తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అయితే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. కాంగ్రెస్ సైతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని రంగంలోకి దించి వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. అంతేకాకుండా మరోసారి రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది తెలంగాణ కాంగ్రెస్ అయితే.. ఇప్పుడు తాజాగా మాజీ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ నియామకం జరుగుతుందన్నారు.
అభ్యర్ధుల వడపోత ప్రారంభం అవుతుందని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అని ఆయన తెలిపారు. మెజారిటీ సీట్లు మేము గెలుస్తామని, ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ప్రక్రియ మొదలైందని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలు వేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. గల్లీలో లొల్లి..ఢిల్లీలో దోస్తీ నడుస్తుంది ఇద్దరి మధ్య అంటూ ఎద్దేవా చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమన్న ఉత్తమ్.. పార్టీ లో విభేదాలు ఏం లేవని స్పష్టం చేశారు.