వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు కూలీలు, కౌలు రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆదివాసీలకు పోడు భూములపై యాజమాన్య హక్కు ఉంటుందన్నారు. రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని రేవంత్ వెల్లడించారు. పసుపు రైతులను ఆదుకునేందుకు క్వింటాల్ పసుపును రూ.12వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మగౌరవం అని.. రైతుల పక్షాన పోరాడే విషయంపై కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023లో సోనియమ్మ రాజ్యం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.