ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను సంబోధించారు. తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై స్వయంగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ప్రజలకు స్పష్టత వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌లు
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, అలాగే మైనారిటీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజహరుద్దీన్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానాన్ని ఆశించారు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి శాసన మండలిలో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ ఎమ్మెల్సీ రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అమీర్ అలీ ఖాన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో పక్కన పెట్టింది.
విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన హెడ్ మాస్టర్ అరెస్ట్!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించిన వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం వెంటనే అతడిపై చర్యలు తీసుకుంది. అయితే, ఈ ఆగస్టు 26వ తేదీన కుంభకోణంలోని అర్జుని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక, ఆరేళ్ల బాలుడు రవి భాళవి నోరు గట్టిగా మూసి, బలవంతంగా నేలపైన ఉన్న హెడ్ మాస్టర్ మహేష్ చౌదరి పడుకోబెట్టి.. అతని వెన్నెముకపై కర్ర పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయమైంది. అలాగే, మరో వైపు ఇంకో చిన్నారిని కూడా సదరు ప్రిన్సిపాల్ చితకబాదుతుండటం కనిపిస్తుంది.
పబ్లిక్‌గా హీరోయిన్‌తో స్టార్ హీరో సరసాలు.. స్టేజ్‌పైనే వివాదం!
భారతదేశంలో సినిమాలంటే, సినీ నటీనటులంటే దేవుళ్లు అన్న స్థాయిలో అభిమానులు ఉంటారు. అలాంటప్పుడు వారు చేసే ప్రతి చర్య పై కోట్లాది మంది కళ్లుంటాయి. అందుకే సెలబ్రిటీలు ఎప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అయితే కొందరు స్టార్‌లు ఆ హద్దులు దాటిపోతూ వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్‌లో హీరోయిన్‌తో సరసాలు ఆడుతూ కెమెరాల్లో చిక్కుకోవడంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. స్టేజ్‌పైనే జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ‘కోట్ల మంది చూస్తున్నారనే బుద్ధి ఉండక్కర్లేదా’’ అంటూ ఆగ్రహం వ్యాక్తం చేస్తున్నారు. నటులు, ప్రముఖులు జాగ్రత్తగా ప్రవర్తించాలి అని సోషల్ మీడియాలో నెటిజన్లు వాపోతున్నారు.
యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై చేయి చేసుకున్న ఎస్ఐ..
తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. యూరియా కోసం రాత్రింబవళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుకు పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు. క్యూ లైన్లో నిలబడిన రైతులపై మరికల్ ఎస్ ఐ రాము జులుం ప్రదర్శించాడు. యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై ఎస్ఐ చేయి చేసుకున్నాడు. యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టాడు. ఈ ఘటనతో రైతు షాక్ కు గురయ్యాడు. రైతులు, రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దిరెడ్డి తాడిపత్రి ఎంట్రీపై జేసీ సంచలన వ్యాఖ్యలు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి వెళ్లడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో, ఇన్ని రోజులు అడ్డుంకులు ఎదుర్కొన్న పెద్దారెడ్డి.. ఇప్పుడు తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా.. తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తుచేశారు.. అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని పేర్కొన్నారు.. అధికారం అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించి కొట్టిన ఘనత పెద్దారెడ్డిది అని మండిపడ్డారు.. వైసీపీ హయాంలో పోలీసులు అండతో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేసిన ఘనత పెద్దారెడ్డిది అని విమర్శించారు.. తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డి కుటుంబానికి అర్హత లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి భారత సైన్యం ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది. తాజాగా మరొక ఎన్‌కౌంటర్ జరిగింది. 100కు పైగా చొరబాటు ప్రయత్నాలు వెనుక ఉన్న మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన కీలక ఉగ్రవాది బాగు ఖాన్‌ను సైన్యం అతమార్చింది. శనివారం గురేజ్ ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన బాగు ఖాన్ భద్రతా దళాలకు తారసపడ్డాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో బాగు ఖాన్ అలియాస్ సమందర్ చాచా హతమయ్యాడు. ఇతడు 100కు పైగా చొరబాటు ప్రయత్నాలకు మూల కారకుడని సైన్యం పేర్కొంది. 1995 నుంచి పీవోకేలో స్థిరపడ్డాడు. చొరబాట్లలో ఇతడు అత్యంత ప్రభావవంతమైన సూత్రధారుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. నౌషెరా నార్ ప్రాంతంలో మరొక ఉగ్రవాదితో కలిసి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు హతమార్చాయి.
ముగిసిన మోడీ జపాన్ టూర్.. చైనాకు పయనం
ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తల సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. శనివారం బుల్లెట్ ట్రైన్‌లో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి విహరించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. జపాన్ పర్యటన ముగియడంతో మోడీ చైనాకు బయల్దేరారు. చైనాలోని టియాంజిన్‌కు విమానంలో బయల్దేరారు. ఇక చైనాకు బయల్దేరే ముందు మోడీకి జపాన్ ప్రధాని ఇషిబా ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్, మోడీ ఒకే వేదికపై కలవనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు.
వీడియోలో ఉన్నది కోటంరెడ్డి మనుషులే..! ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో..?
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర అంటూ ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ విషయంలోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.. నాటకాల రాయుళ్లు అందరూ ఒక్కో డ్రామా వేస్తున్నారు.. అందులో ర్యాంకింగ్ ఇస్తే శ్రీధర్ రెడ్డికి నంబర్ వన్ స్థానం వస్తుందని ఎద్దేవా చేశారు.. రౌడీ గ్యాంగ్‌లను పెంచిపోషించింది శ్రీధర్ రెడ్డి కాదా..? అని నిలదీశారు.. పెరోల్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టే.. దానిని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు..
రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తాము ఆఫర్ చేసిన పదవిని ద్రవిడ్ వద్దన్నారని తెలిపింది. ఆర్‌ఆర్‌కు సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడు ఒక సీజన్ వరకే హెడ్ కోచ్‌గా సేవలు అందించారు. ఇక రాజస్థాన్ కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టనుంది.