అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళల కోసం పలు ఆఫర్లను కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మహిళా ప్రయాణికుల కోసం రద్దీ ఆధారంగా ప్రత్యేకంగా ట్రిప్పులు నడుపుతామన్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టాప్‌లలో మహిళా వ్యాపారులకు ఉన్న స్టాళ్లకు సంబంధించి ఈ నెల 31 వరకు ఎలాంటి ఛార్జీలు తీసుకోమని ప్రకటించారు. పూర్తిగా ఉచితంగా ఈ నెల 31 వరకు స్టాళ్లను కేటాయిస్తామన్నారు. అలాగే ఆసక్తి ఉన్న మహిళలకు 30 రోజుల పాటు ఉచితంగా హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని తెలిపారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థలను ఉపయోగించుకుంటామన్నారు.