగం అధికార భాష హోదా కల్పించింది. కనుక, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చలాయించే అవకాశం లేదు. దేశం పట్ల మన ప్రేమను ప్రతి భాష పట్ల కూడా చూపించాలి. మన దేశంలో ప్రాంతీయత, ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని మరవకూడదు.
కన్నడ నటుడు సుదీప్ ఇటీవల ఓ కార్యక్రమంలో సినిమా కలెక్షన్ల పరంగా హిందీ ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదని వ్యాఖ్యానించారు. దీనిపైసోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఆయన వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవ్‌గన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హిందీ జాతీయ భాష కానపుడు హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారని ప్రశ్నించాడు. హిందీ తమ మాతృభాష అని, అది ఎప్పటికైనా జాతీయ భాషనే అంటూ అజయ్ దేవ్‌గన్ ట్వీట్ చేశారు. ఫలితంగా ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. తరువాత ఇరువురి వివరణలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ, ఇంతలో సుదీప్‌కు మద్దతుగా కన్నడ రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. దాంతో ఈ వివాదం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మీడియా ముందు సుదీప్ వ్యాఖ్యలను సమర్ధించారు. సుదీప్ మాటలను అందరూ అర్థం చేసుకుని గౌరవించాలని చెప్పారు. ఇక, జెడీఎస్ నేత, మాజీ సీఎం కుమార స్వామి ఘాటుగా స్పందించారు. బీజేపీ చెప్తున్న హిందీ జాతీయ వాదాన్ని అజయ్ దేవ్‌గన్ ఇలా ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు. బీజేపీ నాటిన ఓ విత్తనం అంటువ్యాధిలా మారి దేశాన్ని విభజిస్తోందని ఆరోపించారు. మొదటి నుంచి కేంద్రంలోని హిందీ ఆధారిత రాజకీయ పార్టీలు ప్రాంతీయ భాషలను నాశనం చేయడానికి కృషి చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్నారు. మన దేశ భాషా వైవిద్ధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుని కర్తవ్యమని చెప్పారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా దీని మీద స్పందించారు. దేశంలో ఒక భాష మరో భాషపై ఆధిపత్యం చలాయించకూడదనే నాడు పెద్దలు భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారని..కొంత కాలంగా ఆ స్పూర్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
వాస్తవానికి, మోడీ ప్రధాని అయ్యాక ఈ అంశం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ‘ఒక దేశం, ఒకే భాష’ వైపు బీజేపీ సర్కార్ అడుగులు వేస్తోంది. 2017లో ఒకసారి ఈ ప్రయత్నం జరిగింది. హిందీని ముందుకు తీసుకురావాలని భావించింది. కానీ సొంత పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నీ దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి.దేశంలో మిగతా భాషలకన్నా హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు. అంత మాత్రాన అది జాతీయ భాష అయిపోతుందా? కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కేవలం తొమ్మిది కన్నా తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే హిందీ రెండో, మూడో భాషగా ఉంది. ప్రతి భాషకు తనదైన సొంత చరిత్ర ఉంది.
భాషా సమస్యను భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక, సామాజిక దృష్టి కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. మాతృభాషను ప్రేమించాలి. అలాగే జాతీయ స్థాయిలో రాణించాలంటే హిందీ అవసరమే. అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనికేషన్‌కు ఆంగ్ల పరిజ్ఞానం ముఖ్యం. అందుకే ఈ మూడు భాషలు పాఠశాల విద్యలో సబ్జెక్టులుగా ఉన్నాయి.
కొద్ది వారాల క్రితం హోం మంత్రి అమిత్ షా ఆంగ్లానికి బదులు హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. ఆయన అన్నట్టు హిందీ నేర్చుకోవాలంటే ఇంగ్లిష్‌ని ఎందుకు త్యాగం చేయాలి? ఏ భాష నేర్చుకోవాలనే దానిని ప్రజల నిర్ణయానికి వదిలివేయాలి. కాని ఫలానా భాషకు పెద్ద పీట వేయటం అంటే ఇతర భాషలను చిన్న చూపటమే అవుతుంది. ఆయా భాషలు మాట్లాడే వారిపై జరిగే సాంస్కృతిక దాడిగా దానిని పరిగణించాల్సి వస్తుంది.
హిందీ నేర్చుకోవటం అవసరం అనుకున్నప్పుడు ప్రజలే దానిని నేర్చుకుంటారు. కానీ దానిని జాతీయ అధికార భాషగా నిర్ణయించి అన్ని ప్రాంతాలపై రుద్దటం అందరికీ అంగీకారం కాదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేతక వస్తుంది. కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తెరమీదకు తెచ్చిన ప్రతిసారి తమిళనాడు, కర్నాటకలో నిరసనలు ఎగిసిపడటం చాలా కాలంగా చూస్తున్నాం.
హిందీ భాషను విస్తరించటం వెనక రాజకీయ కోణం ఉందనే వాదన ఉంది. బీజేపీపై ఉత్తారాధి పార్టీ అనే ముద్ర ఇప్పటికీ కొంత వరకు ఉంది. ఆ ముద్రను తుడిచివేయాలంటే దక్షిణాదిపై పూర్తి పట్టు సాధించాలి. అది భాషతో మాత్రమే సాధ్యం అని ఆ పార్టీ భావించి ఉండవచ్చు. వాస్తవానికి హిందీ కన్నా ఆంగ్ల భాష ప్రపంచంలో అధికులకు తెలుసు. దానిని నేర్చుకోవటం కూడా సులభం. మరి ఆంగ్లంపై బీజేపీ సర్కార్ ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు?
ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా స్థానిక బాషలను కాదని హిందీని అంగీకరించాలంటూ హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఐతే, ఓ అరడజను రాష్ట్రాలలో మాత్రమే హిందీ మాతృభాష. వాటికి సమస్య ఉండకపోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? అందుకే వాటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అస్సాం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించేది లేదని ఎప్పటికప్పుడు స్పష్టంగా చెపుతూ వస్తున్నాయి.
ఏదేమైనా హిందీ భాష మాత్రమే భారతదేశానికి గుర్తింపు తెస్తుందనే వాదన ఏమాత్రం సరికాదు. బీమారు రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ – మినహా ప్రతి రాష్ట్రానికో సొంత భాష ఉంది. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం ఎలా సమర్థనీయం? భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు అది ఆయా ప్రాంతాల సంస్కృతిక గుర్తింపని మరవద్దు!!