కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ బేధాలు పూర్తిగా తొలగిపోయాయని సీనియర్ నేత వీ హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు అప్పట్లో స్వర్గీయ పీజేఆర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, ఆయన కొడుకుగా విష్ణు వర్ధన్ పార్టీని వీడే ప్రసక్తే లేదని వెల్లడించారు. చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే విష్ణు కొనసాగుతాడని అన్నారు. విష్ణు ఇచ్చిన లంచ్ భేటీతో అందరి మధ్య ఉండే అపోహలు పోయాయన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకమని చెప్పిన ఆయన.. సోనియా గాందీ అతనిని టీపీసీసీ చీఫ్‌గా అపాయింట్ చేసిందని, అతని నాయకత్వాన్ని తాము బలపరుస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుపోవాలని కోరారు. తన ఇష్యూ మీద హైకమాండ్‌తో మాట్లాడుతానని.. ఇక్కడ (విష్ణు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం) మాట్లాడితే తనకు తానే అవమానపర్చుకున్నట్టు అవుతుందన్నారు. అందరం కలిసి పని చేద్దామని రేవంత్ సహా అందరికీ అప్పీల్ చేస్తున్నానని హనుమంతరావు చెప్పారు.