తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయని పేర్కొంది. అటు తెలంగాణలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకోవడంతో తెల్లవారినా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు రోడ్లు కనిపించక ఇక్కట్లు పడుతున్నారు.
Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య
శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో కూడా అత్యల్పంగా 12.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో అత్యల్పంగా 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆది, సోమవారాల్లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.