మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..?
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. ఈ సందర్భంగా రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుంది అన్నారు. సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల ముబైల్ సిగ్నల్స్ గుర్తించాం.. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది.. రెండు సెల్ టవర్ల సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో ఉండడంతో విచారణ చేయడం ఆలస్యం అవుతోంది.. మిగిలిన 60 మందిని విచారించాల్సి ఉంది.. విచారణలో వేగం పెంచామని ఆయన పేర్కొన్నారు. ఇక, గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వొద్దని స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది.. కుటుంబ సభ్యుల పైనా ఆరోపణలు రావడం నిజమే వాటిని కూడా పరిశీలిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ చెప్పుకొచ్చారు.
నాలాల ఆక్రమణలను తొలగిస్తాం.. బాధితులకు టిడ్కో ఇళ్లు ఇస్తాం..
విజయవాడలో పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీఎంసీ ఇంజినీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 5 వందల కోట్ల రూపాయలతో పనులను 2014- 2019 మధ్య ప్రారంభించాం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు నిలిపేసింది అని ఆయన ఆరోపించారు. ఇక, 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. డ్రైన్స్ కి అడ్డంగా నిర్మించిన ఇళ్లు తొలగించి.. టిడ్కో ఇళ్లు ఇచ్చేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.. ఆరు నెలల్లో డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని వెల్లడించారు. కొంతమంది డ్రైన్లు పూడ్చి ప్రహరీ గోడలు నిర్మించారు.. వాటిని తొలగించాలి అని సూచించారు. బుడమేరు వాగు ఆక్రమాణల తొలగింపుకు తగిన చర్యలు తీసుకుంటామని పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి.. BRSV సభలో మాజీ మంత్రి హాట్ కామెంట్స్..!
ఉప్పల్‌లో జరిగిన BRSV రాష్ట్రస్థాయి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ నేతలలో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడు. ఎప్పుడూ జై మోడీ, జై ఢిల్లీ అంటున్నాడు.. కానీ, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ మంది పడ్డారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నాయకులు ప్రజల బాటలో లేరని, రాజీనామా చేయకుండా పక్కకి నడిచారని గుర్తుచేశారు. రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తిచూపే బదులు, దాన్ని మరుగున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు చంద్రబాబు, రెండవ పేరు రేవంత్ రెడ్డిదే రాయాలి అంటూ హాట్ సిమెంట్స్ చేశారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ పాలనలో తెలంగాణ తల్లి, కాకతీయ తోరణాన్ని, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించడమే ముఖ్య లక్ష్యంగా మారిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వ్యక్తి సీఎం అయ్యాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీహార్‌లో దారుణం.. అంబులెన్స్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్‌లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. బీహార్‌లోని బోధ్‌గయ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జూలై 24న బీఎంపీ-3 పరేడ్ గ్రౌండ్‌లో హోంగార్డు నియామకాలు జరిగాయి.. రేసులో పాల్గొన్న ఒక యువతి స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇదే అదునుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ
కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండే పార్టీ అని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి ఇస్తామని బీజేపీ ప్రకటించినా, శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి అకారణంగా తొలగించడం బీజేపీ మతిమరుపును చూపుతోందని అన్నారు. కులగణనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులు, శాసనమండలి స్థానాలను ఇచ్చి బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచిందని ఆయన తెలిపారు. కానీ బీజేపీ మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన రాంచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం బలహీన వర్గాలకు వ్యతిరేక ధోరణి అని పేర్కొన్నారు.
AIను పరిపాలనలో ఉపయోగించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలి
ఎంసీఆర్హెచ్ఆర్డీ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. సమావేశానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్ బీ ఈఎన్‌సి జయ భారతి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంసీఆర్హెచ్ఆర్డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని ఆకాంక్షించారు. దీనికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సంస్థ స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా పురోగమించాలని సూచించారు. పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. దేశంలోనే మొట్టమొదట పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అందరికీ సమగ్ర శిక్షణ అందించాలని సూచించారు.
హైకోర్టు కీలక తీర్పు.. అలాంటి సందర్భంలో కూడా సైనికుడికి అమరవీరుడి హోదా లభిస్తుంది..
ఉగ్రవాదులు, శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను, సంపదను రక్షిస్తున్న సైనికుల కృషి మరువలేనిది. ఇళ్లు వాకిలి వదిలి అయినా వారికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటారు జవాన్లు. సైనిక ఆపరేషన్స్ లో సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తుంటారు. అలాంటి వారిని అమర వీరుడి హోదాతో ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి. అయితే సైనిక ఆపరేషన్ లో సైనికుడు తన తోటి సైనికుడు జరిపిన కాల్పుల్లో మరణిస్తే.. అతనికి కూడా యుద్ధ అమరవీరుడు అనే హోదా ఇవ్వబడుతుందని పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అతని కుటుంబానికి యుద్ధంలో అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఇచ్చే ప్రయోజనాలే లభిస్తాయని పేర్కొంది. సైనికుడి తల్లి చేసిన పెన్షన్ క్లెయిమ్ చాలా ఆలస్యంగా చేయబడిందని, కాబట్టి దానిని అంగీకరించలేమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అనుపీందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ దీపక్ మంచండలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
సికింద్రాబాద్ IVF సెంటర్ షాకింగ్ స్కామ్.. భర్త వీర్యానికి బదులు మరొకరిది.?
నగరంలోని సికింద్రాబాద్‌లో గల ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. పిల్లల కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన ఓ దంపతులకు ఎదురైన ఊహించని సంఘటన, ఆ వైద్య కేంద్రం విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, సంతానం లేని ఓ మహిళ సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఆమె తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని వైద్యురాలిని కోరారు. అయితే, చికిత్స అనంతరం అనుమానం వచ్చిన ఆ దంపతులు, కడుపులో ఉన్న శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. శిశువు డీఎన్‌ఏ, భర్త డీఎన్‌ఏతో సరిపోలకపోవడం, వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలడంతో దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు.. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున మొత్తం రూ. 33 కోట్లను తక్షణమే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, సహాయక చర్యలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఈ నిధులు వర్షాల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి, నష్టం జరిగిన ప్రాంతాలలో తక్షణ మరమ్మతు పనులు చేయడానికి ఉపయోగపడతాయి. జిల్లా యంత్రాంగాలు ఈ నిధులను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విచిత్రం.. నాగుపామునే కరిచి చంపిన ఏడాది బాలుడు..
బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా, నాగుపాము అంటేనే ఒక్కొక్కరు భయపడి చస్తారు. అలాంటి ఓ ఏడాది వయసు ఉన్న బాలుడు, నాగుపామునే కరిచి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెట్టియ్య గ్రామంలోని ఏడాది వయసు ఉన్న బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఓ నాగుపాము అతడి చేతికి చుట్టుకుంది. ఆ పసివాడు, అది భయంకరమైన పాము అని తెలియక, దానిని గట్టిగా పళ్లతో కొరికాడు. దీంతో పాము చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గోవిందగా గుర్తించిన బాలుడు కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పిల్లాడు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ప్రతిచర్యగా పామును పళ్లతో కొరికి చంపేసినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల చికిత్స తర్వాత పిల్లవాడు గోవింద పరిస్థితి క్షీణించడంతో, అతడిని కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) నుంచి బెట్టియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల-ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం, పిల్లవాడి ఆరోగ్యం స్థిరంగా ఉందని, అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెబుతున్నారు.